వస్తాదులు ముస్తాబవుతున్నారు... | ready to grapplers ... | Sakshi
Sakshi News home page

వస్తాదులు ముస్తాబవుతున్నారు...

Published Wed, Dec 2 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

వస్తాదులు  ముస్తాబవుతున్నారు...

వస్తాదులు ముస్తాబవుతున్నారు...

మగాడంటే... ఒకప్పుడు వస్తాదులా ఉండాలి.
మరిప్పుడో..! ముస్తాబై ఉండాలి.
ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు...
వారు వీరవుతారని... వీరు వారవుతారని...
ఆయన ఏం ఊహించుకుని అన్నారో తెలీదు గానీ,
అందచందాల విషయంలో మాత్రం
మగాళ్లు ఇప్పుడు శ్రద్ధ పెంచుతున్నారు.
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు.
‘వారేవా... ఏమి ఫేసు...
అచ్చం హీరోలా ఉంది బాసూ’
అనేలా తయారవుతున్నారు.
 

సౌందర్య పోషణ ఆడాళ్లకే పరిమితమా..? మగాళ్లకు మాత్రం ఉండొద్దూ..? పౌడర్లు, క్రీములు వగైరాలన్నీ ఆడాళ్లకే ప్రత్యేకమా..? మగాళ్లకు అక్కర్లేదూ..? ఇంకెన్నాళ్లు ఈ వివక్ష..? అని ప్రశ్నిస్తున్నారు మగమహారాజులు. ప్రశ్నించే మగపుంగవుల ఆక్రోశాన్నీ, ఆవేదనను అర్థం చేసుకున్న మార్కెట్ శక్తులు... ఇదిగిదిగో... మీ కోసం మేమున్నాం... మరేం ఫర్వాలేదు అంటూ ముందుకొస్తున్నాయి. ‘మగాళ్లకు మాత్రమే’ పౌడర్లు, క్రీములు వగైరా ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సహజంగానే కళాపోషకులైన పురుషపుంగవులు సదరు ఉత్పత్తులను సాదరంగా సొంతం చేసుకుంటున్నారు. మేని మెరుపుల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా తమ సౌందర్య పిపాసను చాటుకుంటున్నారు.

సౌందర్య పోషణలో కొన్నేళ్లుగా పురుష ‘ప్రపంచ దృక్పథం’ మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోనే కాదు, మన దేశంలో కూడా. పైగా, మన దేశంలో ధవళకాంతులతో అలరారే మేనిఛాయకే అగ్రతాంబూలం. సూటిగా చెప్పాలంటే, మనోళ్లకు తెల్లతోలుపై మోజెక్కువ. సౌందర్య పోషక ఉత్పత్తులను తయారు చేసే బడా కార్పొరేట్ సంస్థలన్నీ, ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తులతో మన మగమహారాజులను ఊరిస్తున్నాయి. ఇదే అదనుగా మహానగరాలు మొదలుకొని చిన్న చిన్న పట్టణాల్లో సైతం సందు సందునా మెన్స్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలు వెలుస్తున్నాయి. మెన్స్ పార్లర్లు, సెలూన్లలో వినియోగించే క్రీములు, పౌడర్లు, బ్లీచింగ్ ప్రక్రియల వల్ల మేనిఛాయ తాత్కాలికంగా మెరుగుపడినా, ఆ తర్వాత వాటి దుష్ర్పభావాల ఫలితంగా చర్మంపై నల్లని పొరలా ఏర్పడటం, మొటిమలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు పడే పురుష పుంగవులు ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే ఏమవుతుందో తెలియని భయంతో కుంగిపోతుండటం కూడా మామూలే. చర్మతత్వానికి తగిన మేలిరకం సౌందర్య పోషక ఉత్పత్తులను వినియోగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో మగ మహారాజులు సోగ్గాళ్లలా వెలిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా పురుషుల చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే రకరకాల సమస్యలు, వాటి నివారణ మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే...

ఖతర్నాక్ కాలుష్యం
వృత్తి, ఉద్యోగాల కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలపై గంటల తరబడి ఎండనపడి తిరగడం చాలామందికి అనివార్యం. భవన నిర్మాణ పనుల్లో సిమెంటు, ధూళి సోకే పరిసరాల్లో గంటల తరబడి గడపడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం కాలుష్యంబారిన పడేవారికి పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ (పీఎంఎల్‌ఈ) ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ర్యాషెస్ ‘సన్‌బర్న్’ అంత తీవ్రమైన సమస్య కాకపోయినా, నిరంతరం చర్మంపై దురదపెడుతూ ఇబ్బంది కలిగించే సమస్యే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత బట్టి పైపూతగా వాడే కార్టికో స్టిరాయిడ్ క్రీములు లేదా నోటి ద్వారా తీసుకునే కార్టికో స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనుకుంటే, నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. గంటల తరబడి ఎండలో ఉండకుండా, వీలైనంత వరకు నీడ పట్టున ఉండేలా చూసుకోవాలి.

ముందస్తు ముదిమి
వయసు మళ్లడం మొదలయ్యాక చర్మం వదులై, ముఖంపై ముడతలు పడటం ఎవరికైనా సహజమే. కొందరిలో మాత్రం ముప్పయిలు దాటకుండానే ముదిమి లక్షణాలు మొదలవుతాయి. చర్మంలో ఒకదానినొకటి బిగుతుగా అంటిపెట్టుకుని ఉండే కణజాలం బలహీనపడుతూ ఉంటుంది. ఫలితంగా చర్మం వదులై, ముఖాన ముడుతలు దేరి ముసలాళ్లలా కనిపిస్తారు. దీనినే ‘ప్రీమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే, ఈ సమస్యను ముందస్తు ముదిమి అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తీక్షణమైన ఎండకు దూరంగా ఉండాలి. సన్‌బాతింగ్ వంటి చర్యలు ఇలాంటి వారికి అసలు పనికిరావు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సి ఉంటుంది. గంటల తరబడి ఎండలో గడపడం తప్పనిసరి అయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్బు బదులు మాయిశ్చరైజింగ్ బాడీవాష్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. చర్మం బిగుతు సడలకుండా ఉండేందుకు వ్యాయామాలు, మసాజ్‌లు కొంతవరకు దోహదపడతాయి. ఈ సమస్యకు ‘నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ’ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.

వర్ణం చర్మాంతర్యామి
పుట్టుకతోనే చర్మానికి రంగు వస్తుంది. దానినెవరూ మార్చలేరు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో అసహజమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి ముఖంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా ఉంటాయి. చర్మానికి గాఢమైన రంగునిచ్చే మెననోసైట్స్ ఒకేచోట ఎక్కువగా పోగుపడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని ‘మెలాస్మా’ అంటారు. ఇక కొందరికి నుదురు, మెడ, బాహుమూలలు, మర్మాయవాల వద్ద చర్మం చాలా నల్లగా మారడమే కాకుండా, దళసరిగా మారుతుంది. ఈ పరిస్థితిని ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. దీనిని డయాబెటిస్‌కు ముందస్తు సూచనగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి అసహజమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి చర్మం జిడ్డుగాను, మరికొందరి చర్మం పొడిగాను ఉంటుంది. చర్మం అడుగున ఉత్పత్తయ్యే ‘సీబమ్’ హెచ్చుతగ్గుల కారణంగానే ఇలా జరుగుతుంది. కొందరిలో ముఖంపై జుట్టు మరీ దట్టంగా పెరుగుతుంది. గడ్డం దాదాపు కళ్ల దిగువ వరకు ముఖమంతా కప్పేసినట్లు పెరిగితే చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నిపుణులను సంప్రదిస్తే, లేజర్ చికిత్స ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుతారు. కొందరిలో కనుబొమలు బాగా పల్చబడిపోవడం లేదా పూర్తిగా లేకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కూడా ఇప్పుడు తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

- ఇన్‌పుట్స్: డా. స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్,
 త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్
 
నీడలో నీటుగాళ్లు
ఎండ కన్నెరుగకుండా ఎంతసేపూ నీడపట్టున ఆఫీసుల్లో, ఇళ్లలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీ తెరలకు అతుక్కుపోయి బతికేసే నీటుగాళ్లకు కూడా రకరకాల చర్మ సమస్యలు తప్పవు. గంటల తరబడి ఎండలో గడిపే వాళ్లకు అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎలాంటి హాని జరుగుతుందో, నిత్యం డెస్క్‌టాప్, లాప్‌టాప్, టాబ్లెట్లు, సెల్‌ఫోన్లతో బిజీబిజీగా గడిపేసే ఐటీ, బీపీవో ఉద్యోగులకు కూడా అలాంటి దుష్ర్పభావాలే కలుగుతాయి. వారు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. పైగా, నీరెండ అయినా సోకకుండా బతికేయడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకలు కూడా బలహీనపడతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మంచి సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, తరచు ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
 
టీనేజీ కుర్రకారు
అందచందాలపై తాపత్రయం టీనేజ్‌లోనే మొదలవుతుంది. టీనేజ్ కుర్రాళ్లు గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. అమ్మాయిల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. తమ అభిమాన కథానాయకుల తరహాలో తయారయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. టీవీ, పేపర్లలో కనిపించే ప్రతి యాడ్‌లోని ఉత్పత్తినీ వెంటనే కొనేసి, ముఖాలకు పూసుకుంటూ ఉంటారు. ఇక స్ప్రేలు, సెంట్లు సరేసరి. కుర్రకారులోని ఈ ప్రయోగశీలత ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాంటి పదార్థాలతో తయారు చేశారో, నాణ్యత ఏమిటో తెలుసుకోకుండా హానికరమైన క్రీములు వాడేస్తే, ముఖవర్చస్సు దెబ్బతిని, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, యాడ్స్ మాయాజాలంలో కొట్టుకుపోకుండా, వైద్యుల సలహాపై తమ చర్మం తీరుకు సరిపడే ఉత్పత్తులనే వాడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, తగిన వ్యాయామం చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement