పరిపాలన రాజధానికి మద్దతుగా విశాఖలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు.
ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు.
గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్‌దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment