Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Cockpit exchange of Ahmedabad Air India pilots before crash1
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే

ఢిల్లీ: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్‌ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్‌ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్‌ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట​్‌ వాయిస్‌లో పైలట్‌ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్‌ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్‌ 12న ఎయిర్‌ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్‌లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025

Netizens Satirical Comments On Pawan Kalyan Over Hindi2
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..

రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న.

Cant Comment Investigation Air India Initial Crash Report3
‘నో కామెంట్‌’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం

న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్‌ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్‌ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Radhika Yadav Case Another Twist Full Details4
రాధికా యాదవ్‌ హత్యకు కారణం అదేనా?

గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ (25)ను తండ్రి దీపక్‌ యాదవ్‌ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. రాధిక హత్య కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్‌ యాదవ్‌ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్‌మేట్‌ అని తెలుస్తోంది.అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. రాధిక సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అనంతరం, రీల్స్‌ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, రాధిక హత్య కేసులో దీపక్‌ యాదవ్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీసు కస్టడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న రాధిక తల్లి ఏం చేస్తున్నారన్నది కూడా విచారిస్తున్నట్లు గురుగ్రామ్‌ పోలీసు అధికారి సందీప్‌సింగ్‌ తెలిపారు. రాధికా యాదవ్‌ గురుగ్రామ్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి దీపక్‌ యాదవ్‌ వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయింది. దీపక్‌ యాదవ్‌కు గురుగ్రామ్‌లో చాలా ఆస్తులు ఉన్నాయి. అద్దెలు కూడా వస్తాయి. ఈ కారణంగానే టెన్నిస్‌ అకాడమీ నడపాల్సిన అవసరం ఏముందని ఆయన కుమార్తెతో తరచూ వాదన పడుతుండేవారని తెలిసింది. #RadhikaYadav | Tennis Player Radhika Yadav Shot Dead By Father In GurugramInam Ul Haque, co-actor in Radhika Yadav’s music video, opens up about their time filming together amid the shocking murder investigation@akankshaswarups | #RadhikaYadav pic.twitter.com/HdWJhmNJ7Q— News18 (@CNNnews18) July 11, 2025అలాగే, రాధిక గతేడాది ఓ కళాకారుడితో కలిసి మ్యూజిక్‌ రీల్స్‌ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా తెలుస్తోంది. ఓ పాటలో రాధిక నటించింది. ఈ వీడియోతో రాధికతో పాటు ఇనాముల్ అనే వ్యక్తి నటించాడు. ఇక, ఈ పాటలో వారిద్దరూ ఎంతో సన్నిహితంగా కూడా ఉన్నారు. అయితే, ఈ పాటకు వీడియో అయిపోయిన తర్వాత ఆమెతో తాను ఎలాంటి కాంటాక్ట్‌లో తాను లేనని ఇనాముల్‌ చెప్పుకొచ్చాడు. What will people say? This thinking took his daughter’s lifeTennis player Radhika Yadav was shot dead by her own father over her independence, tennis academy, and appearance in a music video. pic.twitter.com/U4jQTB1h4z— Why Crime (@WhyNeews) July 12, 2025

MLC 2025: Pollard Pooran Shines MI New York Beat TSK Enters Final5
పొలార్డ్‌ విధ్వంసం.. దంచికొట్టిన పూరన్‌.. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్‌

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్‌ జట్టు ఫైనల్‌ చేరింది. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్‌ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్‌- టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి.డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ కింగ్స్‌ ఆదిలోనే ఓపెనర్‌ స్మిత్‌ పాటిల్‌ (9) వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమ్‌ రంజానే (1), మార్కస్‌ స్టొయినిస్‌ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.రాణించిన డుప్లెసిస్‌..బ్యాట్‌ ఝులిపించిన అకీల్‌ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (Faf Du Plesis) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్‌ అకీల్‌ హుసేన్‌ బ్యాట్‌ ఝులిపించాడు.కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్‌ నాటౌట్‌గా నిలవగా.. డొనొవాన్‌ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్‌) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్‌ కారణంగా సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.ఎంఐ న్యూయార్క్‌ బౌలర్లలో ట్రిస్టస్‌ లస్‌ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్‌ ఉగార్కర్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్‌ ఆరంభంలోనే క్వింటన్‌ డి కాక్‌ (6) రూపంలో కీలక వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.పూరన్‌ ధనాధన్‌ఈ క్రమంలో మరో ఓపెనర్‌ మోనాంక్‌ పటేల్‌ (49) ఇన్నింగ్స్‌ చక్కదిద్దగా.. నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC— MI New York (@MINYCricket) July 12, 2025పొలార్డ్‌ విధ్వంసంమరోవైపు.. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్‌తో కలిసి ఎంఐ న్యూయార్క్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌, పొలార్డ్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో రెండోసారి ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది.DeathTaxesPollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025 కాగా టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌- వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్‌ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్‌ (16) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్‌ రూపంలో సూపర్‌ కింగ్స్‌కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.మరోవైపు.. శాన్‌ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్‌ జట్టు.. తాజాగా సూపర్‌ కింగ్స్‌పై కూడా గెలిచి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్‌లో ఆదివారం (జూలై 13) టైటిల్‌ పోరులో వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌

Centre Pushes E Truck Adoption with PM E DRIVE Incentive6
ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్‌!

గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాణా దిశగా భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్‌) పథకం కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలతో నడుస్తున్న వాహనాల స్థానే స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు (ఈ-ట్రక్)ను కొనుగోలు చేస్తే రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.పీఎం ఈ-డ్రైవ్ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుఈ-ట్రక్కుపై రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు.మొత్తం దేశవ్యాప్తంగా 5,600 ఈ-ట్రక్కులకు ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తారు.సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ-ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది.ట్రక్కులతోపాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు.నిబంధనలివే..పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)స్క్రాపేజ్ రుజువును ఈ ప్రోత్సాహకాల కోసం సమర్పించాల్సి ఉంటుంది.పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ-ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి.ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేయాలి.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్(సీడీ) లేని కొనుగోలుదారులు డిజిఈఎల్‌డీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సీడీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్‌ డీలర్ ద్వారా నిర్వహిస్తారు.అన్ని వివరాలు ధ్రువీకరించిన తరువాత డీలర్ కొనుగోలుదారు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సాహకాన్ని నేరుగా ఈ-ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్‌ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీసుస్థిర రవాణా దిశగా అడుగులుభారతదేశాన్ని గ్రీన్‌ రవాణా ఎకోసిస్టమ్‌వైపు నడిపించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి నొక్కి చెప్పారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించే భారత్‌ లక్ష్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్ విజన్‌కు ఈ ప్రయత్నం కూడా తోడవుతుందన్నారు.

Jaishankar to Visit China First time in Five Years7
ఐదేళ్ల తర్వాత చైనాకు జైశంకర్‌.. ఎందుకెళుతున్నారంటే..

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత చైనాలో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వెంబడి 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ పర్యటనలో జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి ముందు ఆయన బీజింగ్‌లో చైనా ప్రతినిధి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. కాగా సరిహద్దు వివాదంపై భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని వార్తా సంస్థ పీటీఐ గతంలో తెలిపింది. ఇరు దేశాలు తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.భారత్‌- చైనా సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని జైశంకర్ ఇటీవల అన్నారు. ఈ పర్యటనలో జైశంకర్.. సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వం, భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. 2020 మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. దాదాపు ఐదేళ విరామం తర్వాత గత నెలలో ఇరు దేశాలు కైలాస మానసరోవర యాత్రను తిరిగి ప్రారంభించాయి.

Prakash Raj Counter To Pawan Kalyan On Hindi controversy8
ఛి…ఛీ.. అంటూ 'పవన్‌'పై ప్రకాష్ రాజ్ ఫైర్‌.. లక్షల్లో ట్వీట్లు

'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్‌ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్‌ ఇప్పుడు 'ఏ మేరా జహా' అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా అందరి నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోంది. #POLITICALJOKERPK అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్‌కు కౌంటర్‌గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. తాజాగా ప్రముఖ సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్పందించారు.గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మండిపడ్డారు. తన ఎక్స్‌ పేజీలో పవన్‌ చేసిన కామెంట్స్‌ను చేర్చి 'ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking' అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు కూడా చాలామంది సపోర్ట్‌గా ఆయన చేసిన పోస్ట్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ బాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్‌లు, మాట్లాడిన మాటలను వైరల్‌ చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్‌ అని పిలుపునిచ్చిన పవన్‌ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్‌ భయపడి నట్టే ఇప్పుడు జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్‌ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది. అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ విశ్లేషకులు కోరుతున్నారు.ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj— Prakash Raj (@prakashraaj) July 11, 2025

Chirag Paswan gets a death threat through social media9
Bihar: ‘లేపేస్తామంటూ..’ చిరాగ్‌ పాశ్వాన్‌కు హెచ్చరిక?

పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్‌నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్‌జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్‌కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

Unfavorable weather in India10
గతి తప్పిన వాతావరణం

న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్‌ టవర్‌ ఆఫ్‌ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి? వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement