French Kiss
-
ఫ్రెంచ్ కిస్‌తో డేంజర్!
‘ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ. ఆనందాన్ని పంచే పులకింత. ఎదుటివారికి ఓ పలకరింత’ అని చెబుతారు. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుందిని కూడా అంటారు. అయితే ఈ ముద్దుల్లో ప్రత్యేకంగా చెప్పుకునే ‘ఫ్రెంచ్ కిస్’ (అధర చుంబనం)తో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరపగా ఈ విషయం స్పష్టమైంది. అనారోగ్యకరమైన లైంగిక సంబంధాల ద్వారా గనేరియా వ్యాధి వస్తుంది. అయితే ఫ్రెంచ్ కిస్ల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ ఫ్రెంచ్ కిస్ వల్ల ముఖ్యంగా గనేరియాతో పాటు ఐదు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది. కొన్ని నెలలుగా లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉన్న వ్యక్తులకు కూడా గనేరియా వ్యాధి సోకడంతో ముద్దు ద్వారా సంక్రమిస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధి సోకడం వల్ల గొంతు, రక్తంపై కూడా ప్రభావం చూపి మరో ఐదు వ్యాధులకు కారణమవుతోంది. ఇదే అంశంపై మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ స్పందిస్తూ, 'గనేరియా అనే వ్యాధి వేగంగా విస్తరిస్తుందన్న విషయం గమనించాలి. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతోపాటు దీన్ని ఎలా నియంత్రించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముద్దు వలన కూడా ఈ ప్రమాదకర అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందని అవగాహన కలిగించాలి. దాని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్ వంటి కొత్త నియంత్రణ పద్ధతులను అనుసరించాలి' తెలిపారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తుంది. -
‘ముద్దు’ మందారం
ముద్దు అంటే..? ఛీ.. ఏమిటా ప్రశ్న అని అనుకుంటున్నారా.? మీరు ఆ ఆలోచనల్లోంచి ముందు బయటకు వచ్చేయండి... ఎందుకంటే ముద్దు అంటే కేవలం శృంగార భావన మాత్రమే కాదు. అప్పుడే బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందుకు పొత్తిళ్లలో అమ్మ ఇచ్చే తొలి కానుక ముద్దు. మీ అబ్బాయి చాలా మంచోడని ఎదుటివారి మెచ్చుకోలు విని నాన్న ఇచ్చే ప్రేమ బహుమతి ముద్దు. గెలుపు తలుపు తట్టినప్పుడు పట్టరాని సంతోషంతో స్నేహితుడు ఉద్వేగంతో ఇచ్చే తొలి కానుక ముద్దు. అందుకే ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ. ఆనందాన్ని పంచే లకింత. ఎదుటివారికి ఓ పలకరింత సాక్షి, విశాఖపట్నం : ఒక్కో బంధంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుందీ ముద్దు. తల్లి బిడ్డకు ఇచ్చే ముద్దులో కడుపు తీపి, అన్న.. చెల్లికి ఇచ్చే ముద్దులో అనురాగం.. స్నేహితులు ఇచ్చుకునే ముద్దులో నమ్మకం.. ప్రేమికుడు ఇచ్చే ముద్దులో వలపు విశ్వాసం.. ఇలా ఒక్కో ముద్దు.. ఒక్కో అనుబంధాన్ని.. అనుభూతిని అందిస్తుంది. భావం వేరైనా ముద్దుతో పరవశాన్నే కాదు.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చుంబనాల సంగతుల్ని ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా ముద్దు ముద్దుగా చదువుకుందాం. పక్షులు ముక్కులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి.. పశువులు మూతులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి. ఏ ప్రాణి ఎలా ముద్దు పెట్టుకున్నా.. ముద్దు ప్రస్తావన మాత్రం తొలిసారి మహాభారతంలోనే వచ్చింది. అంటే.. అధర చుంబనానికి నాంది భారతదేశమే అయినా.. అది విశ్వవ్యాప్తం అవ్వడానికి మాత్రం అలెగ్జాండరే కారణమని చరిత్ర చెబుతోంది. ఏదేమైనా..గుండెల్లో ఘనీభవించిన ప్రేమను.. ధ్రువీకరించుకునే ప్రయత్నమే ముద్దు. నిన్ను ముద్దాడాలంటే మనసంటూ ఉండాలే వెర్రిదానా.. అన్నాడో సినీ కవి. నిజమే మరి.. ముద్దు పెట్టాలంటే మనసు ప్రతిస్పందించాలి. కిస్ అంటే ఇష్టం లేనివారెవ్వరూ లేరు ఈ సమాజంలో పసి పిల్లల ముద్దుల నుంచి బోసి నవ్వుల బామ్మల కిస్ వరకూ అందరికీ ఇష్టమే. సులభమైన మార్గంలో ఎదుటి వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఉన్న విశ్వంలోని ఏకైక భాష చుంబనం. ముద్దెందుకు పెట్టుకుంటారు... ఇది చిలిపి ప్రశ్నే అయినా.. సమాధానంలో మాత్రం చాలా భావం దాగి ఉంది. అసలు ఎందుకు చుంబించుకుం టారంటే.. సరదాకని కొందరు, ఆనందానికని ఇంకొందరు, ప్రేమతో అని మరికొందరు.. ఇలా నచ్చినట్లుగా చెబు తా రు. కానీ అసలు దాని వెనుక ఉన్న ప్రేరణ గురిం చి మాత్రం చెప్పలేరు. ఎందుకంటే.. ఎదుటి వ్యక్తిని ముద్దుపెట్టు కోవాలంటే శరీరంలో కొన్ని నరాల్లో ప్రకంపనాలు కలుగుతూ హార్మోనులు ఉత్పత్తై కిస్ చెయ్యాలనే ప్రేరణ కలిగిస్తాయి. పాలిచ్చినప్పుడు కొడుకుని చూసి మురిపెంతో ముద్దు పెట్టేందుకు కలిగే ప్రేరణ, బుల్లిపెదాలపై బోసి నవ్వులు పులుముకొని పలకరించేలా చూసే చిన్నారి బుగ్గల్ని ముద్దు పెట్టాలనే ప్రేరణ.. ఇలా హార్మోనులు మెదడుపై చూపించే ప్రభావమే ముద్దుకు మూలకారణం. ఆనందం పెరుగుతుందా... చుంబించుకుంటే.. అదో పెద్ద రిలీఫ్. ఎందుకంటే శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దాంతో శరీరమంతా రిలాక్స్అవుతుంది. అడ్రినల్, పిట్యుటరీ, గొనాడ్.. ఇలా అనేక గ్రంథులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలో ముద్దు ప్రవర్తనను నియంత్రిస్తాయి. ఈ గ్రంథులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి వాటిపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే.. ఎదుటి వ్యక్తిని ముద్దు పెట్టిన తర్వాత.. మనసుకు హాయిగా ఉంటుంది. శరీరం అలసటతో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి మాయమవుతుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. చుంబనం.. ఓ దివ్యౌషధం... రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదని అంటారు కదా.. కానీ.. ఆపిల్ కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. అదే.. ఇష్టమైన వాళ్లకో ముద్దు ఇస్తే.. వైద్యుడు అవసరం లేదని తెలుసా..? లాకింగ్ పెదవుల మానసిక ప్రభావం మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుంది. ► ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటును పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ► ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ► ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు.. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ► ఒక బలమైన ముద్దుకి 8–16 కేలరీలను కరిగించే సామర్థ్యం ఉంది. ► ఎదుటి వ్యక్తిని చుంబించే సమయంలో 34 ముఖ కండరాలతో పాటు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ► ఇన్ని లాభాలున్న ముద్దుతో.. కాస్తా.. జాగ్రత్తగా ఉండాలి సుమా.. ఎందుకంటే.. ముద్దు పెట్టుకున్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాతో పాటు 278 రకాల సూక్ష్మ జీవులూ దూసుకొచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సుమా.. ఎన్ని ముద్దులో... దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు బట్టి.. ముద్దు గౌరవాన్ని, హోదాని సంతరించుకుంది. ఇలా.. వివిధ దేశాలు, ప్రజలు, బంధాల మధ్య మొదలైన చుంబనం.. వివిధ రకాలుగా మారిపోయింది. అధర చుంబనం.. మహాభారతంలో చెప్పిన అధర చుంబనమే ఇప్పుడు ఫ్రెంచ్ కిస్‌గా మారిపోయింది. దీన్ని ఫ్లోరెంటీనా కిస్ అని కూడా అంటారు. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకల్లో ఈ అధర చుంబనం సంప్రదాయంగా మారింది. చేతి ముద్దు.. ఎదుటివారి చేతిపై పెట్టే ముద్దు ఇది. ఉన్నత స్థాయికి చెందినవారు.. గౌరవ సూచకంగా పెట్టే ముద్దు ఇది. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేతిని ముందుకు వంచిప్పుడు ఎదుటి వ్యక్తి ఆ చేతిని తీసుకొని సున్నితంగా వేళ్లపై చుంబిస్తారు. చెక్కిలి ముద్దు.. ఇంగ్లిష్‌లో చీక్ కిస్ అని పిలిచే ఈ ముద్దే ఎక్కువ మంది అందుకుంటుంటారు. ఎదుటి వ్యక్తిపై స్నేహం, ప్రేమ.. గౌరవం, భక్తితో ఇచ్చే ముద్దు ఇది. తల్లిదండ్రులు, స్నేహితులు ఎక్కువగా ఇచ్చుకునే ముద్దులివే. ఫ్లయింగ్ కిస్.. ఒక సంకేతంగా ఇచ్చే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను గుండ్రంగా చుట్టి.. చేతులపై శబ్దంతో ముద్దు పెట్టి.. దాన్ని గాల్లో పంపించడమే. ఇష్టపడే వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తారు. ఎస్కిమో కిస్ ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని ఎస్కిమో కిస్ అని పిలుస్తారు. తండ్రీ కుమార్తె, భార్య భర్తలు, ప్రేమికులు.. ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకునే ముద్దు ఇది. ఇద్దరి ముక్కులతోనూ రబ్ చేసుకోవడమే ఎస్కిమో కిస్.. స్నిఫ్ కిస్... కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా కనిపించే ముద్దు ఇది. బుగ్గపైనా, చెవి వెనుకభాగంలో.. చెంపపైనా.. ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని స్నిఫ్ కిస్ అంటారు. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ముద్దు. ఇవే కాదు.. ఫ్లావర్డ్ కిస్, ఫిష్ కిస్, లిక్ కిస్, స్లైడింగ్ కిస్.. ఇలా విభిన్న రకాల చుంబనాలతో ఎదుటివారి మనసు దోచెయ్యొచ్చు మనస్ఫర్థలు దూరం చేస్తుంది... ఆఫీస్ పని ఒత్తిడితో ఒక్కోసారి నా భార్యను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో.. జీవిత భాగస్వామి చాలా బాధపడుతుంటారు. ఈ సమయంలోనే మనస్ఫర్థలు వచ్చి.. జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు.. ఒక్క ముద్దు ఇస్తే.. చాలు.. అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. – శ్రీను, ఉమ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు -
'హాట్' టాపిక్: ఫ్రెంచ్ కిస్‌తో ఫస్ట్ పోస్టర్!
ఈఫీల్ టవర్ ఎదురుగా.. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన 'ఫ్రెంచ్ కిస్'తో తొలి పోస్టర్‌ను విడుదల చేసింది 'బెఫికర్' టీమ్. 'బాజీరావు మస్తానీ' హీరో రణ్వీర్ సింగ్, వాణీకపూర్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమా తొలిచిత్రాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ పోస్టర్లో పెదవులతో పెదవులు పెనవేసుకొని.. తమకంగా 'ఫెంచ్ కిస్' పెట్టుకుంటున్న రణ్వీర్, వాణీ కపూర్ జోడీ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈఫీల్ టవర్‌కు దూరంగా ఓ ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చొని వీరు ముద్దుపెట్టుకుంటూ పోస్టర్లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఫస్ట్ పోస్టర్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత ఎత్తులో తీసిన 'ఫ్రెంచ్ కిస్' షాట్ అద్భుతమంటూ హీరోయిన్ వాణీకపూర్ ఈ ఫస్ట్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. This view from the top is breathtaking @RanveerOfficial #BefikreOn9th @befikrethefilm pic.twitter.com/syEj3jZtHY — vaani kapoor (@Vaaniofficial) May 9, 2016 -
ఆట ఒకటే... దొంగలే వేరు!
ఆ సీన్ - ఈ సీన్ ఏ విషయంలోనైనా అనుసరణ ఉండాలి తప్ప అనుకరణ ఉండకూడదు అంటారు. కానీ ఈ విషయాన్ని సినిమావాళ్లు పట్టించుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ముఖ్యంగా దొంగాట లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది! జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అయితే నిజానికి... ఈ ఆటను హాలీవుడ్‌వాళ్లు అంతకు ముందే ఆడేశారు. కేట్ కెనడాలో హిస్టరీ టీచర్. ప్రియుడు చార్లీని పెళ్లాడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చార్లీకి బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెనూ రమ్మంటాడు కానీ, విమాన ప్రయాణమంటే ఉన్న భయం వల్ల రానంటుంది. అతను వెళ్లిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్యారిస్‌లో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్తాడు. షాక్ తిన్న కేట్ ప్యారిస్ బయలుదేరుతుంది. ఫ్లయిట్ ఎక్కాక భయంతో వణికిపోతుంటే, పక్క సీట్లో కూర్చున్న ల్యూక్ మాటల్లో పెట్టి, భయం లేకుండా చేస్తాడు. అతడో దొంగ. తను కొట్టేసి తీసుకెళ్తోన్న డైమండ్ నెక్లెస్‌ని, కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారన్న భయంతో కేట్ లగేజీలో కలిపేస్తాడు. తర్వాత దాని కోసం ఆమెనే అనుసరిస్తాడు. ఆ క్రమంలో కేట్కు అండగా మారతాడు. అతని సాయంతో చార్లీని కలుసుకుంటుంది కేట్. కానీ చార్లీ ఎంత చెడ్డవాడో తెలుసుకుని, అతణ్ని తనతో తీసుకెళ్లాలన్న ఆలోచనను విరమించుకుంటుంది. తగిన బుద్ధి చెప్పి తిరిగి ప్రయాణమవుతుంది. వెళ్లేముందు ల్యూక్ని పట్టుకోవడానికి తిరుగుతోన్న పోలీసాఫీసరుకి తన దగ్గరున్న నెక్లెస్‌ని ఇచ్చేసి, అతణ్ని వదిలేయమంటుంది. వైన్యార్డ్ పెట్టి సెటిలవ్వడానికే ల్యూక్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని, తను దాచుకున్న డబ్బు మొత్తం అతనికి చెందేలా చేసి బయలుదేరుతుంది. అది పోలీసు ద్వారా తెలుసుకున్న ల్యూక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తన ప్రేమను కేట్కి తెలపడంతో కథ ముగుస్తుంది. ఇది 1995లో విడుదలైన ‘ఫ్రెంచ్ కిస్’ చిత్ర కథ. అచ్చం ‘దొంగాట’ కథలాగే ఉంది కదూ! కథే కాదు... కథనం, సన్ని వేశాలు అన్నీ అచ్చు గుద్దినట్టే ఉంటాయి. నటీనటులు, ప్రదేశాలే మారతాయి. హాలీవుడ్లో హీరోయిన్ మెగ్ ర్యాన్ కెనడా నుంచి ఫ్రాన్స్‌కు వెళ్తుంది. టాలీవుడ్లో సౌందర్య ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. మెగ్ ఫ్లయిట్ ఎక్కితే, సౌందర్య రెలైక్కుతుంది. ఆమెకు విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయం. ఈమెకు రైలు బ్రిడ్జిమీద వెళ్లేటప్పుడు భయం. ఇలా మన నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమె ప్రియుడు, అతడు ప్రేమించిన అమ్మాయి, పోలీసాఫీసర్... ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే తెలుగులో కొందరు కమెడియన్లను యాడ్ చేశారు. మనకు పాటలూ ముఖ్యం కాబట్టి వాటినీ చేర్చారు. ఇంకే తేడా ఉండదు. ‘దొంగాట’ విడుదలైన తర్వాతి ఏడు హిందీలో కూడా ‘ఫ్రెంచ్ కిస్’ని తీశారు... ‘ప్యార్తో హోనా హీ థా’ పేరుతో. అజయ్ దేవగన్, కాజోల్ జంటగా నటించారు. అది కూడా మక్కీకి మక్కీనే. కాకపోతే అక్కడా హిట్టయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి చూసినా మరొకటి చూడక్కర్లేదు. ఎంత కాపీ కొట్టినా మరీ ఇలా జిరాక్స్ కాపీల్లాగా కనిపించే సినిమా మరోటి ఉండదేమో. వేరే భాషలో సక్సెస్ సాధించిన చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, మనవాళ్లకూ ఆ సినిమాను అందించాలను కోవడంలో తప్పు లేదు. కాకపోతే కథ మనది కానప్పుడు కనీసం రచయితలు తమ పేరు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ విషయాన్ని విస్మరించి క్రెడిట్ తీసుకోవడం మాత్రం అన్యాయమే! కొసమెరుపు: సినిమాయే కాపీ అంటే, ‘దొంగాట’లో ఓ పాట కూడా కాపీయే. ‘ఓ చిలకా... రా చిలకా’ అన్న పాట, చాలా యేళ్ల క్రితం వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ‘సున్ సాహిబా సున్’ అన్న హిట్ పాటకు కాపీ. ఈ చిత్రాలకు ప్రాణం హీరోయిన్ల పర్ఫార్మెన్సే అని చెప్పాలి. ‘ఫ్రెంచ్ కిస్’లో మెగ్ ర్యాన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. తెలుగులో సౌందర్య కూడా అమాయకమైన అమ్మాయిగా అదరగొట్టింది. హిందీలో కాజోల్ కూడా కంటతడి పెట్టించింది. ఈ కథకు నూరు శాతం న్యాయం జరిగింది, లాభాల పంట పండింది అంటే... అందుకు ముఖ్య కారణం ఈ నటీమణుల అద్భుత నటనే.