ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్‌' టాపర్‌గా..! | Urdu Medium Student Ameena Arif Got Top Rank In NEET | Sakshi
Sakshi News home page

ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్‌' టాపర్‌గా..! అమీనా ఆరిఫ్‌

Published Sat, Jun 8 2024 8:07 AM | Last Updated on Sat, Jun 8 2024 8:07 AM

Urdu Medium Student Ameena Arif Got Top Rank In NEET

‘నీట్‌’ ఎగ్జామ్‌లో ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌గా నిలవడం సామాన్యం కాదు. ముంబైలో ఓ బేకరి వర్కర్‌ కుమార్తె అయిన అమీనా ఆరిఫ్‌ పది వరకూ ఉర్దూ మీడియంలో చదివింది. ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియంతో ఇబ్బంది పడింది. అయినా నీట్‌ 2024లో 720 కి 720 తెచ్చుకుని టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక కథనం...

‘మెహనత్‌ కర్నా హై... మోటివేట్‌ రెహనా హై (కష్టపడాలి... ప్రేరణతో ఉండాలి) అని చెప్పింది అమీనా ఆరిఫ్‌ తన విజయం గురించి. వైద్యవిద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్‌’లో 2024 సంవత్సరానికి 720 మార్కులకు 720 మార్కులతో టాప్‌ 1 ర్యాంకు సాధించింది అమీనా. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 67 మందికి టాప్‌ 1 ర్యాంకు వచ్చింది. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మిగిలిన వారితో పోల్చితే అమీనా గెలుపు కాస్త భిన్నమైనది. ఎందుకంటే 10వ తరగతి వరకూ ఆమె ఉర్దూ మీడియంలో చదివింది.

బేకరి వర్కర్‌ కుమార్తె..
ముంబై పశ్చిమ శివార్లలో ఉండే జోగేశ్వరి ప్రాంతం అమీనాది. తండ్రి బేకరీలో పని చేస్తాడు. అక్కడ ఉన్న మద్నీ హైస్కూల్‌ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పేరు గడించింది. ఉర్దూ మీడియంలో బోధన సాగే ఆ స్కూల్లోనే అమీనా పది వరకు చదివింది. ఆ తర్వాత పార్లెలోని మితిబాయి కాలేజీలో బైపీసీలో చేరింది. ‘అంతవరకూ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల బైపీసీ ఇంగ్లిష్‌ మీడియం చదవడం కష్టమైంది. ఇంగ్లిష్‌లో నా వెనుకంజ నా చదువునే వెనక్కు నెట్టకూడదని గట్టిగా కష్టపడ్డాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు ఇంటర్‌లో 95 శాతం మార్కులు వచ్చాయి.

మళ్లీ ప్రయత్నించి..
‘అమ్మా నాన్నా నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. లాక్‌డౌన్‌ వల్ల మొదటిసారి నీట్‌ రాసినప్పుడు నాకు గవర్నమెంట్‌ కాలేజీలో సీట్‌ వచ్చేంత ర్యాంక్‌ రాలేదు. నిస్పృహ చెందకుండా ప్రయత్నించాను. ఈసారి కోచింగ్‌ తీసుకున్నాను. ఆరు గంటలు కోచింగ్, ఇంట్లో మరో నాలుగైదు గంటలు సెల్ఫ్‌ స్టడీ... ఇలా సాగింది నా కృషి.

కోచింగ్‌ సెంటర్‌లో మాక్‌ టెస్ట్‌లు రాసేటప్పుడు 700 మార్కులకు తరచూ 620 వచ్చేవి. అప్పుడే అనుకున్నాను... కచ్చితంగా 700 దాటుతానని ముందే అనుకున్నాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు వచ్చిన ర్యాంక్‌కు దేశంలోని ఏ మెడికల్‌ కాలేజీలో అయినా సీట్‌ వస్తుంది కానీ అమీనా మాత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement