Beauty Saloon
-
అక్కడికెళితే అవమానాలే : ట్రాన్స్జెండర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు. సగం ధరలకే సేవలు.. ‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్‌జెండర్, సెక్స్‌వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్‌గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే.. ట్రాన్స్జెండర్లకు ఒక ఎన్జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉద్యోగం కావాలా? ముస్తాబు చేస్తాం
కొత్త సేవ అన్నదానం చేయడమే ‘సేవ’ కాదు... అందంగా తయారు చేయడం కూడా సేవగా పారిస్‌లో భావిస్తున్నారు. దీనులైన స్త్రీలను అందంగా ముస్తాబుచేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఈ ఫొటోలు ఇక్కడివి కావు. పారిస్వి. నిన్న మొన్న తీసినవి. ఏం జరుగుతున్నట్టు ఇక్కడ? ఇదో బ్యూటీ సెలూన్. దీని పేరు ‘జోసఫైన్’. పారిస్‌లో ప్రస్తుతం నిరుద్యోగం తారస్థాయిలో ఉంది. డబ్బున్న వాళ్లకు పేదవాళ్లకు మధ్య అంతరం పెరిగిపోతోంది. స్త్రీలు, పురుషులు అక్కడ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం రావాలంటే మనిషి చక్కగా ఉండాలి. చక్కగా తయారవ్వాలి. ఇది మామూలు స్త్రీలకు పెద్ద కష్టం కాదు. కాని అక్కడ డిప్రెషన్ వల్ల, విడాకుల వల్ల, డ్రగ్స్‌కు బానిసలుగా మారడం వల్ల, జైళ్లకు వెళ్లిరావడం వల్ల తమ మీద తాము శ్రద్ధ కోల్పోయి అందవిహీనంగా తయారైన ఆడవాళ్లకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎవరు ఇంటర్వూ్యలకు రానిస్తారు? అందుకని పారిస్‌లో ఉన్న జోసఫైన్ అనే ఖరీదైన బ్యూటీ పార్లర్ తన వంతు సేవచేయడానికి ముందుకు వచ్చింది. జీవితంలో దెబ్బ తిని తమ మీద తాము ఆసక్తి కోల్పోయి అవస్థ పడుతున్న ఆడవాళ్లకును టీ నీళ్ల ఖర్చుతో శ్రద్ధగా తయారుచేస్తూ ఉంది. అంతే కాదు వాళ్లు ఉద్యోగం కోసం ఇంటర్వూ్యలకు వెళ్ల దలిస్తే కనుక అందుకు అవసరమైన బట్టలు కూడా ఇచ్చి పంపుతోంది. ఈ చర్యతో వాళ్లు తమలో తాము ఆత్మవిశ్వాసం తెచ్చుకుంటూ ఉన్నారు. ధైర్యంగా తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ‘వెన్ లైఫ్ ఈజ్ అగ్లీ... మేక్ ఉమన్ బ్యూటిఫుల్’ అనే నినాదంతో ఈ సెలూన్ పని చేస్తోంది. అంటే జీవితం కళావిహీనంగా ఉన్నప్పుడు రూపం కళాత్మకంగా మార్చుకోవడం అవసరం అని ఇది చెప్తోంది. ఫ్రాన్స్‌లోనే కాదు అమెరికాలో కూడా ఈ తరహా సామాజిక సేవ ఇటీవల జరుగుతూ ఉంది. ఇండియాలో ఎవరూ ఇంకా నడుం బిగించలేదు. ఆ పని ఇక్కడ కూడా మొదలైతే జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనడానికి మన స్త్రీలు వెనుకంజ వేయరు. కదూ?