ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు | - | Sakshi
Sakshi News home page

ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు

Published Thu, Jun 15 2023 10:08 AM | Last Updated on Thu, Jun 15 2023 10:57 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వివాహం, నిశ్చితార్ధం, ఆఫ్‌ శారీ ఫంక్షన్‌, పుట్టిన రోజు వేడుకలు, పండగలు, ఇతరత్రా ఉత్సవాలు.. ఇలా ప్రత్యేక సమయా ల్లో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని ఎవరైనా కోరుకుంటారు. దీనికోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇలాంటి వారికోసమే జిల్లావ్యాప్తంగా బ్యూటీపార్లర్లు, ప్రత్యేకమైన సెలూన్లు వెలిశాయి. ఈ రంగంపై ఆధారపడి జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు.

పల్లెలకు పాకిన కల్చర్‌..
మహానగరాల నుంచి నేడు మారుమూల పల్లెలకు సైతం ఈ సంస్కృతి శరవేగంగా పాకింది. పెద్ద పెద్ద కుటుంబాలకే మాత్రమే పరిమితమైన బ్యూటీపార్లర్‌ కల్చర్‌ ఇప్పుడు సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది. డబ్బుతో ఏముంది.. మళ్లీ సంపాదించుకోవచ్చని, ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆసక్తితో యువతులు, మహిళలు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఐబ్రోస్‌, ఫేషియల్‌, బ్రైడల్‌ మేకప్‌, శారీ ట్రాపింగ్‌, పెడిక్యూర్‌, మేనిక్యూర్‌, గోల్డెన్‌ ఫేషియల్‌, సిల్వర్‌ ఫేషియల్‌, హెడ్‌ మసాజ్‌, వ్యాక్స్‌, మెహందీ, హెయిర్‌స్పా, హెయిర్‌ కట్స్‌, ప్రిఫరబుల్‌ కాస్ట్యూమ్‌లతో అందాన్ని మరింతగా తీర్చిదిద్దుకుంటున్నారు.

ఉపాధి కోణం..
నేడు ఫ్యాషన్‌ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు పెరిగాయి. వీటిని యువకులు, మహిళలు అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలలో ప్రత్యక్ష శిక్షణతో పాటు ఆన్‌లైన్‌ వేదికగా శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతూ మరి కొంత మందికి ఉపాధి మార్గం చూపుతున్నారు. ఒక్కొక్క మేకప్‌కు వారు వినియోగించే క్రీమ్‌లు ఇతర సౌందర్య సాధనాలు.. కేటాయించే సమయాన్ని బట్టీ రూ.500 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారి ఇళ్లలో ఫంక్షన్‌లు అయితే మేకప్‌ కోసం రూ.లక్షల్లో తీసుకున్న సందర్భాలు సైతం ఉంటున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఈ రకమైన వృత్తిలో ఉన్నారు.

పురుషుల్లోనూ పెరిగిన ఆసక్తి
మహిళల మాదిరిగానే పురుషులు కూడా అందం పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. యువత ఫేషియల్స్‌, స్క్రబ్స్‌ వంటివి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివాహాల సమయంలో ఫేషియల్‌, హెయిర్‌ స్టైల్స్‌, ఫేస్‌ ప్యాక్స్‌ వంటివి చేసుకుంటున్నారు. వాడే కాస్ట్యూమ్స్‌ మేరకు రూ.2 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నాం.– తోటపల్లి శ్రీనివాసరావు, వీనస్‌ సెలూన్‌, బొందిలీపురం

భలే డిమాండ్‌..
ప్రస్తుతం ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా పెళ్లిళ్లు, ఆఫ్‌శారీ ఫంక్షన్లు, నిశ్చితార్థం, పుట్టిన రోజు వేడుకలు, పండగల సమయంలో భలే డిమాండ్‌ ఉంది. ముఖ స్వభావం బట్టీ క్రీమ్‌లు వినియోగిస్తాం. మేకప్‌ చేయడానికి గంటల సమయం పడుతుంది. వినియోగించే క్రీమ్‌లు, కేటాయించే సమయం బట్టీ డబ్బులు తీసుకుంటాం.
– ఎన్‌.లావణ్య, బ్యూటీషియన్‌, వజ్రపుకొత్తూరు మండలం

ఎంతో మందికి ఉపాధి
ముఖ సౌందర్యంపై ఆసక్తి పెరగడంతో మాకు ఉపాధి దొరుకుతోంది. ఐబ్రోస్‌, ఫేషియల్‌, హెయిర్‌కట్‌, హెయిర్‌ స్పా, పెడిక్యూర్‌, మేనిక్యూర్‌, వ్యాక్సింగ్‌ తదితర ప్రక్రియ ద్వారా అందంగా తయారు చేస్తున్నారు. వివాహాలకై తే మేకప్‌, శారీ ట్రాపింగ్‌, హెయిర్‌ స్టైల్‌, ఫేస్‌ మేకప్‌, బ్రైడల్‌ మేకప్‌, మెహందీ, ప్రిఫరబుల్‌ కాస్ట్యూమ్‌ తదితర విధానాల ద్వారా ముస్తాబు చేసేందుకు రూ.5 వేల నుంచి రూ.50వేలు వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
– రాయవలస పార్వతి, వరిన్య బ్యూటీ క్లినిక్‌, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement