సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమానికి ప్రతి పల్లె తాను సైతం అంటూ కదిలి వస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా ప్రజానీకం ఆందోళనలు ఉధృతం చేస్తోంది. తొలుత విద్యార్థులు, ఉద్యోగులతో ప్రారంభమైన సమైక్యాంధ్ర ఆందోళన ఇప్పుడు పల్లెలకు వ్యాపించింది. ప్రతిరోజూ గ్రామీణులు రోడ్లపైకి వస్తూ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. రోడ్లపై ఎద్దుల బండ్లు, రాళ్లు, కట్టెలు అడ్డం పెట్టి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు.
మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం రాష్ట్ర విభజనపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేస్తామని ప్రజలు శపథం చేస్తున్నారు. 50 ఏళ్లకు పైగా శ్రమించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటే, ఇవాళ ఆ నగరం మీది కాదంటూ కాంగ్రెస్ అధిష్టానం విభజనకు పాల్పడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ముఖ్యంగా సీమాంధ్ర కు అందులోనూ నెల్లూరు జిల్లా ఉద్యోగులు, విద్యార్థులకు నష్టం జరగడమే కాక అంతకు మించి సాగు,తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయన్న మాట యధార్థం. ఈ దిశగా మేధావులు,నేతల వాదనలను ఇక్కడి ప్రజలు ఆలకిస్తున్నారు.
భవిష్యత్తులో సీమాంధ్రకు జరగనున్న అన్యాయం కళ్లముందు కనిపిస్తుండడంతో ఇక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు ఆగ్రహావేశాలతో ఆందోళనలలో పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడితే కృష్ణా జలాల సమస్య తలెత్తుతుందని, తెలంగాణ నేతలు ఎట్టి పరిస్థితిలోనూ దిగువకు నీళ్లు వదలరని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
అప్పుడు గొడవ పడినా ప్రయోజనం ఉండదన్నది ప్రజల వాదన. ఇప్పుడు ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ,కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలను చూసేందుకు కూడా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలనే ఆయా రాష్ట్రాలు రానివ్వని విషయాన్ని సామాన్య జనం ఉదహరిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే చుక్కనీరు దిగువకు రానివ్వరని, దీంతో కేవలం వరదలు వస్తే తప్ప సోమశిలకు సరైన సమయంలో నీరు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆందోళన అందరిలోనూ ఉంది.
ఏడాదికేడాదికి వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ వర్షపాతం కూడా సరిగ్గా నమోదవుతున్న పరిస్థితులు లేవు. ఈ క్రమంలో వరదలు వస్తే తప్ప దిగువకు నీళ్లు రావన్న భయం ప్రజల్లో ఉంది. పర్యవసానంగా సోమశిల ఆధారంగా ఉన్న 8 లక్షలకు పైగా ఆయకట్టు బీళ్లగా మారే పరిస్థితి లేకపోలేదని డెల్టా రైతాంగం మరింత ఆందోళనతో ఉంది. ఇదే జరిగితే జిల్లాలోనే కాక ఇతర ప్రాంతాలకు సైతం తిండి గింజలు అందిస్తున్న నెల్లూరు జిల్లాలోనూ కరువు కాటకాలు తప్పవన్నది విశ్లేషకుల మాట. ఇక జిల్లాకు చెందిన వేలాది మంది విద్యావంతులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో వీరందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. ఇప్పటికే అక్కడి ఉద్యోగుల పరిస్థితి దినదినగండమైంది. రాష్ట్రం విడిపోతే భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. మొత్తంగా రాష్ట్ర విభజన అన్నివర్గాల వారి బతుకులను అతలాకుతలం చేయనుంది. అందరి భయం ఇదే. దీంతో ఇక్కడి ప్రజలు గ్రామస్థాయిలో వీధుల్లోకి వచ్చి ఆందోళన బాటపట్టారు. జిల్లాలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఉద్యమకారులకు అండగా నిలిచింది. దీంతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది.
టీడీపీ ఆలస్యంగా ఉద్యమానికి మద్దతు పలికింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకొని తొలుత ముఖం చాటేసిన ఇక్కడి కాంగ్రెస్ నేతలు మరింత ప్రజాగ్రహం చవిచూడక ముందే ఉద్యమంలోకి ఆలస్యంగా ప్రవేశించారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉద్యమాన్ని నిర్వహిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఉద్యమ కారులు,రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనను అడ్డకోకపోతే భావితరాలు క్షమించవని, సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ఉద్యమంలోకి రావాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు.
పల్లె కదిలింది
Published Thu, Aug 8 2013 3:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement