Beauty Parlors
-
మనలాగే.. ఐస్మార్ట్ దర్పణం!
ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను గుర్తిస్తుంది ఇంట్లో ఉండి కూడా మన చర్మం గురించి తెలుసుకోవచ్చు ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న స్మార్ట్ మిర్రర్స్ వాడకం బ్యూటీ పార్లర్లలో అధునాతన మిర్రర్స్ వినియోగంచర్మ సౌందర్య సాధానాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే.. కానీ నేడు పురుషులు కూడా అందం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సౌందర్య సాధానాల వాడకం విపరీతంగా పెరిగింది. 2023లో వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.135 కోట్లు. 2026 నాటికి రూ.230 కోట్లకు ఎగబాకనున్నదని నిపుణుల అంచనా. నగరాల్లో కాలుష్యం, ఎండ, దుమ్ము కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి రక్షణకు చాలామంది మార్కెట్లో దొరికిన అనేక రకాల క్రీములు, జెల్స్, పౌడర్లు, సోప్‌లు, ఫేస్ వాష్‌లు వాడేస్తున్నారు. ఎలాంటి చర్మానికి ఎలాంటి సాధనాలు వాడాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి మన చర్మం తత్వం ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా..? అందుకే మన లాంటి వారి కోసమే నేనున్నా అంటూ వచ్చేసింది స్మార్ట్ మిర్రర్. ఇది మన చర్మ సమస్యలను ఇట్టే చెప్పేస్తుంది.. సాధారణ అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్మార్ట్ మిర్రర్లో మాత్రం మన ముఖంలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్న మాట. కళ్ల కింద నలుపు, నల్ల మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు, మన చర్మం స్వభావం వంటి విషయాలు వెంటనే చెప్పేస్తుంది. మన ముఖంలో ఉన్న సమస్యలను కచ్చితత్వంతో పసిగట్టి మనకు విశ్లేషణ అందిస్తుంది. దీన్నిబట్టి మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంచనాకు రావొచ్చు. ఇటీవల పలు బ్యూటీ పార్లర్స్‌లో కూడా దీని వాడకం విరివిగా పెరిగిపోయింది. సొంతంగానూ వాడుకోవచ్చు.. చాలా కంపెనీలు స్మార్ట్ మిర్రర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్యాబ్ పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ మిర్రర్ దాదాపు రెండున్నర కేజీల బరువు ఉంటుంది. దీనికి ఒక హెచ్డీ కెమెరా ఉంటుంది. దీని ముందు ముఖం పెట్టగానే కొన్ని ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను విశ్లేషించి మన చర్మం తత్వాన్ని చెప్పేస్తుంది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మన వెంటే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని ద్వారా మన చర్మంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాస్త జాగ్రత్త మరీ.. ఏదైనా పరికరంలో కెమెరాలు ఉన్నాయంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వాడనప్పుడు మూసేసి ఉంచడం మంచిది. కాకపోతే కొన్ని స్మార్ట్ మిర్రర్స్ వాడకంలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతుంది. దీంతో కాస్త వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. మనం స్మార్ట్ మిర్రర్‌గా వాడనప్పుడు కెమెరాలు క్లోజ్ అయిపోయి.. సాధారణ అద్దంలాగే వాడుకోవచ్చు. హైటెక్ మిర్రర్ కూడా.. ఇంట్లోనే కాకుండా బ్యూటీ పార్లర్స్‌లో కూడా ఎక్కువగా స్కిన్ అనలైజర్లను ఇటీవల వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మిర్రర్ ఇచి్చన ఇన్పుట్స్ ఆధారంగా శరీర తత్వానికి తగ్గట్టు సౌందర్యసాధనాలను వాడుతున్నారు. ఎలాంటి మేకప్ వేస్తే వారి చర్మానికి సూట్ అవుతుందనే విషయంపై ఓ అవగాహనకు వచి్చ, వారికి అలాంటి ఉత్పత్తులనే వాడుతున్నారు.పూర్తిస్థాయి పరిష్కారం కాదు.. స్మార్ట్ మిర్రర్స్ ద్వారా ఆయిల్ స్కిన్, పొడి చర్మమా అని చర్మం తత్వం గురించి తెలుస్తుంది. స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే తెలుపుతుంది. ఎండ లేదా కాలుష్యానికి ఎంతగా ప్రభావితమైందో అర్థం అవుతుంది. వీటి ద్వారా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంచనాకు రావొచ్చు. అయితే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వదు. వ్యాధి నిర్ధారణ విషయంలో స్మార్ట్ మిర్రర్స్‌ను నమ్ముకోవద్దు. అలాంటప్పుడు డెర్మటాలజిస్టును కలిసి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకుంటే మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ -
ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వివాహం, నిశ్చితార్ధం, ఆఫ్ శారీ ఫంక్షన్, పుట్టిన రోజు వేడుకలు, పండగలు, ఇతరత్రా ఉత్సవాలు.. ఇలా ప్రత్యేక సమయా ల్లో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని ఎవరైనా కోరుకుంటారు. దీనికోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇలాంటి వారికోసమే జిల్లావ్యాప్తంగా బ్యూటీపార్లర్లు, ప్రత్యేకమైన సెలూన్లు వెలిశాయి. ఈ రంగంపై ఆధారపడి జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు. పల్లెలకు పాకిన కల్చర్.. మహానగరాల నుంచి నేడు మారుమూల పల్లెలకు సైతం ఈ సంస్కృతి శరవేగంగా పాకింది. పెద్ద పెద్ద కుటుంబాలకే మాత్రమే పరిమితమైన బ్యూటీపార్లర్ కల్చర్ ఇప్పుడు సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది. డబ్బుతో ఏముంది.. మళ్లీ సంపాదించుకోవచ్చని, ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆసక్తితో యువతులు, మహిళలు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఐబ్రోస్, ఫేషియల్, బ్రైడల్ మేకప్, శారీ ట్రాపింగ్, పెడిక్యూర్, మేనిక్యూర్, గోల్డెన్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, హెడ్ మసాజ్, వ్యాక్స్, మెహందీ, హెయిర్‌స్పా, హెయిర్ కట్స్, ప్రిఫరబుల్ కాస్ట్యూమ్‌లతో అందాన్ని మరింతగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఉపాధి కోణం.. నేడు ఫ్యాషన్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు పెరిగాయి. వీటిని యువకులు, మహిళలు అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, భువనేశ్వర్ తదితర ప్రాంతాలలో ప్రత్యక్ష శిక్షణతో పాటు ఆన్లైన్ వేదికగా శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతూ మరి కొంత మందికి ఉపాధి మార్గం చూపుతున్నారు. ఒక్కొక్క మేకప్‌కు వారు వినియోగించే క్రీమ్‌లు ఇతర సౌందర్య సాధనాలు.. కేటాయించే సమయాన్ని బట్టీ రూ.500 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారి ఇళ్లలో ఫంక్షన్లు అయితే మేకప్ కోసం రూ.లక్షల్లో తీసుకున్న సందర్భాలు సైతం ఉంటున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఈ రకమైన వృత్తిలో ఉన్నారు. పురుషుల్లోనూ పెరిగిన ఆసక్తి మహిళల మాదిరిగానే పురుషులు కూడా అందం పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. యువత ఫేషియల్స్, స్క్రబ్స్ వంటివి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివాహాల సమయంలో ఫేషియల్, హెయిర్ స్టైల్స్, ఫేస్ ప్యాక్స్ వంటివి చేసుకుంటున్నారు. వాడే కాస్ట్యూమ్స్ మేరకు రూ.2 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నాం.– తోటపల్లి శ్రీనివాసరావు, వీనస్ సెలూన్, బొందిలీపురం భలే డిమాండ్.. ప్రస్తుతం ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా పెళ్లిళ్లు, ఆఫ్‌శారీ ఫంక్షన్లు, నిశ్చితార్థం, పుట్టిన రోజు వేడుకలు, పండగల సమయంలో భలే డిమాండ్ ఉంది. ముఖ స్వభావం బట్టీ క్రీమ్‌లు వినియోగిస్తాం. మేకప్ చేయడానికి గంటల సమయం పడుతుంది. వినియోగించే క్రీమ్‌లు, కేటాయించే సమయం బట్టీ డబ్బులు తీసుకుంటాం. – ఎన్.లావణ్య, బ్యూటీషియన్, వజ్రపుకొత్తూరు మండలం ఎంతో మందికి ఉపాధి ముఖ సౌందర్యంపై ఆసక్తి పెరగడంతో మాకు ఉపాధి దొరుకుతోంది. ఐబ్రోస్, ఫేషియల్, హెయిర్‌కట్, హెయిర్ స్పా, పెడిక్యూర్, మేనిక్యూర్, వ్యాక్సింగ్ తదితర ప్రక్రియ ద్వారా అందంగా తయారు చేస్తున్నారు. వివాహాలకై తే మేకప్, శారీ ట్రాపింగ్, హెయిర్ స్టైల్, ఫేస్ మేకప్, బ్రైడల్ మేకప్, మెహందీ, ప్రిఫరబుల్ కాస్ట్యూమ్ తదితర విధానాల ద్వారా ముస్తాబు చేసేందుకు రూ.5 వేల నుంచి రూ.50వేలు వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. – రాయవలస పార్వతి, వరిన్య బ్యూటీ క్లినిక్, శ్రీకాకుళం -
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
కరివేప్యాక్
న్యూ ఫేస్ ఆర్థికంగా ఎదగాలనో.. పోటీ ప్రపంచంలో ముందుండాలనో.. మరే ఇతర కారణాల వల్లో మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గృహిణులు తమ శరీరం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే.. చర్మం, జుత్తు వంటివి కూడా క్రమంగా పాడైపోతాయి. అలా అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మన చర్మానికి సరిపోయే ప్యాక్స్ వారానికోసారి వేసుకున్నా సరిపోతుంది. ఓసారి ఈ ప్యాక్‌ను ట్రై చేసి, ఫలితం మీరే చూడండి. కావలసినవి * కరివేపాకు పేస్ట్ (ఆకులను మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి) - 1 టేబుల్ స్పూన్ * శనగపిండి - అర టేబుల్ స్పూన్ * పెరుగు లేదా పాలు - అర టేబుల్ స్పూన్ తయారీ * ఓ బౌల్లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. (కరివేపాకు పేస్ట్‌కు బదులుగా.. ఎండబెట్టిన కరివేపాకుల పొడిని కూడా ప్యాక్‌గా వేసుకోవచ్చు) * కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఈ కరివేపాకు ప్యాక్ ముఖంపై మొటిమలు, దద్దుర్లను దూరం చేస్తుంది. అలాగే ఇందులోని శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అంతేనా, ఇది చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకు తినడం వల్ల వచ్చే లాభాలెన్నో మనకు తెలుసు. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ కూడా చర్మానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు జుత్తు పెరుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుంది. -
మహిళలకు ప్రత్యేక శిక్షణ
విజయనగరం: అందంగా కని పించాలనుకునే మహిళలకు నిజంగా ఇది శుభవార్తే. బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరుబాటు లేని మహిళలు..ఇంట్లోనే ఉంటూ తమను తామే స్వయంగా అందంగా కనిపిం చేలా తయారు చేసుకునేందుకు మహిళలకు మేకప్, హెయి ర్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల 25వ తేదీనుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సాక్షి,మైత్రి మహిళ ఆధ్వర్యంలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. విజ యనగరంలోని పద్మావతి నగర్, రోడ్‌నంబర్ 3, పివిఆర్ కాలనీ,ఫ్లాట్ నంబర్ 75 గైజోస్ బ్యూటీ క్లినిక్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇస్తారు. ఈ శిక్షణకు హాజరవ్వాలనుకునే మహిళలు రూ.1000 ఫీజు చెల్లించి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమ పేర్లు రిజిస్రేషన్ చేయించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నంబర్9666283534, 9290918744లలో సంప్రదించ వచ్చు. -
వస్తాదులు ముస్తాబవుతున్నారు...
మగాడంటే... ఒకప్పుడు వస్తాదులా ఉండాలి. మరిప్పుడో..! ముస్తాబై ఉండాలి. ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు... వారు వీరవుతారని... వీరు వారవుతారని... ఆయన ఏం ఊహించుకుని అన్నారో తెలీదు గానీ, అందచందాల విషయంలో మాత్రం మగాళ్లు ఇప్పుడు శ్రద్ధ పెంచుతున్నారు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ‘వారేవా... ఏమి ఫేసు... అచ్చం హీరోలా ఉంది బాసూ’ అనేలా తయారవుతున్నారు. సౌందర్య పోషణ ఆడాళ్లకే పరిమితమా..? మగాళ్లకు మాత్రం ఉండొద్దూ..? పౌడర్లు, క్రీములు వగైరాలన్నీ ఆడాళ్లకే ప్రత్యేకమా..? మగాళ్లకు అక్కర్లేదూ..? ఇంకెన్నాళ్లు ఈ వివక్ష..? అని ప్రశ్నిస్తున్నారు మగమహారాజులు. ప్రశ్నించే మగపుంగవుల ఆక్రోశాన్నీ, ఆవేదనను అర్థం చేసుకున్న మార్కెట్ శక్తులు... ఇదిగిదిగో... మీ కోసం మేమున్నాం... మరేం ఫర్వాలేదు అంటూ ముందుకొస్తున్నాయి. ‘మగాళ్లకు మాత్రమే’ పౌడర్లు, క్రీములు వగైరా ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సహజంగానే కళాపోషకులైన పురుషపుంగవులు సదరు ఉత్పత్తులను సాదరంగా సొంతం చేసుకుంటున్నారు. మేని మెరుపుల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా తమ సౌందర్య పిపాసను చాటుకుంటున్నారు. సౌందర్య పోషణలో కొన్నేళ్లుగా పురుష ‘ప్రపంచ దృక్పథం’ మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోనే కాదు, మన దేశంలో కూడా. పైగా, మన దేశంలో ధవళకాంతులతో అలరారే మేనిఛాయకే అగ్రతాంబూలం. సూటిగా చెప్పాలంటే, మనోళ్లకు తెల్లతోలుపై మోజెక్కువ. సౌందర్య పోషక ఉత్పత్తులను తయారు చేసే బడా కార్పొరేట్ సంస్థలన్నీ, ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తులతో మన మగమహారాజులను ఊరిస్తున్నాయి. ఇదే అదనుగా మహానగరాలు మొదలుకొని చిన్న చిన్న పట్టణాల్లో సైతం సందు సందునా మెన్స్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలు వెలుస్తున్నాయి. మెన్స్ పార్లర్లు, సెలూన్లలో వినియోగించే క్రీములు, పౌడర్లు, బ్లీచింగ్ ప్రక్రియల వల్ల మేనిఛాయ తాత్కాలికంగా మెరుగుపడినా, ఆ తర్వాత వాటి దుష్ర్పభావాల ఫలితంగా చర్మంపై నల్లని పొరలా ఏర్పడటం, మొటిమలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు పడే పురుష పుంగవులు ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే ఏమవుతుందో తెలియని భయంతో కుంగిపోతుండటం కూడా మామూలే. చర్మతత్వానికి తగిన మేలిరకం సౌందర్య పోషక ఉత్పత్తులను వినియోగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో మగ మహారాజులు సోగ్గాళ్లలా వెలిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా పురుషుల చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే రకరకాల సమస్యలు, వాటి నివారణ మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే... ఖతర్నాక్ కాలుష్యం వృత్తి, ఉద్యోగాల కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలపై గంటల తరబడి ఎండనపడి తిరగడం చాలామందికి అనివార్యం. భవన నిర్మాణ పనుల్లో సిమెంటు, ధూళి సోకే పరిసరాల్లో గంటల తరబడి గడపడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం కాలుష్యంబారిన పడేవారికి పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ (పీఎంఎల్‌ఈ) ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ర్యాషెస్ ‘సన్‌బర్న్’ అంత తీవ్రమైన సమస్య కాకపోయినా, నిరంతరం చర్మంపై దురదపెడుతూ ఇబ్బంది కలిగించే సమస్యే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత బట్టి పైపూతగా వాడే కార్టికో స్టిరాయిడ్ క్రీములు లేదా నోటి ద్వారా తీసుకునే కార్టికో స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనుకుంటే, నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. గంటల తరబడి ఎండలో ఉండకుండా, వీలైనంత వరకు నీడ పట్టున ఉండేలా చూసుకోవాలి. ముందస్తు ముదిమి వయసు మళ్లడం మొదలయ్యాక చర్మం వదులై, ముఖంపై ముడతలు పడటం ఎవరికైనా సహజమే. కొందరిలో మాత్రం ముప్పయిలు దాటకుండానే ముదిమి లక్షణాలు మొదలవుతాయి. చర్మంలో ఒకదానినొకటి బిగుతుగా అంటిపెట్టుకుని ఉండే కణజాలం బలహీనపడుతూ ఉంటుంది. ఫలితంగా చర్మం వదులై, ముఖాన ముడుతలు దేరి ముసలాళ్లలా కనిపిస్తారు. దీనినే ‘ప్రీమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే, ఈ సమస్యను ముందస్తు ముదిమి అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తీక్షణమైన ఎండకు దూరంగా ఉండాలి. సన్‌బాతింగ్ వంటి చర్యలు ఇలాంటి వారికి అసలు పనికిరావు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సి ఉంటుంది. గంటల తరబడి ఎండలో గడపడం తప్పనిసరి అయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్బు బదులు మాయిశ్చరైజింగ్ బాడీవాష్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. చర్మం బిగుతు సడలకుండా ఉండేందుకు వ్యాయామాలు, మసాజ్‌లు కొంతవరకు దోహదపడతాయి. ఈ సమస్యకు ‘నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ’ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వర్ణం చర్మాంతర్యామి పుట్టుకతోనే చర్మానికి రంగు వస్తుంది. దానినెవరూ మార్చలేరు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో అసహజమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి ముఖంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా ఉంటాయి. చర్మానికి గాఢమైన రంగునిచ్చే మెననోసైట్స్ ఒకేచోట ఎక్కువగా పోగుపడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని ‘మెలాస్మా’ అంటారు. ఇక కొందరికి నుదురు, మెడ, బాహుమూలలు, మర్మాయవాల వద్ద చర్మం చాలా నల్లగా మారడమే కాకుండా, దళసరిగా మారుతుంది. ఈ పరిస్థితిని ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. దీనిని డయాబెటిస్‌కు ముందస్తు సూచనగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి అసహజమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి చర్మం జిడ్డుగాను, మరికొందరి చర్మం పొడిగాను ఉంటుంది. చర్మం అడుగున ఉత్పత్తయ్యే ‘సీబమ్’ హెచ్చుతగ్గుల కారణంగానే ఇలా జరుగుతుంది. కొందరిలో ముఖంపై జుట్టు మరీ దట్టంగా పెరుగుతుంది. గడ్డం దాదాపు కళ్ల దిగువ వరకు ముఖమంతా కప్పేసినట్లు పెరిగితే చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నిపుణులను సంప్రదిస్తే, లేజర్ చికిత్స ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుతారు. కొందరిలో కనుబొమలు బాగా పల్చబడిపోవడం లేదా పూర్తిగా లేకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కూడా ఇప్పుడు తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ నీడలో నీటుగాళ్లు ఎండ కన్నెరుగకుండా ఎంతసేపూ నీడపట్టున ఆఫీసుల్లో, ఇళ్లలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీ తెరలకు అతుక్కుపోయి బతికేసే నీటుగాళ్లకు కూడా రకరకాల చర్మ సమస్యలు తప్పవు. గంటల తరబడి ఎండలో గడిపే వాళ్లకు అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎలాంటి హాని జరుగుతుందో, నిత్యం డెస్క్‌టాప్, లాప్టాప్, టాబ్లెట్లు, సెల్ఫోన్లతో బిజీబిజీగా గడిపేసే ఐటీ, బీపీవో ఉద్యోగులకు కూడా అలాంటి దుష్ర్పభావాలే కలుగుతాయి. వారు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. పైగా, నీరెండ అయినా సోకకుండా బతికేయడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకలు కూడా బలహీనపడతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మంచి సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, తరచు ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టీనేజీ కుర్రకారు అందచందాలపై తాపత్రయం టీనేజ్లోనే మొదలవుతుంది. టీనేజ్ కుర్రాళ్లు గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. అమ్మాయిల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. తమ అభిమాన కథానాయకుల తరహాలో తయారయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. టీవీ, పేపర్లలో కనిపించే ప్రతి యాడ్‌లోని ఉత్పత్తినీ వెంటనే కొనేసి, ముఖాలకు పూసుకుంటూ ఉంటారు. ఇక స్ప్రేలు, సెంట్లు సరేసరి. కుర్రకారులోని ఈ ప్రయోగశీలత ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాంటి పదార్థాలతో తయారు చేశారో, నాణ్యత ఏమిటో తెలుసుకోకుండా హానికరమైన క్రీములు వాడేస్తే, ముఖవర్చస్సు దెబ్బతిని, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, యాడ్స్ మాయాజాలంలో కొట్టుకుపోకుండా, వైద్యుల సలహాపై తమ చర్మం తీరుకు సరిపడే ఉత్పత్తులనే వాడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, తగిన వ్యాయామం చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవచ్చు -
పెరుగు వెనిగర్ కలిస్తే
నిగనిగల్! ఆఫీస్ హడావిడితో ఉరుకులు పరుగుల మీద ఉండే మహిళలకు బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఫేషియల్ చేయించుకునే తీరిక ఉండదు. కాబట్టి వారు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే నేచురల్ ఫేషియల్ చేసుకుంటే సరి. రెండు టీ స్పూన్ల పెరుగులో నాలుగు చుక్కల వెనీగర్‌ను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ 10నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చాలు. నిగనిగలాడే కాంతివంతమైన ముఖం మీ సొంతం.చాలామందికి మాడు ఎప్పుడూ దురదగా ఉంటుంది. అది చుండ్రు వల్ల కావచ్చు లేక సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. ఆ దురద నుంచి ఉపశమనం పొందాలంటే రోజు విడిచి రోజు నిమ్మరసానికి ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఓ 20 నిమిషాల తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దురద మటుమాయం అవడంతో పాటు జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ముఖంపై వైట్‌హెడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత అందమైన ముఖమైనా కాంతిహీనంగా కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి దూరం కావాలంటే ఆ వైట్‌హెడ్స్‌పై తేనె రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో దూది ఉండను ముంచుతూ ఆ తేనెను తుడిచేయాలి. అలా రోజుకు రెండుసార్లు చేస్తే వెంటనే ఫలితాన్ని చూడొచ్చు. -
‘అందమే’ ఆనందం..
అందచందాలపై మగువుల మక్కువ బాహ్యసౌందర్యం కోసం భారీగా వ్యయం బ్యూటీపార్లర్ల వైపు నగర మహిళల చూపు తెలంగాణ ప్యారిస్ దిశగా ఖమ్మం ! అందం గురించి ఒక్కో సినీ కవి ఒక్కో విధంగా వర్ణించారు. ఒకరు ‘అందమే ఆనందం..’ అంటే మరొకరు ‘అందం అంటే ఆడది..’ అంటూ మగువల అందచందాలను ఆకాశానికెత్తారు. ఎవరెలా నిర్వచించినా అందం ప్రస్తావన వస్తే ఆడవాళ్లను విస్మరించలేమనేది యదార్థం. ఖమ్మం నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా నగర మహిళల సౌందర్యాభిరుచి పెంపొందుతోంది. బాహ్యసౌందర్యం కోసం భారీగానే వెచ్చిస్తున్నారు. అందుకే ఇక్కడ బ్యూటీపార్లర్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. నగరంలో బ్యూటీపార్లర్ లేని వీధి లేదంటే అతిశయోక్తికాదు. సుమారు 200 వరకు బ్యూటీపార్లర్లు ఉన్నట్టు ఓ అంచనా. హెయిర్, స్కిన్‌కేర్ విషయంలో నగర మహిళలు కనబరుస్తున్న శ్రద్ధను గమనిస్తే కొద్దిరోజుల్లో ‘తెలంగాణ ప్యారిస్’గా ఖమ్మం పేరుగడిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఖమ్మం హవేలి: అందచందాలకు నగర మహిళలు ఇస్తున్న ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే భారీ స్థాయి బ్యూటీపార్లర్లు... అభివృద్ధి, వ్యాపార రంగంలో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఖమ్మం నగరంలోనూ పదుల సంఖ్యలో దర్శనం ఇస్తున్నాయి. నగరంలో సుమారు ఇరవై వరకు భారీ స్థాయి బ్యూటీ పార్లర్లు వెలిశాయి. ఇక చిన్నాచితక బ్యూటీపార్లర్లయితే లెక్కలేవు. దాదాపు ప్రతి వీధికి ఒకటి చొప్పున అయినా ఉన్నాయి. మొత్తంగా 200కు పైగా ఉన్నట్టు ఓ అంచనా. సౌందర్యం విషయంలో మహిళలు, యువతులు పెద్ద నగరాల వారికి దీటుగా ప్రాధాన్యత ఇస్తుండడంతో ఖమ్మంలో బ్యూటీ పార్లర్ల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లు సైతం హెయిర్, స్కిన్ కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం గమనార్హం. నలుగు నుంచి పార్లర్ దాకా... భారతీయ సంప్రదాయంలో అలంకరణకు మహిళలు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు అందం తోడైతే ఆ ఆకర్షణే వేరు. పూర్వం ప్రతి వారంలో మహిళలు రెండుసార్లు చర్మానికి నలుగు పెట్టుకునేవారు. నేటి ఉరుకులపరుగుల యుగంలో అది ఒకింత కష్టమే. కాబట్టి పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని సౌందర్యం పోషణ కోసం అనేక రకాల హెర్బల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. బ్యూటీషియన్ సలహాతో వీటిని వినియోగిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. అందుకే తప్పనిసరిగా బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. ప్యాకప్లేని మేకప్ మేకప్ విషయంలో స్త్రీ, పురుషులు విపరీతమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెడ్డింగ్ మేకప్, వివిధ వేడుకల మేకప్, మేకోవర్ ఫర్ పార్టీ మేకప్, రిసెప్షన్ మేకప్, క్లాసికల్ డాన్స్ మేకప్, సంగీత ప్రదర్శన మేకప్ తదితర మేకప్‌లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక మహిళలు డ్రెస్సింగ్, చర్మ రంగుకు అనుగుణంగా మేకప్‌లు వేస్తున్నారు. ఇక వెడ్డింగ్ (వివాహ వేడుకలు) విషయంలో అన్నిరకాల వారు తమ స్థాయితో సంబంధం లేకుండా డ్రెస్ సెన్స్, పెళ్లికూతురు అందం విషయంలో బ్యూటీషియన్ సలహాలు పాటిస్తున్నారు. ఆర్థికస్తోమత ఉన్నవారైతే ఓ బ్యూటీషియన్నే శుభకార్యాలప్పుడు అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.. ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పలువురి యువతులు, మహిళల అభిప్రాయం. నలుగురిలో మనం ఉండాలన్నా..నలుగురు మనని చూడాలన్నా ఆకర్షణ ముఖ్యమంటారు. చదువుకొనేవారు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం అందంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగం చేసేవారు, ఇతర రంగాల వారు తమ రూపానికి అనుగుణంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి వారు తమ జీవనవిధానం (లైఫ్‌స్టైల్)కు అనుగుణంగా బాహ్య సౌందర్యం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెయిర్ స్టైల్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువతులు బ్యాహ్యా సౌందర్యం, 30 సంవత్సరాల పైబడినవారు చర్మం పొడిబారడం లాంటి ఇతర సమస్యలను అధిగమించేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. అధికభాగం విద్యార్థినులు మొటిమలు రాకుండా, హెయిర్ పొడిబార కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సేవలు అనేకం బ్యూటీ పార్లర్ల ద్వారా స్కిన్‌కేర్, హ్యాండ్, ఫుట్‌కేర్, హెయిర్ డిజైనింగ్, హెయిర్ ట్రీట్మెంట్, ఫేషియల్, ఐబ్రోస్, బాడీ స్పా, తదితరాల్లో అనేకమైన రకాలు ఉన్నాయి. కొన్ని రకాల సేవలు ధర ఎక్కువ ఉన్నా వెనుకాడడం లేదు. మహిళలు ఎక్కువగా ఆర్గానిక్, మినరల్, ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకుంటున్నారు. వీటికి ఒక్కసారికి రూ.2వేలకు పైగానే వెచ్చిస్తున్నారు. చర్మానికి తేమ తీసుకొచ్చే స్కిన్ హైడ్రేటింగ్ కోసం రూ.1500కు పైగానే ఖర్చు చేస్తున్నారు. నెయిల్ కేర్‌కు రూ. 500వరకు వెచ్చిస్తున్నారు. బిజీ లైఫ్‌లో బ్యూటీపార్లర్స్తో సమయం ఆదా ప్రస్తుతం ప్రతి విషయంలో బిజీ జీవితాన్ని గడపాల్సి వస్తోంది. పిల్లలను పాఠశాలకు పంపే దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ హడావుడి . ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా బయటకు వెళ్లినప్పుడు, ఆఫీస్‌లో సైతం బిజీగా గడపక తప్పడం లేదు. ఇలాంటి సమయంలో స్కిన్, హెయిర్ కేర్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్లు అందిస్తున్న సేవలు బాగుంటున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉన్న సమయంలో వారు వచ్చి తమకు అవసరమైన సేవలు పొందుతున్నారు. ఖమ్మంలో కూడా హైదరాబాద్ తరహా బ్యూటీపార్లర్లు అందుబాటులోకి రావడం ఆనందించదగిన విషయం. - గోళ్ల చంద్రకళ, టప్పర్‌వేర్ మార్కెటింగ్ మేనేజర్ ఆహారం.. అందానికే ప్రాధాన్యం ఖమ్మం నగర ప్రజల జీవనశైలిలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు అనేక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు, ఆహారపు అలవాట్ల విషయంలో కేర్ తీసుకుంటున్నట్లుగానే సౌందర్య పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు, యువతులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖర్చుకూ వెనుకాడడం లేదు. వివిధ రంగాల్లో పనిచేసేవారు వారి జీవన విధానానికి అనుగుణంగా సౌందర్య పరిరక్షణలో శ్రద్ధవహిస్తున్నారు. మగవాళ్లు సైతం స్కిన్, హెయిర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. - సిద్ధి పరిమళ, పరిమళ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఖర్చుకు వెరిసేది లేదు.. సౌందర్య సంరక్షణ కోసం నగర మహిళలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. బ్యూటీషియన్స్ అంచనా ప్రకారం ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది మహిళలు బ్యూటీపార్లర్లకు వస్తున్నారు. కొంతమంది మహిళలు సగటున నెలకు రూ.5 నుంచి 8వేల వరకు అందానికి మెరుగులు దిద్దేందుకు ఖర్చుచేస్తున్నారు. పలువురు ఉద్యోగరీత్యా నిరంతరం ఏసీలో ఉంటున్నారు. చెమట బయటకు వెళ్లే అవకాశం లేక కొందరు, దుమ్ముధూళిలో తిరగడం వల్ల వచ్చే చుండ్రు తదితర సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్మం, కేశ సంక్షరణ కోసం వీరు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. మగవాళ్లు కూడా హెయిర్, స్కిన్ కేర్ విషయంలో శ్రద్ధ కనబరుస్తుండటం గమనార్హం. ఏసీలో ఉండే పురుషులు బాడీ స్టీమ్‌కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మహిళల సౌందర్య పోషణకు కోసం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 వరకు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.