students JAC
-
కేయూలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. వీసీ ఛాంబర్లోకి దూసుకెళ్లడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టులోనే ఈ అంశంపై తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు చెప్తున్నారు. సభ అర్థాంతరంగా రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో.. భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ వన్ అభ్యర్థులు తరలివస్తుండగా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గేటు ముందు టైర్లు అంటించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనలతో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్ చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని, అదే సమయంలో జ్యూడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్ష ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. విద్యార్థి నిరుద్యోగ మార్చ్ పేరుతో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి విద్యార్థి సంఘాలు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్ గేట్లు మూసేశారు. అయినప్పటికీ దీక్షకు దిగేందుకు యత్నించారు విద్యార్థులు. దీంతో.. పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు యత్నించగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, పలువురి విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. -
రాయలసీమలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు : విద్యార్ధి జేఏసీ
-
అది పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు. గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్‌దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో పవన్‌కు నిరసన సెగ
కర్నూలు/కర్నూలు టౌన్: కర్నూలు పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. బుధవారం కర్నూలు పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు జేఏసీ నాయకులు కలెక్టరేట్ వద్ద నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు ర్యాలీగా వెళ్లారు. అయితే గాంధీ విగ్రహం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి సిగ్గులేకుండా పోలీస్ బలగాలతో బాలిక కేసును అడ్డుపెట్టుకుని కర్నూలుకు వచ్చారని మండిపడ్డారు. ఆయనకు అమరావతిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని దుయ్యబట్టారు. కాగా, జేఏసీ నేతలతో పాటు మరో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. మరోవైపు పవన్ సభలో ప్రసంగిస్తుండగా న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకొని వస్తుండగా పోలీసులు అడ్డుకుని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
మమ్మల్ని కాదు... పవన్‌ను అరెస్ట్ చేయండి
సాక్షి, కర్నూలు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బుధవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారంటూ పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు విద్యార్థి జేఏసీ యత్నించింది. పవన్ రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ...పవన్ గోబ్యాక్ అంటూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ‘మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు... పవన్‌ను అరెస్ట్ చేయాలి’ అంటూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. (అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..) -
అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..
సాక్షి, కర్నూలు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనను విద్యార్థి, న్యాయవాదుల జేఏసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వికేంద్రీకరణకు పవన్ మద్దతు తెలిపిన తరువాతే రాయలసీమలో అడుగు పెట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని విద్యార్ధి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాగా నేటి నుంచి రెండు రోజులు పవన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి, కోట్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ ప్రసంగించనున్నారు. -
సమ్మెకు సకలజనుల మద్దతు
సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రోజురోజుకు సబ్బండ వర్ణాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించగా, తాజాగా ఉద్యోగ జేఏసీ నాయకులు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాటలతో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. వంటావార్పు, ర్యాలీలు, మానవహారం, సీఎం దిష్టిబొమ్మ దహనం, తదితర కార్యక్రమాలతో జోరు పెంచారు. ఈ నెల 5న ప్రారంభమైన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలుచేపడుతూ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. మోటార్‌సైకిల్ ర్యాలీలు కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదిలాబాద్ పట్టణంలోని పలు వీధుల గుండా మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం సుందరయ్య భవన్లో కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు ఒకటేనన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2600 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉందన్నారు. డీజిల్‌పై పన్ను విధించడంతో ఆర్టీసీపై భారం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి రూ.50వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. సమ్మె చేపడుతున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరిట 48వేల మంది ఉద్యోగులను తొలగించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. యూనియన్లు వద్దంటే పార్టీలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతుందని భావించి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్‌కుమార్, మహేందర్, రాష్ట్ర కార్యదర్శి తిరుమల్‌రెడ్డి, గోపి, మోహన్, సుధాకర్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, అశోక్‌గౌడ్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సబ్దార్అలీ, వాసిఖ్, అటవీ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, వార్డెన్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చందర్‌గౌడ్, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవీంద్ర, వృకోధర్, వెంకట్, శ్రీనివాస్, నరేందర్, గిరి, తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం.. సమ్మెలో భాగంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణంలోని తెలంగాణచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటావార్పు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా సుందరయ్యభవన్ ఎదుట వంటావార్పు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాల కోరని విమర్శించారు. కార్మికులు చనిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. నాయకులు సంజీవ్‌రెడ్డి, యాసం నర్సింగ్, అంబకంటి అశోక్, రూపేశ్‌రెడ్డి, జైపాల్, పొచ్చన్న, సులోచన, సరిత తదితరులు పాల్గొన్నారు. గ్రామీణులకు ఇక్కట్లు మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో 63 ఆర్టీసీ బస్సులు, 33 ప్రైవేట్ అద్దె బస్సులు, 15 సీసీ బస్సులు, 52 మ్యాక్సీ క్యాబ్‌లు, మొత్తం 173 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
కడప విద్యార్థి జెఏసీ కలెక్టరేట్ ముట్టడిలో అపశృతి
-
పెల్లుబికిన నిరసనలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు ప్రతులను రాష్ట్ర విద్యార్థి జేఏసీ నేతలు దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ముక్తకంఠంతో నినదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం స్థానిక రంగారాయుడు చెరువు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి జయరాం సెంటర్, కోర్టు భవనాల మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఏ ఉదయ్‌కుమార్, యువజన జేఏసీ కన్వీనర్ కన్నా వరప్రసాద్, నాయకులు సాయి, విష్ణు, జాషువా, తదితరులు పాల్గొన్నారు. చీరాలలో.. చీరాల అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కుట్రను తిప్పికొట్టాలని సమైక్యాంధ్ర జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావడాన్ని నిరసిస్తూ జెఏసీ నాయకులు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక విజ్ఞానభారతి జూనియర్ కళాశాల నుంచి మార్కెట్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు అక్కడ మానవహారం ఏర్పాటు చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జెఏసీ నాయకులు గుంటూరు మాధవరావు, కర్నేటి రవికుమార్, సయ్యద్ బాబు, ఊటుకూరి రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎం కిరణ్ వైఫల్యంతో విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిందని విమర్శించారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరన్నారు. సీమాంధ్ర ద్రోహి స్పీకర్ ‘నాదెండ్ల’ చీరాల వీఆర్‌ఎస్‌వైఆర్‌ఎన్ కళాశాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల జెఏసీ అధ్యక్షుడు కే ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ ఎం మోషే, ఉపాధ్యక్షుడు ఏ జయరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు. -
ఉద్యమ కెరటం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సముద్ర కెరటంలా ఎగిసిపడుతోంది. రాష్ట్ర విభజనకు నిరసనగా 74వ రోజూ ఉద్యమ హోరు కొనసాగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరులోని ఎన్జీఓ భవన్లో వైద్య విధాన ప రిషత్ ఉద్యోగులు రిలేదీక్ష చేయగా, రా మలింగాపురం కూడలిలో విద్యార్థి జేఏ సీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్జీఓ హోమ్ వరకు ర్యాలీ చేశారు. ఉదయగిరి, వింజమూరులో జేఏసీల ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. విం జమూరులోని దీక్షా శిబిరంలో సాతానువారిపాళెంనకు చెందిన యువకులు కూర్చున్నారు. ఉదయగిరిలోని శిబిరం లో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు దీక్ష చేపట్టారు. బెలూన్లతో నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు బస్టాండ్ సెంటర్లో జరిగిన రిలే దీక్షలో సీతారామపురం మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సో నియా గాంధీ, దిగ్విజయ్, షిండే దిష్టిబొమ్మలకు గూడూరులోని టవర్‌క్లాక్ ప్రాంతంలో జేఏసీ నాయకులు సమాధులు కట్టారు. వైఎస్సార్సీపీ గూ డూరు నియోజకవర్గ సమస్యకర్త పాశం సునీల్‌కుమార్ సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోటుపాళెం కూడలి ప్రాంతంలో రాస్తారోకో జరిగింది. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండు ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీధర్ అనే యువకుడు గుండు కొట్టించుకుని నిరసన తెలిపాడు. కావలిలో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ మండలాల్లోనూ రిలేదీక్షలు జరిగాయి. తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరైనా సంతకాలు పెట్టకుండానే పనిచేస్తామని ఎన్జీఓలు తెలిపారు. -
నేడు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిశ్శబ్ద విప్లవం
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ చేపడుతున్న సమైక్య ఆందోళనల్లో భాగంగా బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాజ్‌విహార్ సెంటర్లో నిశ్శబ్ద విప్లవం పేరుతో మౌన వ్రతం పాటిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు భానుచరణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇర్షాద్, కార్యదర్శి ఈడిగ బుద్ధిరాజ్ గౌడ్, కోశాధికారి జె.విజయుడు సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో పర్యావరణానికి నష్టం కలగకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మౌన వ్రతం చేపడుతున్నామన్నారు. రోడ్లపైన టైర్లు కాల్చడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు. -
బరబరా లాగి.. ఈడ్చుకెళ్లి...
వైవీయూ, న్యూస్‌లైన్ : తెలంగాణ నోట్ ఆమోదంపై యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ) విద్యార్థి జేఏసీ ఉడికిపోయింది. ఊహించని ఈ పరిణామంతో విద్యార్థులు మూకుమ్మడిగా తరలివచ్చి కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(ఇందిర భవన్) ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విద్యార్థులు తరలివచ్చారు. అయితే వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీంతో విద్యార్థులు సహనం కోల్పోయి ఇందిరభవన్‌పై రాళ్ల వర్షం కురిపించారు. ఇక అంతే. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అడ్డొచ్చిన వారిని గొడ్డులను బాదినట్లు బాదారు. అయినా విద్యార్థి జేఏసీ నాయకులు తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటూ ఇందిరాభవన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైవీయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ బి.అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ 65 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అడ్డుకోవాలని చూడటం పోలీసులకు తగదన్నారు. అంతలోనే అక్కడికి చేరుకున్న కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ఏమాత్రం లోచించకుండా విద్యార్థులను ఈడ్చుకెళ్లే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఇందిరా భవన్‌లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. ఒకానొక దశలో తీవ్ర స్థాయిలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విచక్షణా రహితంగా విద్యార్థులతో విరుచుకుపడ్డారు. విద్యార్థులను కొట్టుకుంటూ, ఈడ్చుకెళ్లారు. డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ‘గుద్దుతా నా కొడకల్లారా..’ అంటూ విద్యార్థులను బండ బూతులు తిడుతూ దొరికిన వాడిని దొరికినట్లు పట్టుకుని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. వారికి మద్దతుగా వచ్చిన ఆర్టీసీ ఎన్ఎంయూ నేత శివారెడ్డిని సైతం పోలీసులు ఈడ్చుకువెళ్లే యత్నం చేశారు. ఎన్జీఓ అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి జోక్యంతో ఆయన్ను విడిచిపెట్టారు. అయితే వైవీయూ విద్యార్థి జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు కడప స్టేషన్‌కు తరలించడకుండా వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరిశోధక విద్యార్థులపై ఇష్టానుసారం లాఠీచార్జి చేయడం తగదంటూ ఆందోళనకు దిగారు. మరో నలుగురు విద్యార్థులను రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
సమైక్య కేక
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 63వ రోజు మంగళవారం ఉధృతంగా సాగింది. అలుపెరగక సింహపురివాసులు పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సూళ్లూరుపేటలో మంగళవారం పులికాట్ పొలికేక పేరుతో భారీసభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌పై బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తం గా పార్టీ శ్రేణులు నిరాహారదీక్షలకు దిగనున్నారు. వైఎస్సార్సీపీ మాదిరిగా మిగిలిన పార్టీలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, విద్యార్థి, జేఏసీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరిలో జే ఏసీ నేతలు కేసీఆర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలోని వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రోడ్డుపై ఆటాపాట నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి నిరసనను వ్యక్తం చేశారు. గూడూరులో టవర్‌క్లాక్ సెం టర్లో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50 రోజులకు చేరుకున్న సందర్భంగా జేఏసీ, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ నేతలు తోలు బొమ్మలాటతో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హోటల్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్‌పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై పార్టీ కార్యకర్తలతో మండల కన్వీనర్లు సమీక్షించారు. పొదలకూరులో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ప్రదర్శన జరిపారు. రిలే నిరాహారదీక్షలు చేశారు. రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞాలు నిర్వహించారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం బైపాస్‌రోడ్డులో మూడు పంచాయతీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తహశీల్దార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. మానవహారం నిర్మించారు. నడిరోడ్డుపై ఉపాధ్యాయులు కబడ్డీ, ఖోఖో ఆడారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆద్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. సూళ్లూరుపేట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ గర్జనను వినిపించేందుకు వేలాది మందితో పులికాట్ పొలికేకను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఓ స్కూల్లో పనిచేస్తున్న బెల్జియం దేశస్తులు ఆందోళనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు గుండు గీయించుకొని నిరసన తెలిపారు. వరికుంటపాడులో సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో స్థానిక యువకులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఫొటో, వీడియోగ్రాఫర్లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఆదర్శరైతుల దీక్షకు వ్యవసాయ శాఖ జేడీ సుబ్బారావు సంఘీభావం తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం టపాతోపు జాతీయరహదారిని దిగ్బంధించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజుపాళెం నుంచి భారీ ర్యాలీ, జాతీయ రహదారిపైనే వంటావార్పు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. -
అదే హోరు
సాక్షి, నెల్లూరు : సింహపురివాసులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం 62వ రోజైన సోమవారం హోరెత్తింది. నగరంలో విద్యార్థి జేఏసీ, ఉద్యోగ జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్లు నిరసన దీక్షలు కొనసాగించాయి. ఎన్జీఓ, విద్యార్థి జేఏసీ నేతలు నగరంలోని స్వర్ణాల చెరువులో సమైక్యాంధ్ర రొట్టెలు అందజేశారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జలదంకిలో జనగర్జన జరి గింది. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, మానవహారాలు నిర్వహించారు. వేదాయపాళెం సెంటర్లో ముది రాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మండు టెండలో చిన్నారులు ముగ్గులేసి నిరసన తెలిపారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఆటలు ఆడి నిరసస వ్యక్తం చేశారు. మనుబోలులో సోమవారం ముస్లిం లు భారీ ప్రదర్శన నిర్వహించి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పొదలకూరులో వీఆర్వోలు, తలారులు రిలే నిరాహారదీక్షలు చేశారు. ముత్తుకూరులో బీసీ సంక్షేమ సంఘం రెండోరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిలో సోమవారం జనగర్జన జరిగింది. కావలి ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వెయ్యి మీటర్ల జాతీయజెండా ప్రదర్శించారు. కలిగిరిలో మాంసం విక్రయదారులు రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. కొండాపురం సాయిపేటలో వంటావార్పు, ర్యాలీ జరిగాయి. దుత్తలూరులో ఆటో యజమానుల ఆధ్వర్యంలో బంద్ పాటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కావలి నుంచి శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. కావలి నుంచి రుద్రకోట జాతీయ రహదారి మీదుగా ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో కావలి నుంచి ముసునూరు వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. వెంకటగిరిలో కాశీపేట సెంటర్లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో వీధులను శుభ్రపరిచారు.అనంతరం అక్కడే స్నానాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సైదాపురంలో యూత్,ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న పోరును సాగించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, శివాజీ వేషధారులు ఆకట్టుకున్నారు. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు నుంచి ప్రజలు పలు వాహనాల్లో గూడూరుకు తరలి వచ్చారు. టవర్‌క్లాక్ కూడలి ప్రాంతం వద్ద వినూత్న రీతిలో మగ్గం నేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే మహిశాశురమర్ధిని తదితర వేషధారణలో పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు. కోవూరు ఎన్జీఓ హోంలో యువకుల దీక్ష చేపట్టారు. లేగుంటపాడులో మహిళల దీక్షలో కూర్చున్నారు. కొడవలూరు నార్తురాజుపాళెంలో ఉపాధ్యాయ జేఏసీ నాయకుల దీక్ష కొనసాగుతోంది. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవ సంఘాల సమాక్య రిలే నిరాహార దీక్షలో పాల్గొంది. పట్టణంలో మానవహారంగా ఏర్పడి కేసీఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి దహనం చేశారు. ఎన్జీఓలు, జేఏసీ నేతలు వారికి సంఘీభావం తెలిపారు. -
ముదురుతున్న వివాదం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా విద్యా శాఖ అధికారి గాజర్ల రమేశ్ వ్యవహార సరళిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనపై వచ్చిన విమర్శలకు డీఈఓ సమాధానమిచ్చినా ఉపాధ్యాయ సంఘాల నేతలు శాంతించడం లేదు. దీంతో డీఈఓకు ఉపాధ్యాయల సంఘాల నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఆయన తీరు మారకపోతే ఈనెల 20న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇదిలావుంటే ఉపాధ్యాయ సంఘాల నేతల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకున్నానని డీఈఓ స్పష్టం చేస్తున్నారు. తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాల నేతలైనా సరే చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేయలేదని చెబుతున్నారు. ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆకస్మికంగా వాయిదా వేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలపై డీఈఓపై కస్సుబుస్సుమంటున్నారు. కౌన్సెలింగ్ వాయిదాకు గల కారణాలను తాను తెలిపినా అర్థం చేసుకోకుండా ఆందోళనలు చేస్తే నష్టపోయే ఉపాధ్యాయులేనని డీఈఓ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో అన్యాయం జరుగుతుందని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలపడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సి వస్తుందని, ఇందులో తన స్వార్థం లేదని, దీన్ని సాకుగా చేసుకొని సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలను డీఈఓ ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులపై ఎంఈఓ విచారణ అనంతరం డిప్యూటీ ఈఓలతో విచారణ జరిపించాకే చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరిస్తున్నారు. అకారణంగా సస్పెండ్ అయినట్టు ఏ ఒక్కరైనా నిర్ధారిస్తే అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని డీఈఓ నేరుగా కలెక్టర్‌తో అన్నట్టు తెలిసింది. కలెక్టర్‌కు ఉపాధ్యాయ సంఘాల వినతి.. మరో వైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 20న నిరవధిక సెలవులు పెట్టడంతోపాటు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అందులో హెచ్చరించారు. దీంతో కలెక్టర్ ఉపాధ్యాయుల సమస్యలపై డీఈఓతో చర్చించగా పదోన్నతులు మినహా మిగతా 12 డిమాండ్లు తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఆ డిమాండ్లు నెరవేర్చడం తన పరిధిలోనూ లేదంటూ కలెక్టర్ సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది. ఉపాధ్యాయులకు పోటీగా.. ఉపాధ్యాయ సంఘాల తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగితే తాము సైతం పోటీ ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈనెల 20న ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తే అదే రోజు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓల కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సురేశ్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పాఠశాలకు డుమ్మాలు కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని వారంటున్నారు. ఈ రకంగా వారు డీఈఓకు బాసటగా నిలవాలని భావిస్తున్నారు. 20న చలో సంగారెడ్డి... మెదక్ టౌన్: డీఈఓ రమేశ్ వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 20న చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సమితి జిల్లా కన్వీనర్ సడిమెల యాదగిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఐక్య ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు, కించపర్చే విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చిన్న చిన్న పొరపాట్లకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీ ర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్రలేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మల్లారెడ్డి, హీరాలాల్, సంగయ్య, సదన్, విరాట్ స్వరూప్, మహేశ్ కుమార్, ప్రవీణ్, అశోక్, దేవయ్య, సిద్ధిరాములు, తుకారం, వెంకటేశం తదితరులు ఉన్నారు. -
సమైక్యహారం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు శనివారం కదం తొక్కారు. రోజురోజుకూ వారి ఉద్యమం తీవ్రమవుతోంది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం 32వ రోజు ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు ర్యాలీలు, నిరసన దీక్షలు కొనసాగించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడి ఇంటిని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖాధికారులు రిలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మంత్రి ఆనం నివాసం ముట్టడిలో ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేసినందుకు నిరసనగా నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టులో బంద్ పాటించారు. ఉద్యోగులు ధర్నా చేసి, వంటావార్పు నిర్వహించారు. పొదలకూరు మండలంలోని రేషన్‌షాపు డీలర్లు ప్రదర్శన జరిపారు. మనుబోలు ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో జరిపి, మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీపీగూడూరు మండలం నరుకూరు సెంటర్లో సమైక్యవాదులు రాస్తారోకో జరిపారు. గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఆదర్శరైతులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. పాస్టర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే ప్రార్థన జరిపారు. విద్యార్థులు రోడ్లపైనే చెస్, క్యారం ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 6వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగించారు. కోవూరు ఎన్జీఓ హోంలో మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం నుంచి పల్లిపాళెం వరకు జేఏసీ నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండు వద్ద అనంతసాగరం మండలానికి చెందిన గ్రామ సేవకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు నెల్లూరుపాళెం- ఆత్మకూరు రహదారిపై, ఆర్టీసీ డిపో ఎదుట పొట్టి శ్రీరాములు మాస్కులు ధరించి రాస్తారోకో నిర్వహించారు. చైతన్యపాఠశాల విద్యార్థులు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో తెలుగుతల్లి అవతారంలో వినూత్న నిరసన తెలిపారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని కళాశాల ప్రాంగణం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో,మెరిట్స్కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర, భరతమాత చిత్రాల వద్ద విద్యార్థులు, ఉద్యమకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వింజమూరులో 26వ రోజు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. కావలి ఆర్డీవో కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కాంగ్రెస్ నేత గ్రంధి యానాదిశెట్టి ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేతికి నల్లరిబ్బన్లతో సంకెళ్లులాగా వేసుకొని మోకాళ్లపై ట్రంకురోడ్డుపై నడిచి నిరసనను తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు, భీమసేనుడి వేషధారణలో ర్యాలీ కొనసాగించారు. జెడ్పీ బాలుర పాఠశాల తలుపులకు సమైక్యవాదులు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు లోపలికి వెళ్లలేకపోయారు. పోలీసులు కలుగజేసుకొని ఉపాధ్యాయులను పాఠశాలలోకి పంపారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 18 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. నాయుడుపేటలో ప్రయివేట్ స్కూల్ విద్యార్థులంతా భారీ ప్రదర్శన నిర్వహించి పాతబస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. -
విజయవాడలో లక్షగళ ఘోష
-
రాజమండ్రిలో 48 గంటల బంద్
హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులపై దాడిని రాజమండ్రిలోని విద్యార్థి ఐకాస తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా బుధవారం నుంచి రెండు రోజులపాటు రాజమండ్రి నగరంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. దాంతో బుధవారం రాజమండ్రి నగరంలో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా సంస్థలను యాజమాన్యం స్వచ్ఛందంగా ముసివేశాయి. వ్యాపార సంస్థలు కూడ మూసివేశారు. అలాగే బంద్ సంపూర్ణంగా కొనసాగించేందుకు విద్యార్థి ఐకాస ఇప్పటికే నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఐకాసల మద్దతును కూడగట్టింది. దీంతో రాజమండ్రిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. -
ఉద్యమం ఉగ్రరూపం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థి జేఏసీ, ఎన్జీఓలు ఉమ్మడిగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో చేపట్టిన ఉద్యమం ఐదో రోజూ ఉధృతంగా సాగింది. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్, సిటీ సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం హైవేపై రాస్తోరోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరులో జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గూడూరు రాణిపేటకు చెందిన పెంచలయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఎన్జీఓ నేతలు నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నెల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద హైవేపై ఆందోళనకారులు ఒకటిన్నర గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. హైవేపై ఆందోళనకారులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మినీబైపాస్ రోడ్డులోని పూలే విగ్రహం వద్ద గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. రాజీనామాలు చేయని సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాగేశారు. టీడీపీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి కనకమహల్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీ నేత రమేష్‌రెడ్డి నేతృత్వం వహించారు. సూళ్లూరుపేటలో బస్టాండ్ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేట, తడతో పాటు అన్ని మండలాల్లో ఆందోళన కారులు సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుంచి టవర్‌క్లాక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలు కట్టుకుని టవర్‌క్లాక్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. రాణిపేటకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజులుగా విభజన వార్తలతో పెంచలయ్య ఆందోళన చెందుతున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కావలిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేసేందుకు ఆదివారం బీసీ భవన్లో ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార సంఘాలు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. వైఎస్సార్సీపీ నేత ప్రసాద్‌ను కార్యాచరణ కమిటీ కన్వీనర్‌గా ఎన్నుకున్నాయి. ఇకపై ఆందోళనలు ఉధృతం చేయాలని ఆందోళనకారులు తీర్మానించారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురం గ్రామస్తులు కాగలపాడు రోడ్డులో ఆదివారం గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వెంకటగిరిలోని బంగారుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాతబస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.