పదే పదే కొట్టుకువచ్చే కష్టాల వరదను దాటుకుంటూ ఎదిగిన మహిళ ప్రజ్ఞావేదాంత్. ఒక చిన్నగదిలో బ్యూటీషియన్ గా జీవితం మొదలుపెట్టిన ఆమె, పదేళ్లక్రితం వరదల్లో తన సెలూన్, ఇల్లు కొట్టుకుపోవడంతో పెరాలసిస్ వచ్చి, వీల్ చైర్‌కు పరిమితం అయ్యింది. అయినా, కోలుకొని వీల్ చైర్ నుంచి తిరిగి జీవితం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 35,000 మంది మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇచ్చింది. డబ్బులేని మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిని ఆర్థికంగా నిలబట్టింది. ప్రజ్ఞా వేదాంత వెస్ట్ ముంబైలో ప్రముఖ బ్యూటీ కన్సల్టెంట్. ములుంద్‌లో ఆమె పేరుతో బ్యూటీ అండ్ హెయిర్ అకాడమీ ఉంది. దాదాపు పదేళ్లుగా వేలాది మంది మహిళలకు ఆమె బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తోంది. బ్యూటీ ప్రొడక్ట్స్‌తో ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రజ్ఞా వేదాంత్ ఒక అకాడమినీ నిర్వహించే స్థాయికి చేరుకోవడం, డాక్టరేట్ పొందడం అంత సులభం కాలేదు.
చిన్న వయసులో పెళ్లి
గుజరాత్‌లో పుట్టి పెరిగిన ప్రజ్ఞా స్కూల్ చదువు కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి జరిగినా చదువాపలేదు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. చిన్ననాటి నుంచి బ్యూటీషియన్ అవ్వాలన్న కలను నెరవేర్చుకోవడానికి ముంబయ్ చేరుకుంది. రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని, ఒక గదిని వంట చేసుకోవడానికి, మరొక గదిని సెలూన్‌గా మార్చుకుంది. అక్కడే చుట్టుపక్కల మహిళలకు థ్రెడింగ్, ట్రిమింగ్.. వంటివి చేయడం. మెహెందీ పెట్టడం వంటివి ప్రారంభించింది. దాంతో పాటే బ్యూటిషియన్, మెహెందీ క్లాసులు కూడా తీసుకునేది. ఈ పని చేయగా వచ్చిన డబ్బును పొదుపు చేసి, బ్యూటీషియన్‌లో ప్రొఫెషనల్ కోర్సులు తీసుకుంది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా బ్యూటీపార్లర్‌ను ప్రారంభించింది. పదేళ్లు విజయవంతంగా బ్యూటీపార్లర్‌ను నడిపింది.
జీవితాన్ని ముంచేసిన వరదలు
2005లో ముంబైలో విపరీతమైన వరద పోటెత్తింది. ఆ వరదల్లో ప్రజ్ఞా సెలూన్, ఇల్లు రెండూ కొట్టుకుపోయాయి. తను కలగన్న ప్రపంచం తలకిందులు అవ్వడంతో ప్రజ్ఞాకు పెరాలసిస్ వచ్చింది. ఆ సమయంలో కంటిచూపు కూడా మందగించింది. మూడు నెలలపాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. కొద్ది కొద్దిగా కోలుకుంటూ వీల్‌చైర్ సాయంతో మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
పడి లేచిన కెరటం
ప్రజ్ఞా వేదాంత్ బ్యూటీ అండ్ హెయిర్ అకాడమీ ఏర్పాటు చేసింది. బ్యూటీ కన్సల్టెంట్‌గా మహిళలకు బ్యూటీషియన్ కోర్సులు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె కృషి, ధైర్యం, మనోబలం ఆమెను మరోసారి విజయవంతంగా నిలబెట్టాయి. ఈ పదేళ్లలో ఆమె తన అకాడమీలో 35,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఈ కోర్సులు చేయడానికి ఎవరైనా మహిళలకు డబ్బు లేకపోతే, అలాంటి వారికి ఉచితంగా బ్యూటీషియన్ శిక్షణ ఇస్తోంది. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ దిగ్విజయంగా నడుపుతున్నందుకు యూనివర్శిటీ స్థాయి నుంచి గౌరవడాక్టరేట్ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment