పాములు పట్టి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
భద్రంగా చూసుకుంటున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్
వర్షాకాలంలో, నాలాల పక్కన ఇళ్ల్లల్లోకి తరచూ పాములు
భయం లేకుండా ధైర్యంగా పాములను పడుతున్న యువకులు
పాములపై ప్రేమతో సొసైటీలో చేరుతున్న పలువురు
జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో తమ వంతు కృషి..
పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటాం. ఇక ఇంట్లోకి వచి్చందంటే కథ వేరేలా ఉంటుంది. భయానికి చెమటలతో సగం తడిచిపోతుంటాం. ఇంకొందరైతే తెగ హడావుడి చేసి ఎలాగైనా చంపేయాలని చూస్తుంటారు. కానీ వీరు మాత్రం పాములు కనిపిస్తే చాలు ప్రేమగా వాటిని పట్టుకుంటారు. వాటికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇంతకీ వాళ్లెవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్లే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్.. వీరి గురించి మరిన్ని విశేషాలు..
ఎవరి ఇంటికైనా పాములు వచ్చాయని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారు. ఏటా దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకూ పాములను పట్టి.. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఇటు మనుషుల ప్రాణాలతో పాటు పాములను కూడా కాపాడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు.
వర్షాకాలంలో ఎక్కువ..
సాధారణంగా పాములు బొరియల్లో తలదాచుకుంటాయి. వర్షాకాలంలో ఆ బొరియల్లోకి వరద నీరు చేరుతుండటంతో బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి వస్తుంటాయి. అంతేకాకుండా నాళాల పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా పాములు చేరుతుంటాయి. అంతేకానీ మనకు ఎలాంటి హానీ తలపెట్టబోవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వాటికి మనం హాని చేస్తున్నామని అనిపిస్తేనే అవి కాటేస్తాయని పేర్కొంటున్నారు.
స్వచ్ఛందంగా సేవలు..
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను 1995లో రాజ్‌కుమార్ కానూరి స్థాపించారు. పాములు జీవవైవిధ్యానికి ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెబుతుండేవారు. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో.. ఇప్పుడు ఏకంగా 150 మంది వలంటీర్లు ఉన్నారు. పాములపై ప్రేమ.. పాములను పట్టుకోవాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు, స్టూడెంట్స్ తమకు ఉన్న ఖాళీ సమయాల్లో స్నేక్ క్యాచింగ్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. స్నేక్ క్యాచింగ్ అంటే ఆసక్తి ఉన్న వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను సంప్రదిస్తే.. వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడైనా పాము గురించి సమాచారం అందగానే దగ్గరలో ఉన్న వలంటీరు అక్కడికి వెళ్లి వాటిని రక్షిస్తారు.
జీవ వైవిధ్యానికి ముఖ్యం..
ప్రకృతిలో అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయని, ఏ ప్రాణినీ చంపే అధికారం ఎవరికీ లేదని ఈ సంస్థ వాళ్లు చెబుతున్నారు. కాకపోతే పట్టణీకరణ కారణంగా భవన నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతుండటంతో పాములు, ఇతర జంతువుల ఆవాసాలైన అడవులను నరికేస్తున్నారని, ఈ నేపథ్యంలో వాటికి ఆవాసం లేకపోవడంతో ఇళ్ల్లల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక, పాములు జీవవైవిధ్యానికి, మనిషి జాతి మనుగడకు చాలా కీలకమని, వాటిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలు సుస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆహార భద్రతలో కూడా పాములు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అందుకే పాములపై తాము పరిశోధనలు చేస్తున్నామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలో పరిశోధనా విభాగం ఉందని, వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పాముల గురించి పరిశోధనలు చేస్తుంటామని వివరించారు. ఈ విషయంలో అటవీ శాఖ, జూపార్కు అధికారులు తమకు ఎంతో మద్దతు ఇస్తుంటారని చెబుతున్నారు.
అవగాహన అవసరం..
పాములన్నీ విషపూరితం కాదు.. ఎవరికీ హాని చేయని పాములు కూడా ఉంటాయి. వాటిని చూసి అనవసరంగా భయపడి వాటిని చంపొద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటీర్లు చెబుతున్నారు. పాముల గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఏటా దాదాపు 200 నుంచి 300 వరకూ అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటామని వివరించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలి్పస్తుంటామని పేర్కొంటున్నారు. దీంతో పాటు అడవుల్లో అరుదైన జాతి పాములను కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఔషధ గుణాలున్నాయంటూ కొన్ని పాములను అనవసరంగా చంపి, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని, ఇలాంటి వారి గురించి తమ దృష్టికి వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఆ తృప్తి వేరు..
పాములు పట్టాలంటూ రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రెస్క్యూ చేసిన పాముల్లో దాదాపు 50 శాతం విషపూరితమే. కొన్నిసార్లు వాటిని పట్టే సమయంలో వలంటీర్లు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతగా శిక్షణ తీసుకున్నా.. ఫీల్డ్‌లోకి వచ్చేసరికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటాం. పాములను జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత.. ఇంటి యజమానుల కళ్లల్లో కృతజ్ఞతాభావం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేం చేస్తున్న పనిలో ఆ క్షణం తృప్తినిచ్చే క్షణం.
– అవినాష్ విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment