ఆట ఒకటే... దొంగలే వేరు!
ఆ సీన్ - ఈ సీన్
ఏ విషయంలోనైనా అనుసరణ ఉండాలి తప్ప అనుకరణ ఉండకూడదు అంటారు. కానీ ఈ విషయాన్ని సినిమావాళ్లు పట్టించుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ముఖ్యంగా దొంగాట లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది!
జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అయితే నిజానికి... ఈ ఆటను హాలీవుడ్‌వాళ్లు అంతకు ముందే ఆడేశారు.
కేట్ కెనడాలో హిస్టరీ టీచర్. ప్రియుడు చార్లీని పెళ్లాడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చార్లీకి బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెనూ రమ్మంటాడు కానీ, విమాన ప్రయాణమంటే ఉన్న భయం వల్ల రానంటుంది. అతను వెళ్లిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్యారిస్‌లో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్తాడు. షాక్ తిన్న కేట్ ప్యారిస్ బయలుదేరుతుంది. ఫ్లయిట్ ఎక్కాక భయంతో వణికిపోతుంటే, పక్క సీట్లో కూర్చున్న ల్యూక్ మాటల్లో పెట్టి, భయం లేకుండా చేస్తాడు. అతడో దొంగ. తను కొట్టేసి తీసుకెళ్తోన్న డైమండ్ నెక్లెస్‌ని, కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారన్న భయంతో కేట్ లగేజీలో కలిపేస్తాడు.
తర్వాత దాని కోసం ఆమెనే అనుసరిస్తాడు. ఆ క్రమంలో కేట్‌కు అండగా మారతాడు. అతని సాయంతో చార్లీని కలుసుకుంటుంది కేట్. కానీ చార్లీ ఎంత చెడ్డవాడో తెలుసుకుని, అతణ్ని తనతో తీసుకెళ్లాలన్న ఆలోచనను విరమించుకుంటుంది. తగిన బుద్ధి చెప్పి తిరిగి ప్రయాణమవుతుంది. వెళ్లేముందు ల్యూక్‌ని పట్టుకోవడానికి తిరుగుతోన్న పోలీసాఫీసరుకి తన దగ్గరున్న నెక్లెస్‌ని ఇచ్చేసి, అతణ్ని వదిలేయమంటుంది. వైన్‌యార్డ్ పెట్టి సెటిలవ్వడానికే ల్యూక్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని, తను దాచుకున్న డబ్బు మొత్తం అతనికి చెందేలా చేసి బయలుదేరుతుంది. అది పోలీసు ద్వారా తెలుసుకున్న ల్యూక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తన ప్రేమను కేట్‌కి తెలపడంతో కథ ముగుస్తుంది.
ఇది 1995లో విడుదలైన ‘ఫ్రెంచ్ కిస్’ చిత్ర కథ. అచ్చం ‘దొంగాట’ కథలాగే ఉంది కదూ! కథే కాదు... కథనం, సన్ని వేశాలు అన్నీ అచ్చు గుద్దినట్టే ఉంటాయి. నటీనటులు, ప్రదేశాలే మారతాయి. హాలీవుడ్‌లో హీరోయిన్ మెగ్ ర్యాన్ కెనడా నుంచి ఫ్రాన్స్‌కు వెళ్తుంది. టాలీవుడ్‌లో సౌందర్య ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. మెగ్ ఫ్లయిట్ ఎక్కితే, సౌందర్య రెలైక్కుతుంది. ఆమెకు విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయం. ఈమెకు రైలు బ్రిడ్జిమీద వెళ్లేటప్పుడు భయం. ఇలా మన నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమె ప్రియుడు, అతడు ప్రేమించిన అమ్మాయి, పోలీసాఫీసర్... ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే తెలుగులో కొందరు కమెడియన్లను యాడ్ చేశారు. మనకు పాటలూ ముఖ్యం కాబట్టి వాటినీ చేర్చారు. ఇంకే తేడా ఉండదు.
‘దొంగాట’ విడుదలైన తర్వాతి ఏడు హిందీలో కూడా ‘ఫ్రెంచ్ కిస్’ని తీశారు... ‘ప్యార్‌తో హోనా హీ థా’ పేరుతో. అజయ్ దేవగన్, కాజోల్ జంటగా నటించారు. అది కూడా మక్కీకి మక్కీనే. కాకపోతే అక్కడా హిట్టయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి చూసినా మరొకటి చూడక్కర్లేదు. ఎంత కాపీ కొట్టినా మరీ ఇలా జిరాక్స్ కాపీల్లాగా కనిపించే సినిమా మరోటి ఉండదేమో. వేరే భాషలో సక్సెస్ సాధించిన చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, మనవాళ్లకూ ఆ సినిమాను అందించాలను కోవడంలో తప్పు లేదు. కాకపోతే కథ మనది కానప్పుడు కనీసం రచయితలు తమ పేరు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ విషయాన్ని విస్మరించి క్రెడిట్ తీసుకోవడం మాత్రం అన్యాయమే!
కొసమెరుపు: సినిమాయే కాపీ అంటే, ‘దొంగాట’లో ఓ పాట కూడా కాపీయే. ‘ఓ చిలకా... రా చిలకా’ అన్న పాట, చాలా యేళ్ల క్రితం వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ‘సున్ సాహిబా సున్’ అన్న హిట్ పాటకు కాపీ.
ఈ చిత్రాలకు ప్రాణం హీరోయిన్ల పర్‌ఫార్మెన్సే అని చెప్పాలి. ‘ఫ్రెంచ్ కిస్’లో మెగ్ ర్యాన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. తెలుగులో సౌందర్య కూడా అమాయకమైన అమ్మాయిగా అదరగొట్టింది. హిందీలో కాజోల్ కూడా కంటతడి పెట్టించింది. ఈ కథకు నూరు శాతం న్యాయం జరిగింది, లాభాల పంట పండింది అంటే... అందుకు ముఖ్య కారణం ఈ నటీమణుల అద్భుత నటనే.