లవ్ కిస్‌మత్ | Sakshi
Sakshi News home page

లవ్ కిస్‌మత్

Published Thu, Feb 12 2015 12:03 AM

లవ్ కిస్‌మత్

‘పెదవికి పెదవి రాసే ప్రేమలేఖ ముద్దు’ అన్నాడో కవి. నిజమే కావచ్చు. ఎందుకంటే... చుంబనం అనేది ఓ భావ వ్యక్తీకరణ. తల్లి బిడ్డకు, ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. ఇష్టం, ప్రేమ, ఆరాధన, అనురాగం, అనునయం, ఓదార్పు, పలకరింపు.. ఏ భావాన్నైనా అందంగా ప్రకటించగల శక్తి ఉంది దీనికి!                
..:: సమీర నేలపూడి
 
విదేశాల్లో ముద్దుకు దాపరికం ఉండదు. ఏటా వాలెంటైన్ వీక్‌లోని ఆరో రోజైన ‘కిస్ డే’ నాడయితే.. ప్రేమికులు వీధుల్లో గుంపులుగా చేరి చుంబించుకునే దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. అయితే మనకు ముద్దు అనేది వ్యక్తిగత వ్యవహారం. తల్లిదండ్రులు పిల్లలను ముద్దాడే సన్నివేశాలు సైతం తక్కువగానే కళ్లబడుతుంటాయి మనకి. ఇక ప్రేమికులు, భార్యాభర్తల చుంబనం పూర్తి రహస్యం. మన సంస్కృతి మనకు నేర్పిన క్రమశిక్షణ అది.
 
ముత్యమంతా ముద్దు..

ప్రేమంటూ కలిగాక.. దానికి అవతలి వ్యక్తి అంగీకారం లభించాక.. అది మనసును అసలు కుదురుగా ఉండనివ్వదు. తనకు మరింత చేరువ కావాలని, తను మీకే సొంతం అన్న నమ్మకాన్ని పొందాలని ప్రతి క్షణం ఉవ్విళ్లూరుతుంటుంది. ఆ నమ్మకం కలగడానికి ఓ తీయని ముద్దు తప్పకుండా సహకరిస్తుంది. మనసులు ముడిపడిన తర్వాత, మనుషులను మరింత చేరువ చేయడంలో ముద్దుది పెద్ద పాత్రే. ఒకరికొకరు సొంతమన్న భరోసానూ కలిగిస్తుంది. అందుకే మీ ప్రేమపై ముద్దు ముద్ర వేయడంలో తప్పు లేదు. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసే ప్రదేశానికో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే జలపాతాల చెంతకో తనను తీసుకెళ్లండి. అలాంటి ప్రదేశాలకు మన సిటీలో కొదవేమీ లేదు కదా! ఓ మంచి చోటును సెలెక్ట్ చేసుకోండి. అక్కడికి తీసుకెళ్లి కాసేపు మనసు విప్పి మాట్లాడండి. ఇష్టాలు తెలుసుకోండి. అభిప్రాయాలను పంచుకోండి. చివరిగా ఓ చిన్న ముద్దుతో ముగింపు పలకండి. కానీ ఒక్క విషయం.. తనకి అభ్యంతరం లేకపోతేనే ప్రొసీడ్ అవ్వండి. తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం కావాలి తప్ప.. అనుబంధాన్ని ఆదిలోనే తుంచేసే ఆయుధంగా మారకూడదు.
 
ముద్దు ముద్దుకో మీనింగ్


ఎయిర్ కిస్: దీన్నే ఫ్లయింగ్ కిస్ అనీ అంటుంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ ఇస్తున్నట్టుగా గానీ ఈ ముద్దును ఇస్తారు.
 
ఫోర్‌హెడ్ కిస్: నుదుటి మీద పెట్టే ఈ ముద్దు స్నేహానికి, ప్రేమకు ప్రతీక.
 
హ్యాండ్ కిస్: ఇది పలకరింపు ముద్దు. ఒక వ్యక్తిని కలసినప్పుడు వారి చేతిని అందుకుని, వెనక్కి తిప్పి ముద్దు పెడితే.. వారిపై మీ గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్నీ చాటుతున్నట్లు అర్థం.
 
చీక్ కిస్: మరీ కొత్తవారిని కాకుండా, బాగా పరిచయం ఉన్న వారిని, అభిమానించేవారిని చెంపలపై ముద్దాడుతాం కదా..! అదే చీక్ కిస్.
 
ఎస్కిమో కిస్: మీ ముక్కును తన ముక్కుకి రాసి, తర్వాత ముక్కును చుంబిస్తే అది ముద్దుగా పెట్టే ముద్దు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ముద్దాడుతారు.
 
ఏంజిల్ కిస్: మూసి ఉన్న కనుపాపలపై పెట్టే ముద్దు ఇది. నిద్ర లేచిన వెంటనే గానీ, సెండాఫ్ ఇచ్చేటప్పుడు గానీ ఇలా ముద్దాడుతుంటారు.
 
ఫ్రెంచ్ కిస్: ఇది మోస్ట్ రొమాంటిక్ ముద్దు. చాలా పాపులర్ కూడా. అధరాలపై చేసే ఈ గాఢ చుంబనం ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనురాగానికి గుర్తు.
 
ఇంకా జాలైన్ కిస్, టీజర్ కిస్, వాంపైర్ కిస్, సీక్రెట్ మెసేజ్ కిస్ అంటూ చాలా రకాలున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేమయాత్రను ప్రారంభించిన వారు హ్యాండ్ కిస్‌తోనో, ఫోర్‌హెడ్ కిస్‌తోనో మొదలుపెడితే బెటర్. బంధం బలపడేవరకూ ఫ్రెంచ్ కిస్ జోలికి వెళ్లొద్దు. మొదటికే మోసం రావచ్చు!

Advertisement
 
Advertisement
 
Advertisement