సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:
జిల్లా విద్యా శాఖ అధికారి గాజర్ల రమేశ్ వ్యవహార సరళిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనపై వచ్చిన విమర్శలకు డీఈఓ సమాధానమిచ్చినా ఉపాధ్యాయ సంఘాల నేతలు శాంతించడం లేదు. దీంతో డీఈఓకు ఉపాధ్యాయల సంఘాల నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఆయన తీరు మారకపోతే ఈనెల 20న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇదిలావుంటే ఉపాధ్యాయ సంఘాల నేతల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకున్నానని డీఈఓ స్పష్టం చేస్తున్నారు. తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాల నేతలైనా సరే చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేయలేదని చెబుతున్నారు.
ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆకస్మికంగా వాయిదా వేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలపై డీఈఓపై కస్సుబుస్సుమంటున్నారు. కౌన్సెలింగ్ వాయిదాకు గల కారణాలను తాను తెలిపినా అర్థం చేసుకోకుండా ఆందోళనలు చేస్తే నష్టపోయే ఉపాధ్యాయులేనని డీఈఓ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో అన్యాయం జరుగుతుందని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలపడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సి వస్తుందని, ఇందులో తన స్వార్థం లేదని, దీన్ని సాకుగా చేసుకొని సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలను డీఈఓ ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులపై ఎంఈఓ విచారణ అనంతరం డిప్యూటీ ఈఓలతో విచారణ జరిపించాకే చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరిస్తున్నారు. అకారణంగా సస్పెండ్ అయినట్టు ఏ ఒక్కరైనా నిర్ధారిస్తే అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని డీఈఓ నేరుగా కలెక్టర్‌తో అన్నట్టు తెలిసింది.
కలెక్టర్‌కు ఉపాధ్యాయ సంఘాల వినతి..
మరో వైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 20న నిరవధిక సెలవులు పెట్టడంతోపాటు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అందులో హెచ్చరించారు. దీంతో కలెక్టర్ ఉపాధ్యాయుల సమస్యలపై డీఈఓతో చర్చించగా పదోన్నతులు మినహా మిగతా 12 డిమాండ్లు తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఆ డిమాండ్లు నెరవేర్చడం తన పరిధిలోనూ లేదంటూ కలెక్టర్ సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది.
ఉపాధ్యాయులకు పోటీగా..
ఉపాధ్యాయ సంఘాల తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగితే తాము సైతం పోటీ ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈనెల 20న ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తే అదే రోజు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓల కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సురేశ్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పాఠశాలకు డుమ్మాలు కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని వారంటున్నారు. ఈ రకంగా వారు డీఈఓకు బాసటగా నిలవాలని భావిస్తున్నారు.
20న చలో సంగారెడ్డి...
మెదక్ టౌన్: డీఈఓ రమేశ్ వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 20న చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సమితి జిల్లా కన్వీనర్ సడిమెల యాదగిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్‌లో ఐక్య ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు, కించపర్చే విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చిన్న చిన్న పొరపాట్లకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీ ర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్రలేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మల్లారెడ్డి, హీరాలాల్, సంగయ్య, సదన్, విరాట్ స్వరూప్, మహేశ్ కుమార్, ప్రవీణ్, అశోక్, దేవయ్య, సిద్ధిరాములు, తుకారం, వెంకటేశం తదితరులు ఉన్నారు.
ముదురుతున్న వివాదం
Published Sun, Sep 15 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement