సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓలు ఉమ్మడిగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో చేపట్టిన ఉద్యమం ఐదో రోజూ ఉధృతంగా సాగింది. వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్, సిటీ సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం హైవేపై రాస్తోరోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
గూడూరులో జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గూడూరు రాణిపేటకు చెందిన పెంచలయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఎన్‌జీఓ నేతలు నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
నెల్లూరులో వైఎస్సార్‌సీపీ నేతలు కోటంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద హైవేపై ఆందోళనకారులు ఒకటిన్నర గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. హైవేపై ఆందోళనకారులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మినీబైపాస్ రోడ్డులోని పూలే విగ్రహం వద్ద గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.
రాజీనామాలు చేయని సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాగేశారు. టీడీపీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్ నుంచి కనకమహల్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీ నేత రమేష్‌రెడ్డి నేతృత్వం వహించారు.
సూళ్లూరుపేటలో బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేట, తడతో పాటు అన్ని మండలాల్లో ఆందోళన కారులు సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
గూడూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుంచి టవర్‌క్లాక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలు కట్టుకుని టవర్‌క్లాక్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. రాణిపేటకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజులుగా విభజన వార్తలతో పెంచలయ్య ఆందోళన చెందుతున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కావలిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేసేందుకు ఆదివారం బీసీ భవన్‌లో ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార సంఘాలు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ను కార్యాచరణ కమిటీ కన్వీనర్‌గా ఎన్నుకున్నాయి. ఇకపై ఆందోళనలు ఉధృతం చేయాలని ఆందోళనకారులు తీర్మానించారు.
కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురం గ్రామస్తులు కాగలపాడు రోడ్డులో ఆదివారం గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
వెంకటగిరిలోని బంగారుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాతబస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.
ఉద్యమం ఉగ్రరూపం
Published Mon, Aug 5 2013 3:43 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement