నగదు బదిలీ పథకం అమలవుతున్న హైదరాబాద్‌లో వంటగ్యాస్ ధర మండిపోతోంది. తాజాగా సిలిండర్‌పై రూ.72.50 పైసలు మేరకు పెరగడంతో రీఫిల్లింగ్ ధర రూ.1097లకు చేరింది. సోమవారం నుండి పెరిగిన ధర అమల్లోకి వచ్చింది. నగదు బదిలీ (డీబీటీ) పూర్తిస్థాయిలో అమలుకాక, అమలైనా సబ్సిడీపై పరిమితితో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే.. పెరుగుతున్న వంటగ్యాస్ ధర ప్రజలకు మరింత భారంగా మారుతోంది. కేవలం నెల వ్యత్యాసంలోనే సిలిండర్ ధర రూ.135 పెరిగినట్లయింది. గత నెలలో సిలిండర్‌పై రూ. 62.50 పైసలు పెరగగా, తాజాగా మరో రూ.72.50 పెరిగింది. మరోవైపు డీబీటీ కారణంగా వినియోగదారులు సిలిండర్‌పై రూ.79 అదనంగా భరించక తప్పడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై అందించిన సబ్సిడీ రూ.25కు ఎగనామం పెట్టడమే కాకుండా విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ముక్కుపిండి వసూలు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన ధరతో వ్యాట్‌పన్ను రూ.54కు చేరింది. డీబీటీ అమలు లేని నగరాలు, జిల్లాల్లో మాత్రం సిలిండర్ రీఫిల్లింగ్ రూ.412.50లకు మాత్రమే లభిస్తోంది. ఇక్కడ మాత్రం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీబీటీ వర్తించిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ నగదు బ్యాంక్‌లో జమ అవుతోంది. మిగతా వినియోగదారులు పూర్తి ధరను భరించక తప్పడం లేదు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 12 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. దీంతో మిగతా 14 లక్షల మందికి పెరుగుతున్న ధర పెనుభారంగా మారుతోంది. ఆధార్, బ్యాంక్‌లతో అనుసంధానమైన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సిలిండర్ ధరను బట్టి సబ్సిడీ విడుదల అవుతోంది. గ్రేటర్‌లో డీబీటీ అమలు ప్రారంభమైన జూన్‌లో రూ.420, జూలైలో రూ.458, ఆగస్టులో రూ.498. సెప్టెంబర్‌లో రూ. 558.30 పైసలు జమ అయ్యాయి. తాజాగా ఈ నెలలో రూ.600కు పైగా నగదు బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. తాజా పెంపుతో నెలకు ఒక సిలిండర్ వినియోగం లెక్కన గ్రేటర్ హై దరాబాద్ ప్రజలపై సుమారు రూ.18.88 కోట్ల భారం పడుతుందని అంచనా.