సాక్షి, హైదరాబాద్ : పది మందిలో ప్రత్యేకంగా ఉండాలని అందరూ ఆరాటపడతారు. ముఖారవిందం మెరిసి పోయేలా సౌందర్య సాధనాలతో మెరుగులు అద్దుతారు.. ఇది నిన్నటి మాట.. మరి నేడు.. దుమ్ము, ధూళితో కాంతి విహీనంగా తయారవుతున్న తమ చర్మాన్ని కాపాడుకునేందుకు యువత ప్రయత్నిస్తోంది. దీంతో ఒకప్పుడు విరివిగా వాడిన సౌందర్య సాధనాల స్థానంలో.. చర్మ సంరక్షణ సాధనాలు వచ్చి చేరాయి.
ఇటీవల ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో పలు మార్కెటింగ్ కంపెనీలు జరిపిన సర్వేల్లో ఈ విష యాలు వెల్లడయ్యాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య ఉద్గా రాలు అధికంగా ఉండటం వల్ల చర్మం పొడి బారుతుండటం, శిరోజాలు రాలిపోతుండటం వంటి కారణాల వల్ల కాంతి విహీనంగా పెరుగుతున్న వారి సంఖ్య అధిక మైందని వెల్లడైంది.
దీంతో ఇప్పుడు మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఎండ వేడిమి, కాలుష్య కారకాల నుంచి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీన్ని గమనించిన కంపెనీలు రెండేళ్లుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులను గణనీయంగా పెంచాయి. అంతే కాదు అమ్మకాల్లోనూ భారీగా వృద్ధి రేటు నమోదైంది.
25 నుంచి 30 శాతం వృద్ధి
కాలుష్యం, ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ కోసం కంపెనీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల అమ్మకాల్లో ఏకంగా 25 నుంచి 30 శాతం వృద్ధి చోటు చేసుకుందని నీల్సన్ తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇటీవల వెల్లడించింది.
కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం, ఎండవేడిమి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాలన్న తపన వల్ల వాటి ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి, సౌందర్య సాధనాల ఉత్పత్తుల గిరాకీ తగ్గిందని ఆ సర్వే తేల్చింది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని హెచ్‌యూఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. సౌందర్య సాధనాల అమ్మకాల్లో 2 నుంచి 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సౌందర్య సాధనాల కంటే విష వాయువుల నుంచి రక్షించే సౌందర్య సంరక్షణ సాధనాల వైపు ఎక్కువ ఆసక్తి చూపడమే దీనికి కారణమని ఓ మార్కెటింగ్ నిపుణుడు విశ్లేషించారు.
కొంతకాలంగా చర్మ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే బడా సంస్థలు కలర్ కాస్మొటిక్స్ కంటే.. ఫేస్‌వాష్, స్క్రబ్స్ తయారీపై దృష్టిసారించాయి. రాబోయే దశాబ్ద కాలంలో కాలుష్యం బారీ నుంచి కాపాడే ఉత్పత్తుల వినియోగం ఏటా కనీసం 5 శాతం వృద్ధి చెందుతుందని ఫ్యూచర్ మార్కెట్ ఇన్‌సైట్స్ అనే గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ప్రకృతి, సహాజసిద్ధ (సేంద్రీయ) ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు.. కాస్మొటిక్స్‌లోనూ ఈ తరహా సాధనాలకు పెద్దపీట వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment