సమైక్యహారం | protest the partition of the state | Sakshi
Sakshi News home page

సమైక్యహారం

Published Sun, Sep 1 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

protest the partition of the state

సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు శనివారం కదం తొక్కారు. రోజురోజుకూ వారి ఉద్యమం తీవ్రమవుతోంది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం 32వ రోజు ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు ర్యాలీలు, నిరసన దీక్షలు కొనసాగించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడి ఇంటిని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు.
 
 నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు  కలెక్టరేట్ నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖాధికారులు రిలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు.  మంత్రి ఆనం నివాసం ముట్టడిలో ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేసినందుకు నిరసనగా  నేలటూరులోని ఏపీ జెన్‌కో ప్రాజెక్టులో బంద్ పాటించారు. ఉద్యోగులు ధర్నా చేసి, వంటావార్పు నిర్వహించారు.
 
  పొదలకూరు మండలంలోని రేషన్‌షాపు డీలర్లు  ప్రదర్శన జరిపారు. మనుబోలు ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు  రాస్తారోకో జరిపి, మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీపీగూడూరు మండలం నరుకూరు సెంటర్‌లో  సమైక్యవాదులు రాస్తారోకో జరిపారు.
  గూడూరులో  వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఆదర్శరైతులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. పాస్టర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే ప్రార్థన జరిపారు. విద్యార్థులు రోడ్లపైనే చెస్, క్యారం ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 6వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగించారు.   
 
  కోవూరు  ఎన్జీఓ హోంలో మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం నుంచి పల్లిపాళెం వరకు జేఏసీ నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు.  వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
  ఆత్మకూరు మున్సిపల్ బస్టాండు వద్ద అనంతసాగరం మండలానికి చెందిన గ్రామ సేవకులు  రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు నెల్లూరుపాళెం- ఆత్మకూరు రహదారిపై, ఆర్టీసీ డిపో ఎదుట పొట్టి శ్రీరాములు మాస్కులు ధరించి రాస్తారోకో నిర్వహించారు. చైతన్యపాఠశాల విద్యార్థులు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో తెలుగుతల్లి అవతారంలో వినూత్న నిరసన తెలిపారు.
 
  ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో    విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని కళాశాల ప్రాంగణం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో,మెరిట్స్‌కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర, భరతమాత చిత్రాల వద్ద విద్యార్థులు, ఉద్యమకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వింజమూరులో 26వ రోజు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు.
 
  కావలి ఆర్డీవో కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో  కాంగ్రెస్  నేత గ్రంధి యానాదిశెట్టి  ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేతికి నల్లరిబ్బన్లతో సంకెళ్లులాగా వేసుకొని మోకాళ్లపై ట్రంకురోడ్డుపై నడిచి నిరసనను తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యాన  పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు, భీమసేనుడి వేషధారణలో ర్యాలీ కొనసాగించారు. జెడ్పీ బాలుర పాఠశాల తలుపులకు సమైక్యవాదులు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు లోపలికి వెళ్లలేకపోయారు. పోలీసులు కలుగజేసుకొని   ఉపాధ్యాయులను పాఠశాలలోకి పంపారు.  
 
  సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో  18 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. నాయుడుపేటలో ప్రయివేట్ స్కూల్ విద్యార్థులంతా భారీ ప్రదర్శన నిర్వహించి పాతబస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement