వానలోనూ.. సమైక్య జోరు | united andhra movement | Sakshi
Sakshi News home page

వానలోనూ.. సమైక్య జోరు

Published Sat, Aug 17 2013 3:59 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

united andhra movement


 సాక్షి, కడప : సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో బలంగా వినిపిస్తోంది. జోరువానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు.  రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలతో జిల్లా వేడెక్కుతోంది.  నాలుగు రోజులుగా ఆర్టీసీ,  ఎన్జీఓల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పులివెందుల, రాయచోటిలో సమైక్య బంద్ సక్సెస్ అయింది.  జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్బంధంచేశారు. కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలను సైతం ముందుకు కదనీయలేదు. సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను తగలబెడుతునే ఉన్నారు. కడప, పులివెందులలో  మహిళా ఉపాధ్యాయులు రోడ్లపైనే శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. వైఎస్సార్ సీపీనేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ముస్లింల ఆధ్వర్యంలో కడప నగరంలో ర్యాలీ నిర్వహించి  సంఘీభావం తెలిపారు.
 
  జేఏసీ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, నగర పాలక సంస్థ, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఉద్యానశాఖ అధికారులు, ఉద్యోగులు ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు,ఏడీలు దశరథరామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ప్రైవేటు వైద్యులు చేస్తున్న స్కూటర్ ర్యాలీని పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేశారు. అంబులెన్స్‌లు నిరసనల్లో పాల్గొనగా వాటిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి,మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష శుక్రవారంతో ఐదవ రోజు పూర్తి చేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమందిగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేశారు.  జోరువాన, చలిని సైతం లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో ఆందోళన  కొనసాగిస్తున్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, అంజాద్‌బాష దీక్షలకు  తమ సంఘీభావాన్ని తెలిపారు.జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి.
 
  జమ్మలమడుగులో పట్టణం నలువైపుల ఉన్న రహదారులను పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారు. ద్విచక్ర వాహనాలను సైతంముందుకు కదలనీయలేదు. మార్కెట్ వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్‌వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, అల్లె ప్రభావతి పాల్గొన్నారు.
 
  రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో రెండవ రోజుపూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వైస్సార్ సీపీ, మెడికల్ షాప్, పెయింటర్స్, కళ్లుగీత కార్మికుల ఆధ్వర్యంలో వర్షంలోనూ వైఎస్సార్ సర్కిల్ వద్ద రాస్తారోకో, ధర్నా  నిర్వహించారు. అక్కడే వంటా వార్పు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.
 
  రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దీక్ష శుక్రవారం రెండవరోజు పూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షలకు మద్దతు తెలిపారు. ముస్లింలు సైతం భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు తమ సంఘీభావాన్ని తెలిపారు.
 
  బద్వేలులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పెద్ద ఎత్తున జేఏసీ, ఆర్టీసీ, ఉపాధ్యాయ ఐక్య కార్యచరణసమితి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. పోరుమామిళ్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కలసపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వైపులా రహదాలను దిగ్బంధనంచేశారు. ద్విచక్ర వాహనాలను సైతం తిరగకుండా అడ్డుకున్నారు. వర్షంలోనే తడుస్తూ వైఎస్సార్ సీపీ నేతరాచమల్లు ప్రసాద్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి ఆందోళనను పర్యవేక్షించారు. రెవెన్యూ ఉద్యోగులు, బీఈడీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టైలర్స్, వాకర్స్, అర్నాడ్డ్ జిమ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.  
 
  కమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం నిర్వహించి బంద్ పాటించారు. తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నడిరోడ్డుపై క్రికెట్ ఆడుతూ, వంటా వార్పు చేపట్టారు.టైలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు.
 
  మైదుకూరులో న్యాయవాదులు, ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 రరాయచోటిలో బంద్  సక్సెస్ అయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జమాతె ఉలేమా హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాలుగురోడ్ల కూడలిలో రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పుకార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. వీరబల్లిలో సమైక్యవాదులు రెండు వేల మందికి పైగా అన్నదానం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement