‘అందమే’ ఆనందం.. | For the high cost of external beauty | Sakshi
Sakshi News home page

‘అందమే’ ఆనందం..

Published Sun, Dec 7 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

‘అందమే’ ఆనందం..

‘అందమే’ ఆనందం..

అందచందాలపై మగువుల మక్కువ
బాహ్యసౌందర్యం కోసం భారీగా వ్యయం
బ్యూటీపార్లర్ల వైపు నగర మహిళల చూపు
తెలంగాణ ప్యారిస్ దిశగా ఖమ్మం !


అందం గురించి ఒక్కో సినీ కవి ఒక్కో విధంగా వర్ణించారు. ఒకరు ‘అందమే ఆనందం..’ అంటే మరొకరు ‘అందం అంటే ఆడది..’ అంటూ మగువల అందచందాలను ఆకాశానికెత్తారు. ఎవరెలా నిర్వచించినా అందం ప్రస్తావన వస్తే ఆడవాళ్లను విస్మరించలేమనేది యదార్థం. ఖమ్మం నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా నగర మహిళల సౌందర్యాభిరుచి పెంపొందుతోంది. బాహ్యసౌందర్యం కోసం భారీగానే వెచ్చిస్తున్నారు. అందుకే ఇక్కడ బ్యూటీపార్లర్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. నగరంలో బ్యూటీపార్లర్ లేని వీధి లేదంటే అతిశయోక్తికాదు. సుమారు 200 వరకు బ్యూటీపార్లర్‌లు ఉన్నట్టు ఓ అంచనా. హెయిర్, స్కిన్‌కేర్ విషయంలో నగర మహిళలు కనబరుస్తున్న శ్రద్ధను గమనిస్తే కొద్దిరోజుల్లో ‘తెలంగాణ ప్యారిస్’గా ఖమ్మం పేరుగడిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.     
 
ఖమ్మం హవేలి: అందచందాలకు నగర మహిళలు ఇస్తున్న ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే భారీ స్థాయి బ్యూటీపార్లర్లు... అభివృద్ధి, వ్యాపార రంగంలో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఖమ్మం నగరంలోనూ పదుల సంఖ్యలో దర్శనం ఇస్తున్నాయి. నగరంలో సుమారు ఇరవై వరకు భారీ స్థాయి బ్యూటీ పార్లర్లు వెలిశాయి. ఇక చిన్నాచితక బ్యూటీపార్లర్లయితే లెక్కలేవు. దాదాపు ప్రతి వీధికి ఒకటి చొప్పున అయినా ఉన్నాయి. మొత్తంగా 200కు పైగా ఉన్నట్టు ఓ అంచనా. సౌందర్యం విషయంలో మహిళలు, యువతులు పెద్ద నగరాల వారికి దీటుగా ప్రాధాన్యత ఇస్తుండడంతో ఖమ్మంలో బ్యూటీ పార్లర్‌ల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లు సైతం హెయిర్, స్కిన్ కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం గమనార్హం.

నలుగు నుంచి పార్లర్ దాకా...
భారతీయ సంప్రదాయంలో అలంకరణకు మహిళలు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు అందం తోడైతే ఆ ఆకర్షణే వేరు. పూర్వం ప్రతి వారంలో మహిళలు రెండుసార్లు చర్మానికి నలుగు పెట్టుకునేవారు. నేటి ఉరుకులపరుగుల యుగంలో అది ఒకింత కష్టమే. కాబట్టి పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని సౌందర్యం పోషణ కోసం అనేక రకాల హెర్బల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. బ్యూటీషియన్ సలహాతో వీటిని వినియోగిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. అందుకే తప్పనిసరిగా బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తున్నారు.

ప్యాకప్‌లేని మేకప్
మేకప్ విషయంలో స్త్రీ, పురుషులు విపరీతమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెడ్డింగ్ మేకప్, వివిధ వేడుకల మేకప్, మేకోవర్ ఫర్ పార్టీ మేకప్, రిసెప్షన్ మేకప్, క్లాసికల్ డాన్స్ మేకప్, సంగీత ప్రదర్శన మేకప్ తదితర మేకప్‌లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక మహిళలు డ్రెస్సింగ్, చర్మ రంగుకు అనుగుణంగా మేకప్‌లు వేస్తున్నారు. ఇక వెడ్డింగ్ (వివాహ వేడుకలు) విషయంలో అన్నిరకాల వారు తమ స్థాయితో సంబంధం లేకుండా డ్రెస్ సెన్స్, పెళ్లికూతురు అందం విషయంలో బ్యూటీషియన్ సలహాలు పాటిస్తున్నారు. ఆర్థికస్తోమత ఉన్నవారైతే ఓ బ్యూటీషియన్నే శుభకార్యాలప్పుడు అందుబాటులో ఉంచుకుంటున్నారు.

ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట..
ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పలువురి యువతులు, మహిళల అభిప్రాయం. నలుగురిలో మనం ఉండాలన్నా..నలుగురు మనని చూడాలన్నా ఆకర్షణ ముఖ్యమంటారు. చదువుకొనేవారు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం అందంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగం చేసేవారు, ఇతర రంగాల వారు తమ రూపానికి అనుగుణంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి వారు తమ జీవనవిధానం (లైఫ్‌స్టైల్)కు అనుగుణంగా బాహ్య సౌందర్యం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెయిర్ స్టైల్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువతులు బ్యాహ్యా సౌందర్యం, 30 సంవత్సరాల పైబడినవారు చర్మం పొడిబారడం లాంటి ఇతర సమస్యలను అధిగమించేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. అధికభాగం విద్యార్థినులు మొటిమలు రాకుండా, హెయిర్ పొడిబార కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సేవలు అనేకం
బ్యూటీ పార్లర్‌ల ద్వారా స్కిన్‌కేర్, హ్యాండ్, ఫుట్‌కేర్, హెయిర్ డిజైనింగ్, హెయిర్ ట్రీట్‌మెంట్, ఫేషియల్, ఐబ్రోస్, బాడీ స్పా, తదితరాల్లో అనేకమైన రకాలు ఉన్నాయి. కొన్ని రకాల సేవలు ధర ఎక్కువ ఉన్నా వెనుకాడడం లేదు. మహిళలు ఎక్కువగా ఆర్గానిక్, మినరల్, ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకుంటున్నారు. వీటికి ఒక్కసారికి రూ.2వేలకు పైగానే వెచ్చిస్తున్నారు. చర్మానికి తేమ తీసుకొచ్చే స్కిన్ హైడ్రేటింగ్ కోసం రూ.1500కు పైగానే ఖర్చు చేస్తున్నారు. నెయిల్ కేర్‌కు రూ. 500వరకు వెచ్చిస్తున్నారు.
 
బిజీ లైఫ్‌లో బ్యూటీపార్లర్స్‌తో సమయం ఆదా
ప్రస్తుతం ప్రతి విషయంలో బిజీ జీవితాన్ని గడపాల్సి వస్తోంది. పిల్లలను పాఠశాలకు పంపే దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ హడావుడి . ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా బయటకు వెళ్లినప్పుడు, ఆఫీస్‌లో సైతం బిజీగా గడపక తప్పడం లేదు. ఇలాంటి సమయంలో స్కిన్, హెయిర్ కేర్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్‌లు అందిస్తున్న సేవలు బాగుంటున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉన్న సమయంలో వారు వచ్చి తమకు అవసరమైన సేవలు పొందుతున్నారు. ఖమ్మంలో కూడా హైదరాబాద్ తరహా బ్యూటీపార్లర్‌లు అందుబాటులోకి రావడం ఆనందించదగిన విషయం.  - గోళ్ల చంద్రకళ, టప్పర్‌వేర్ మార్కెటింగ్ మేనేజర్
 
ఆహారం.. అందానికే ప్రాధాన్యం
ఖమ్మం నగర ప్రజల జీవనశైలిలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు అనేక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు,  ఆహారపు అలవాట్ల విషయంలో కేర్ తీసుకుంటున్నట్లుగానే సౌందర్య పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు, యువతులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్  కోసం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖర్చుకూ వెనుకాడడం లేదు. వివిధ రంగాల్లో పనిచేసేవారు వారి జీవన విధానానికి అనుగుణంగా సౌందర్య పరిరక్షణలో శ్రద్ధవహిస్తున్నారు. మగవాళ్లు సైతం స్కిన్, హెయిర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
- సిద్ధి పరిమళ, పరిమళ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు
 
ఖర్చుకు వెరిసేది లేదు..
సౌందర్య సంరక్షణ కోసం నగర మహిళలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. బ్యూటీషియన్స్ అంచనా ప్రకారం ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది మహిళలు బ్యూటీపార్లర్లకు వస్తున్నారు. కొంతమంది మహిళలు సగటున నెలకు రూ.5 నుంచి 8వేల వరకు అందానికి మెరుగులు దిద్దేందుకు ఖర్చుచేస్తున్నారు. పలువురు ఉద్యోగరీత్యా నిరంతరం ఏసీలో ఉంటున్నారు. చెమట బయటకు వెళ్లే అవకాశం లేక  కొందరు, దుమ్ముధూళిలో తిరగడం వల్ల వచ్చే చుండ్రు తదితర సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్మం, కేశ సంక్షరణ కోసం వీరు బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తున్నారు. మగవాళ్లు కూడా హెయిర్, స్కిన్ కేర్ విషయంలో శ్రద్ధ కనబరుస్తుండటం గమనార్హం. ఏసీలో ఉండే పురుషులు బాడీ స్టీమ్‌కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మహిళల సౌందర్య పోషణకు కోసం మార్కెట్‌లో సుమారు 200 నుంచి 300 వరకు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement