‘ఉన్నతం‘గా వదులుకునేలా చేయండి
- గ్యాస్ సబ్సిడీ వదులుకునేలా
- ఉన్నతవర్గాల్లో ప్రచారం చేయాలి
- మరింతమంది పేదలకు అందేలా అవగాహన కల్పించాలి
- రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియంశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నతవర్గాలూ గ్యాస్ సబ్సిడీ ని వదులుకోండి..జాతి నిర్మాణానికి సహకరించండి’ అనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఉన్నతవర్గాలు వదులుకునే సబ్సిడీతో మరింతమంది పేదలకు ఎల్పీజీని అందించే అవకాశం ఉంటుందని, దీనిద్వారా దీర్ఘకాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో కూడిన లేఖను పంపింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరుకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగచూరడంతో పిల్లలు, మహిళలు కాలుష్యం బారినపడుతున్నారని పేర్కొంది. ప్రతి ఏటా సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.6 వేల రాయితీని ప్రభుత్వం అందిస్తోందని, ఉన్నతవర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకువస్తే ఆర్థికంగా వెనుకబడిన మరింతమందికి గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎల్పీజీ సబ్సిడీని వదులకునే విధానాన్ని సైతం ప్రభుత్వం సరళీకృతం చేసిందని, సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి... లేదా డిస్ట్రిబ్యూటర్లకు తెలిపైనా సబ్సిడీని వదులుకోవచ్చని పేర్కొంది. పొగవచ్చే పొయ్యిలతో వంట చేసుకుంటున్న పేద ప్రజల సంక్షేమం, జాతి నిర్మాణం కోసం ఉన్నతవర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా ప్రచారం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.