ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను గుర్తిస్తుంది
ఇంట్లో ఉండి కూడా మన చర్మం గురించి తెలుసుకోవచ్చు
ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న స్మార్ట్ మిర్రర్స్ వాడకం
బ్యూటీ పార్లర్లలో అధునాతన మిర్రర్స్ వినియోగం
చర్మ సౌందర్య సాధానాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే.. కానీ నేడు పురుషులు కూడా అందం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సౌందర్య సాధానాల వాడకం విపరీతంగా పెరిగింది. 2023లో వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.135 కోట్లు. 2026 నాటికి రూ.230 కోట్లకు ఎగబాకనున్నదని నిపుణుల అంచనా. నగరాల్లో కాలుష్యం, ఎండ, దుమ్ము కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి రక్షణకు చాలామంది మార్కెట్‌లో దొరికిన అనేక రకాల క్రీములు, జెల్స్, పౌడర్లు, సోప్‌లు, ఫేస్ వాష్‌లు వాడేస్తున్నారు. ఎలాంటి చర్మానికి ఎలాంటి సాధనాలు వాడాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి మన చర్మం తత్వం ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా..? అందుకే మన లాంటి వారి కోసమే నేనున్నా అంటూ వచ్చేసింది స్మార్ట్ మిర్రర్. ఇది మన చర్మ సమస్యలను ఇట్టే చెప్పేస్తుంది..
సాధారణ అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్మార్ట్ మిర్రర్‌లో మాత్రం మన ముఖంలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్న మాట. కళ్ల కింద నలుపు, నల్ల మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు, మన చర్మం స్వభావం వంటి విషయాలు వెంటనే చెప్పేస్తుంది. మన ముఖంలో ఉన్న సమస్యలను కచ్చితత్వంతో పసిగట్టి మనకు విశ్లేషణ అందిస్తుంది. దీన్నిబట్టి మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంచనాకు రావొచ్చు. ఇటీవల పలు బ్యూటీ పార్లర్స్‌లో కూడా దీని వాడకం విరివిగా పెరిగిపోయింది.
సొంతంగానూ వాడుకోవచ్చు..
చాలా కంపెనీలు స్మార్ట్ మిర్రర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్యాబ్ పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ మిర్రర్ దాదాపు రెండున్నర కేజీల బరువు ఉంటుంది. దీనికి ఒక హెచ్‌డీ కెమెరా ఉంటుంది. దీని ముందు ముఖం పెట్టగానే కొన్ని ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను విశ్లేషించి మన చర్మం తత్వాన్ని చెప్పేస్తుంది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మన వెంటే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని ద్వారా మన చర్మంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు.
కాస్త జాగ్రత్త మరీ..
ఏదైనా పరికరంలో కెమెరాలు ఉన్నాయంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వాడనప్పుడు మూసేసి ఉంచడం మంచిది. కాకపోతే కొన్ని స్మార్ట్ మిర్రర్స్ వాడకంలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతుంది. దీంతో కాస్త వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. మనం స్మార్ట్ మిర్రర్‌గా వాడనప్పుడు కెమెరాలు క్లోజ్ అయిపోయి.. సాధారణ అద్దంలాగే వాడుకోవచ్చు.
హైటెక్ మిర్రర్ కూడా..
ఇంట్లోనే కాకుండా బ్యూటీ పార్లర్స్‌లో కూడా ఎక్కువగా స్కిన్ అనలైజర్లను ఇటీవల వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మిర్రర్ ఇచి్చన ఇన్‌పుట్స్ ఆధారంగా శరీర తత్వానికి తగ్గట్టు సౌందర్యసాధనాలను వాడుతున్నారు. ఎలాంటి మేకప్ వేస్తే వారి చర్మానికి సూట్ అవుతుందనే విషయంపై ఓ అవగాహనకు వచి్చ, వారికి అలాంటి ఉత్పత్తులనే వాడుతున్నారు.
పూర్తిస్థాయి పరిష్కారం కాదు..
స్మార్ట్ మిర్రర్స్ ద్వారా ఆయిల్ స్కిన్, పొడి చర్మమా అని చర్మం తత్వం గురించి తెలుస్తుంది. స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే తెలుపుతుంది. ఎండ లేదా కాలుష్యానికి ఎంతగా ప్రభావితమైందో అర్థం అవుతుంది. వీటి ద్వారా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంచనాకు రావొచ్చు. అయితే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వదు. వ్యాధి నిర్ధారణ విషయంలో స్మార్ట్ మిర్రర్స్‌ను నమ్ముకోవద్దు. అలాంటప్పుడు డెర్మటాలజిస్టును కలిసి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకుంటే మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
– డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
Comments
Please login to add a commentAdd a comment