ప్రతీకాత్మక చిత్రం
‘ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ. ఆనందాన్ని పంచే పులకింత. ఎదుటివారికి ఓ పలకరింత’ అని చెబుతారు. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుందిని కూడా అంటారు. అయితే ఈ ముద్దుల్లో ప్రత్యేకంగా చెప్పుకునే ‘ఫ్రెంచ్ కిస్’ (అధర చుంబనం)తో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరపగా ఈ విషయం స్పష్టమైంది.
అనారోగ్యకరమైన లైంగిక సంబంధాల ద్వారా గనేరియా వ్యాధి వస్తుంది. అయితే ఫ్రెంచ్ కిస్‌ల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ ఫ్రెంచ్ కిస్ వల్ల ముఖ్యంగా గనేరియాతో పాటు ఐదు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది. కొన్ని నెలలుగా లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉన్న వ్యక్తులకు కూడా గనేరియా వ్యాధి సోకడంతో ముద్దు ద్వారా సంక్రమిస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధి సోకడం వల్ల గొంతు, రక్తంపై కూడా ప్రభావం చూపి మరో ఐదు వ్యాధులకు కారణమవుతోంది.
ఇదే అంశంపై మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ స్పందిస్తూ, 'గనేరియా అనే వ్యాధి వేగంగా విస్తరిస్తుందన్న విషయం గమనించాలి. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతోపాటు దీన్ని ఎలా నియంత్రించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముద్దు వలన కూడా ఈ ప్రమాదకర అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందని అవగాహన కలిగించాలి. దాని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్ వంటి కొత్త నియంత్రణ పద్ధతులను అనుసరించాలి' తెలిపారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment