ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గం | Samaikyandhra Stir Continues | Sakshi
Sakshi News home page

ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గం

Published Mon, Aug 19 2013 3:14 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గం - Sakshi

ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గం

సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో అలుపెరగకుండా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా వరుసగా 19రోజులుగా ఎగసిన సమైక్య ఉద్యమం ఆదివారం కూడా ప్రభంజనంలా సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో యథావిధిగానే హోరెత్తాయి. విశాఖ జిల్లా గోపాలపట్నం, వేపగుంటల్లో విజయమ్మ దీక్షకు మద్దతుగా క్రైస్తవమత పెద్దలు ప్రార్ధనలు చేశారు. దీక్షకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంపీ సబ్బంహరి మాట్లాడుతూ, అందరి చెమట చుక్కలతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఏదో ఓ రోజు ఓ నేత వచ్చి రాష్ట్రాన్ని బాగుచేస్తారని అన్నారు.
 
 ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగ సంఘాలు
 అనంతపురం నగరంలో ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్మాకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. వీహెచ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్కేయూ జేఏసీ నేతలు అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో  చేపట్టారు. రాయదుర్గంలో ముస్లింలు, ఉద్యోగులు, సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు ఆయన సతీమణి కాపు భారతి సంఘీభావం ప్రకటించారు.
 
 విశాఖ పోర్టులో నేడు కార్యకలాపాలు బంద్
 విశాఖ పోర్టు ట్రస్టులో సోమవారం సరుకుల ఎగుమతి దిగుమతులు నిలిచి పోనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పోర్టులో ఎగుమతి దిగుమతుల కార్యకలాపాలు నిర్వహించే అన్ని సంఘాలు బంద్‌కు పిలుపు నిచ్చాయి.  సరుకుల ఎగుమతి దిగుమతి నిలిచిపోనుండటంతో ఈ ప్రభావం నౌకలపైనా పడనుంది.
 
 సమ్మెకు దిగిన కోర్టుల సిబ్బంది
 విశాఖ జిల్లా న్యాయస్థానాల సిబ్బంది ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టారు. జిల్లాలో 61 న్యాయస్థానాల నుంచి 653 మంది శాశ్వత సిబ్బంది, మరో 200 మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విధులు బహిష్కరించడంతో కోర్టుల్లో కార్యకలాపాలు ఎలా సాగుతాయన్న విషయమై చర్చ జరుగుతోంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు సమైక్యాంధ్ర కోరుతూ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
 
 మోకాళ్లపై నిలబడి క్రైస్తవుల ప్రార్థన
 వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో మోకాళ్లపై నిలబడి క్రైస్తవులు ప్రార్థ్ధనలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.  ఐఎంఎ వైద్యులు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు.  కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద ముస్లింలు నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేశారు.
 
 సమైక్యంగా ఉండాలంటూ బోనాలు
 రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు.  మైలవరంలోని జాతీయ రహదారిపై తెలుగుతల్లి సెంటర్‌లో రజక సంఘం అధ్వర్యంలో ఆదివారం చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగామలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో రోడ్లను శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు.
 
 దీక్షా శిబిరం వద్దనే ముస్లింల నమాజ్
 అవనిగడ్డలో ముస్లిం సోదరులు సమైక్యాంధ్రకు మద్దతుగా  దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్దే  సమైక్యాంధ్ర కోరుతూ ప్రత్యేక నమాజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో  వైఎస్సార్‌సీపీ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం రాజా నగరం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. రాజానగరంలో జరిగిన యాత్రలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ముమ్మిడివరంలో జరిగిన యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో  వైఎస్సార్‌సీపీ నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, నగర యూత్ కన్వీనర్ గౌతమ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.
 
 రోడ్డుపైనే లక్ష్మీగణపతి హోమం
 బ్రాహ్మణ సంఘం, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు.  ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో సుమారు 300 మంది ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు.
 
 వడ్డెర సంఘం వినూత్న నిరసన
 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వడ్డెర సంఘం, వడ్డెర ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో విభజనను నిరసిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సోమప్ప సర్కిల్‌లో ఇటుకలతో గోడకట్టారు. రాళ్లు కొట్టడంతో పాటు రోళ్లు తయారు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ నాయకులు ఒంటికాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఆత్మకూరులో  వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు.
 
 ఎంపీ మేకపాటి ఆధ్వర్యంలో రాస్తారోకో
 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు కనుపర్తిపాడులో వైఎస్‌ఆర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరులలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, దబ్బల రాజారెడ్డి,పాశం సునీల్‌కుమార్, బాల చెన్నయ్య ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో దున్నపోతులకు కేంద్రమంత్రుల మాస్కులు తగిలించిన ఫ్లెక్సీతో వినూత్న నిరసన చేశారు. పెన్నా నదిలో కేసీఆర్‌కు కర్మకాండలు నిర్వహించి పిండ ప్రదానం చేశారు. గుంటూరు బస్టాండ్ సెంటర్‌లో ఆటోకార్మిక యూనియన్ ర్యాలీలో ఎంపీ రాయపాటి సాంబశివరావు పాల్గొని ఆటోను నడిపి ర్యాలీని ప్రారంభించారు. రేపల్లెలో ఆర్టీసీ కార్మికులు బస్‌డిపోలో చీపుర్లు పట్టుకుని శుభ్రం చేసి నిరసన తెలిపారు. కారంపూడిలో జరిగిన సమైక్యవాదుల నిరసనలో వైఎస్‌ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు.
 
 చేనేత కార్మికుల ర్యాలీ
 చిత్తూరు జిల్లా మదనపల్లెలో  సుమారు 3 వేల మందితో చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డిని సమైక్య వాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో క్రైస్తవులు సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీ చేపట్టి మానవహారం నిర్మించారు. కమలాపురంలో క్రైస్తవులు మోకాళ్లపై నిలబడి ప్రార్థనలు చేశారు.
 
 విజయమ్మ దీక్షకు మద్దతుగా నేడు కొయ్యలగూడెం బంద్
 విజయమ్మ దీక్షకు సంఘీభావంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బంద్‌కు ఎన్‌జీవోల జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో బ్రాహ్మణ సంఘం యాగం చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ బస్సుయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ పాల్గొన్నారు.  రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద గ్రామస్తులు, యువకులు రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 50 అద్దెబస్సులతో  విజయనగరం పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గరివిడిలో సమైక్యవాదులు  గంగిరెడ్లతో ప్రదర్శన  చేపట్టిన అనంతరం  హోమాలు , డప్పువాయిద్యాలతో రోడ్డుపై ఆటాపాటా నిర్వహించారు.
 
 పోలీసు వలయంలో ‘అనంత’
 సమైక్యాంధ్ర ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తోన్న ‘అనంత’పై ప్రభుత్వం డేగకన్ను వేసింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 15 వేల మంది పోలీసులు జిల్లాలో మోహరించగా, తాజాగా ఆదివారం 13 వేల మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను కేటాయించారు. రాయలసీమ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలను విభజించి... రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికే అదనపు బలగాలను మోహరిస్తున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 15న డీజీపీ దినేష్‌రెడ్డి తిరుపతిలో రాయలసీమ ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆరా తీశారు. అదే జరిగితే ‘అనంత’ అగ్నిగుండమయ్యే అవకాశం ఉందని ఎస్పీ శ్యాంసుందర్ డీజీపీకి వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విస్తృత పోలీసు బలగాలు జిల్లాకు తరలివస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా, పోలీసులు బలగాలు ఆదివారం సాయంత్రం అనంతపురంలో భారీఎత్తున కవాతు నిర్వహించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement