‘ముద్దు’ మందారం | Special Article About World Kissing day | Sakshi
Sakshi News home page

‘ముద్దు’ మందారం

Published Sat, Jul 6 2019 1:10 PM | Last Updated on Fri, Jul 19 2019 1:16 PM

Special Article About World Kissing day - Sakshi

ముద్దు అంటే..? ఛీ.. ఏమిటా ప్రశ్న అని అనుకుంటున్నారా.? మీరు ఆ ఆలోచనల్లోంచి ముందు బయటకు వచ్చేయండి... ఎందుకంటే ముద్దు అంటే కేవలం శృంగార భావన మాత్రమే కాదు. అప్పుడే బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందుకు పొత్తిళ్లలో అమ్మ ఇచ్చే తొలి కానుక ముద్దు. మీ అబ్బాయి చాలా మంచోడని ఎదుటివారి మెచ్చుకోలు విని నాన్న ఇచ్చే ప్రేమ బహుమతి ముద్దు. గెలుపు తలుపు తట్టినప్పుడు పట్టరాని సంతోషంతో స్నేహితుడు ఉద్వేగంతో ఇచ్చే తొలి కానుక ముద్దు. అందుకే ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ.  ఆనందాన్ని పంచే లకింత.  ఎదుటివారికి ఓ పలకరింత

సాక్షి, విశాఖపట్నం : ఒక్కో బంధంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుందీ ముద్దు. తల్లి బిడ్డకు ఇచ్చే ముద్దులో కడుపు తీపి, అన్న.. చెల్లికి ఇచ్చే ముద్దులో అనురాగం.. స్నేహితులు ఇచ్చుకునే ముద్దులో నమ్మకం.. ప్రేమికుడు ఇచ్చే ముద్దులో వలపు విశ్వాసం.. ఇలా ఒక్కో ముద్దు.. ఒక్కో అనుబంధాన్ని.. అనుభూతిని అందిస్తుంది. భావం వేరైనా ముద్దుతో పరవశాన్నే కాదు.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చుంబనాల సంగతుల్ని ఇంటర్నేషనల్‌ కిస్సింగ్‌ డే సందర్భంగా ముద్దు ముద్దుగా చదువుకుందాం.

పక్షులు ముక్కులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి.. పశువులు మూతులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి. ఏ ప్రాణి ఎలా ముద్దు పెట్టుకున్నా.. ముద్దు ప్రస్తావన మాత్రం తొలిసారి మహాభారతంలోనే వచ్చింది. అంటే.. అధర చుంబనానికి నాంది భారతదేశమే అయినా.. అది విశ్వవ్యాప్తం అవ్వడానికి మాత్రం అలెగ్జాండరే కారణమని చరిత్ర చెబుతోంది. ఏదేమైనా..గుండెల్లో ఘనీభవించిన ప్రేమను.. ధ్రువీకరించుకునే ప్రయత్నమే ముద్దు. నిన్ను ముద్దాడాలంటే మనసంటూ ఉండాలే వెర్రిదానా.. అన్నాడో సినీ కవి. నిజమే మరి.. ముద్దు పెట్టాలంటే మనసు ప్రతిస్పందించాలి. కిస్‌ అంటే ఇష్టం లేనివారెవ్వరూ లేరు ఈ సమాజంలో పసి పిల్లల ముద్దుల నుంచి బోసి నవ్వుల బామ్మల కిస్‌ వరకూ అందరికీ ఇష్టమే. సులభమైన మార్గంలో ఎదుటి వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఉన్న విశ్వంలోని ఏకైక భాష చుంబనం.

ముద్దెందుకు పెట్టుకుంటారు...
ఇది చిలిపి ప్రశ్నే అయినా.. సమాధానంలో మాత్రం చాలా భావం దాగి ఉంది. అసలు ఎందుకు చుంబించుకుం టారంటే.. సరదాకని కొందరు, ఆనందానికని ఇంకొందరు, ప్రేమతో అని మరికొందరు.. ఇలా నచ్చినట్లుగా చెబు తా రు. కానీ అసలు దాని వెనుక ఉన్న ప్రేరణ గురిం చి మాత్రం చెప్పలేరు. ఎందుకంటే.. ఎదుటి వ్యక్తిని ముద్దుపెట్టు కోవాలంటే శరీరంలో కొన్ని నరాల్లో ప్రకంపనాలు కలుగుతూ హార్మోనులు ఉత్పత్తై కిస్‌ చెయ్యాలనే ప్రేరణ కలిగిస్తాయి. పాలిచ్చినప్పుడు కొడుకుని చూసి మురిపెంతో ముద్దు పెట్టేందుకు కలిగే ప్రేరణ, బుల్లిపెదాలపై బోసి నవ్వులు పులుముకొని పలకరించేలా చూసే చిన్నారి బుగ్గల్ని ముద్దు పెట్టాలనే ప్రేరణ.. ఇలా హార్మోనులు మెదడుపై చూపించే ప్రభావమే ముద్దుకు మూలకారణం.

ఆనందం పెరుగుతుందా...
చుంబించుకుంటే.. అదో పెద్ద రిలీఫ్‌. ఎందుకంటే శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దాంతో శరీరమంతా  రిలాక్స్‌అవుతుంది. అడ్రినల్, పిట్యుటరీ, గొనాడ్‌.. ఇలా అనేక గ్రంథులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలో ముద్దు ప్రవర్తనను నియంత్రిస్తాయి. ఈ గ్రంథులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి వాటిపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే.. ఎదుటి వ్యక్తిని ముద్దు పెట్టిన తర్వాత.. మనసుకు హాయిగా ఉంటుంది. శరీరం అలసటతో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి మాయమవుతుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.

చుంబనం.. ఓ దివ్యౌషధం...
రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ అవసరమే లేదని అంటారు కదా.. కానీ.. ఆపిల్‌ కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. అదే.. ఇష్టమైన వాళ్లకో ముద్దు ఇస్తే.. వైద్యుడు అవసరం లేదని తెలుసా..? లాకింగ్‌ పెదవుల మానసిక ప్రభావం మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుంది.

 ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్‌ విడుదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటును పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది.
  ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది.
 ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్‌ డోపమైన్, ఆక్సిటోసిన్‌ వంటి సంతోష రసాయనాలు.. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.
  ఒక బలమైన ముద్దుకి 8–16 కేలరీలను కరిగించే సామర్థ్యం ఉంది.
 ఎదుటి వ్యక్తిని చుంబించే సమయంలో 34 ముఖ కండరాలతో పాటు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇన్ని లాభాలున్న ముద్దుతో.. కాస్తా.. జాగ్రత్తగా ఉండాలి సుమా.. ఎందుకంటే.. ముద్దు పెట్టుకున్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాతో పాటు 278 రకాల సూక్ష్మ జీవులూ దూసుకొచ్చే     ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సుమా..

ఎన్ని ముద్దులో...
దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు బట్టి.. ముద్దు గౌరవాన్ని, హోదాని సంతరించుకుంది. ఇలా.. వివిధ దేశాలు, ప్రజలు, బంధాల మధ్య మొదలైన చుంబనం.. వివిధ రకాలుగా మారిపోయింది.

అధర చుంబనం.. 
మహాభారతంలో చెప్పిన అధర చుంబనమే ఇప్పుడు ఫ్రెంచ్‌ కిస్‌గా మారిపోయింది. దీన్ని ఫ్లోరెంటీనా కిస్‌ అని కూడా అంటారు. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకల్లో ఈ అధర చుంబనం సంప్రదాయంగా మారింది.

చేతి ముద్దు..
ఎదుటివారి చేతిపై పెట్టే ముద్దు ఇది. ఉన్నత స్థాయికి చెందినవారు.. గౌరవ సూచకంగా పెట్టే ముద్దు ఇది. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేతిని ముందుకు వంచిప్పుడు ఎదుటి వ్యక్తి ఆ చేతిని తీసుకొని సున్నితంగా వేళ్లపై చుంబిస్తారు.

చెక్కిలి ముద్దు..
ఇంగ్లిష్‌లో చీక్‌ కిస్‌ అని పిలిచే ఈ ముద్దే ఎక్కువ మంది అందుకుంటుంటారు. ఎదుటి వ్యక్తిపై స్నేహం, ప్రేమ.. గౌరవం, భక్తితో ఇచ్చే ముద్దు ఇది. తల్లిదండ్రులు, స్నేహితులు ఎక్కువగా ఇచ్చుకునే ముద్దులివే.

ఫ్లయింగ్‌ కిస్‌..
ఒక సంకేతంగా ఇచ్చే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను గుండ్రంగా చుట్టి.. చేతులపై శబ్దంతో ముద్దు పెట్టి.. దాన్ని గాల్లో పంపించడమే. ఇష్టపడే వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తారు.

ఎస్కిమో కిస్‌
ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని ఎస్కిమో కిస్‌ అని పిలుస్తారు. తండ్రీ కుమార్తె, భార్య భర్తలు, ప్రేమికులు.. ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకునే ముద్దు ఇది. ఇద్దరి ముక్కులతోనూ రబ్‌ చేసుకోవడమే ఎస్కిమో కిస్‌..
స్నిఫ్‌ కిస్‌...
కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా కనిపించే ముద్దు ఇది. బుగ్గపైనా, చెవి వెనుకభాగంలో.. చెంపపైనా.. ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని స్నిఫ్‌ కిస్‌ అంటారు. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ముద్దు. ఇవే కాదు.. ఫ్లావర్డ్‌ కిస్, ఫిష్‌ కిస్, లిక్‌ కిస్, స్లైడింగ్‌ కిస్‌.. ఇలా విభిన్న రకాల చుంబనాలతో ఎదుటివారి మనసు దోచెయ్యొచ్చు

మనస్ఫర్థలు దూరం చేస్తుంది...
ఆఫీస్‌ పని ఒత్తిడితో ఒక్కోసారి నా భార్యను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో.. జీవిత భాగస్వామి చాలా బాధపడుతుంటారు. ఈ సమయంలోనే మనస్ఫర్థలు వచ్చి.. జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు.. ఒక్క ముద్దు ఇస్తే.. చాలు.. అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి.
– శ్రీను, ఉమ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement