పెరుగు వెనిగర్ కలిస్తే
నిగనిగల్!
ఆఫీస్ హడావిడితో ఉరుకులు పరుగుల మీద ఉండే మహిళలకు బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఫేషియల్ చేయించుకునే తీరిక ఉండదు. కాబట్టి వారు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే నేచురల్ ఫేషియల్ చేసుకుంటే సరి. రెండు టీ స్పూన్ల పెరుగులో నాలుగు చుక్కల వెనీగర్‌ను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ 10నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చాలు. నిగనిగలాడే కాంతివంతమైన ముఖం మీ సొంతం.చాలామందికి మాడు ఎప్పుడూ దురదగా ఉంటుంది. అది చుండ్రు వల్ల కావచ్చు లేక సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. ఆ దురద నుంచి ఉపశమనం పొందాలంటే రోజు విడిచి రోజు నిమ్మరసానికి ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఓ 20 నిమిషాల తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దురద మటుమాయం అవడంతో పాటు జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
ముఖంపై వైట్‌హెడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత అందమైన ముఖమైనా కాంతిహీనంగా కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి దూరం కావాలంటే ఆ వైట్‌హెడ్స్‌పై తేనె రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో దూది ఉండను ముంచుతూ ఆ తేనెను తుడిచేయాలి. అలా రోజుకు రెండుసార్లు చేస్తే వెంటనే ఫలితాన్ని చూడొచ్చు.