samai kyandhara
-
కావూరి చూపు.. టీడీపీ వైపు
ఏలూరు, న్యూస్‌లైన్: మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయూనికి వచ్చిన ఆయన ఆది వారం వట్లూరు సమీపంలోని సీతారామ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నా యకులతో బయటపెట్టించారు. ఇదే సం దర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపిం చారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ ేయూలని సూచించారు. చివరకు ఎక్కు వ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు పేర్కొన్నారు. ఇంట్లో సమాలోచనలు.. సభలో హైడ్రామా అభిప్రాయ సేకరణకు ముందే కావూరి ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో అనుయూయులతో మంతనాలు సాగించారు. సభలో ఎవరు, ఏం మాట్లాడాలనే విషయమై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణరుుంచిన ప్రకారం వేదికపైకి సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడిం చారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ట్రస్టు ద్వారా లబ్ధి పొం దినవారే ఊకదంపుడు ప్రసంగాలు చేయ టం విమర్శలకు తావిచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, చావా రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గారపాటి రామసీత, తూతా లక్ష్మణరావు, ముసునూరి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన కోసం కావూరి పనిచేశారని, ఆయన ఏ పార్టీవైపు నడిస్తే అటువైపు సాగుతామని కొందరు, ఏ పార్టీలో చేరినా మీ వెంట సాగుతామని ఇంకొందరు పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కావూరి కాంగ్రెస్ పెద్దల అసమర్ధత కారణంగానే రాష్ట్రం విడిపోయిం దన్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పద వి ఇచ్చే విషయమై రాజీవ్‌గాంధీ నిర్ణయానికి కొందరు అడ్డుపడ్డారని ఆవేదన వ్య క్తం చేశారు. 2004లో మంత్రి పదవి రాలేదని బాధపడ్డానని, 2009లో మనోవేదనకు గురయ్యానని చెప్పారు. పార్టీ సిద్ధాం తాలకు అనుగుణంగా పనిచేసినా గౌరవం దక్కలేదని వాపోయూరు. త్వరలో అందరికీ సంతృప్తినిచ్చే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో మాగం టి వీరేంద్రప్రసాద్ (బబ్బు), కలిపిండి అప్పారావు, పెరికే వరప్రసాదరావు, కొత్త సాంబశివరావు, బొమ్మి ప్రభాకర్, సైదు సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పులి శ్రీరాములు, కారే బాబూరావు, కత్తి రాములు పాల్గొన్నారు. మాగంటి అనుచరుల ఆరా ఇదిలావుండగా, టీడీపీలోకి కావూరి రాకను వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అనుచరులు ఈ సభపై కన్నేసి ఉంచారు. సమావేశంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారనే విషయూలపై ఆరా తీశారు. -
సమైక్యతాశక్తి జగన్
=సమైక్యాంధ్ర బహిరంగ సభలో కొణతాల =వైఎస్ లేకనే ఆంధ్రకు ఈ అన్యాయం =జగన్‌కు భయపడి కేంద్రం విభజన కుట్ర =జననేతకు అండగా నిలవాలని పిలుపు అరకు/అరకు రూరల్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక వ్యక్తి, శక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. ఇక్కడి గిరిజన మ్యూజియం ముఖద్వారం ఎదురుగా అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొరల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. సభలో కొణతాల మాట్లాడుతూ, మహానేత వైఎస్ అనంతర పరిస్థితులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని చెప్పారు. ఆయన లేకపోవడంతోనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభంజనానికి భయపడే విభజనకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటుకు వైఎస్ సుముఖత వ్యక్తం చేసి 300 మందికి ఉద్యోగాలు ఇప్పించారని చెప్పారు. జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. కాఫీ సాగు చేస్తున్న గిరిరైతులు బాగుపడడంలేదు కానీ దాని వల్ల కేంద్ర మంత్రి జైరాం రమేష్ లబ్ధిపొందుతున్నారని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విశాఖ రాజధాని చేయాలని చెబుతున్నారని, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే వైఎస్సార్ విధానాలు అమలవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఉంటే, ఏపీలో మాత్రం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పారు. పెందుర్తి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు. అంతకు ముందు ఎన్టీఆర్ గ్రౌండ్నుండి భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హుకుంపేట మండలం శోభకోట సర్పంచ్ ప్రధాని కనకాలతో పాటు నలుగురు వార్డు సభ్యులు పార్టీలో చేరారు. కొణతాల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకుడు పీవీజీ కుమార్, యువజన విభాగం కన్వీనర్అదీప్రాజు, ఆరు మండలాల నుంచి పలువురు సర్పంచ్‌లు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. -
నేటి నుంచి 8 గంటల విద్యుత్ కోత!
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగులు, సిబ్బంది సమ్మె ఫలితంగా ఎన్టీటీపీఎస్లో 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాయలసీమ థర్మల్ పవర్, సీలేరు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి స్తంభిం చింది. విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. సబ్స్టేషన్లకు వస్తున్న విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విద్యుత్ కోత వేళలు ఇవీ... జిల్లా వ్యాప్తంగా మంగళవారం 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధించాలని విద్యుత్ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని గ్రామాలు, పట్టణాలతోపాటు విజయవాడలోనూ కోత అమలులో ఉంటుంది. ఈ కోతలను నిరవధిక సమ్మె ఆపే వరకు కొనసాగిం చాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. విజయవాడలో సోమవారం ఆరు గంటల కోత విధించడంతో రిజర్వాయర్లకు నీరు అందక మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ జి.పండాదాస్ దృష్టికి విద్యుత్ కోతలు తొలగేవరకూ సాయంత్రం నీటి సరఫరా నిలిపివేయాలని అధికాలను ఆదేశించారు. విద్యుత్‌కోతల వల్ల నగరంలోని చిన్న ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడంలేదని తెలిసింది. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు జనరేటర్ల సంఖ్యను పెంచుకున్నారు. కోతల కారణంగా ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడిందని వైద్యులు తెలిపారు. వేసవిలో విద్యుత్ కోతలతో తీవ్ర నష్టాలను చవిచూసిన పరిశ్రమలు తిరిగి సంక్షోభంలోకి చేరుతున్నాయి. ఆటోనగర్‌లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉండదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 5 వేల పరిశ్రమలు పడే అవకాశం ఉంది. 65 రోజులుగా బంద్‌లతో అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారాలపైనా విద్యుత్‌కోతల ప్రభావం పడనుంది. కోతలు కారణంగా ఏటీఎంలు, బ్యాంకులు సరిగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అనేక ఏటీఎంల వద్ద ‘అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ తగి నంత అందుబాటులో లేకపోవడంతో డీజిల్ ఇంజిన్లతో రైళ్లను నడుపుతున్నారు. దీంతో మూడు నాలుగు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రశాంతి, రత్నాచల్, తిరుపతి తదితర రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం కూడా అనేక రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. దుర్గగుడి, ప్రభుత్వాస్పత్రికి విద్యుత్ కోతల నుంచి మినహాయింపు దసరా ఉత్సవాలు జరుగుతున్నందున దుర్గగుడికి, అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రి, హెడ్‌వాటర్ వర్క్స్, మిల్క్‌ప్రాజెక్టు తదితర సంస్థలకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో విద్యుత్‌శాఖలో 2000 మంది కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. వీరంతా సబ్స్టేషన్లు వద్ద ఆపరేటర్లుగా, కంప్యూటర్ విభాగం, సాఫ్ట్ బిల్లింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వీరు కూడా సమ్మె బాట పట్టడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో చీకట్లు
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ప్రభావం తీవ్ర రూపం దాల్చబోతోంది. ఫలితంగా అటు పరిశ్రమకు, ఇటు గృహ, వాణిజ్యావసరాలకు కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసే పరిస్థితి లేదు. ఆరు నూరైనా సమ్మె విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఉద్యోగులు తేల్చి చెప్పడంతో అధికార యంత్రాంగం దేవుడి మీదే భారం వేసింది. ఉద్యమం వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో దూర ప్రయాణాల కోసం రైళ్లను నమ్ముకున్న జనానికి అవి ఎక్కడికక్కడ ఆగిపోవడం, అనేకం రద్దు కావడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్ అధికారులు తమ పరిధిలోని జిల్లాల్లో అనధికారిక విద్యుత్ కోతలకు తెర లేపారు. విశాఖ స్టీల్ ప్లాంటుకూ సమైక్య సెగ తగలనుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు. కరెంటు లోటు ఈపీడీసీఎల్ పరిధిలో రోజుకు 1500 నుంచి 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పుడు రోజుకు 1215 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. బంద్ కారణంగా డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ ఆదివారం నుంచి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అనధికారిక కోతలకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 4 గంటలు, పట్టణ ప్రాంతాల్లో సైతం గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె తీవ్ర రూపం దాల్చి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే ఈ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 5వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో 7,500 మంది సమ్మెలోకి వెళ్లనుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉక్కుకు సమ్మె ముప్పు విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నప్పటికి ట్రాన్స్‌కో నుంచి రోజుకు 50 నుంచి 60 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. దీనికి తోడు ఆదివారం ప్లాంట్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్లాంట్‌లో జీరో యూనిట్ సమస్య ఏర్పడి ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో రెండు రోజుల పాటు స్టీల్ ప్లాంటుకు రోజుకు 160 నుంచి 180 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో ఇంత మోతాదులో విద్యుత్ సరఫరా చేయలేమని ట్రాన్స్‌కో అధికారులు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. దీంతో స్టీల్ ప్లాంట్ అధికారులు ఉత్పత్తి సామర్థ్యం తగ్గించుకునే ఆలోచనలో పడ్డారు. నేటి నుంచి ఆర్ఈసీఎస్ సమ్మెబాట కశింకోట : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ట్రాన్స్‌కో సిబ్బంది చేపట్టిన సమ్మెకు మద్దతుగా సోమవారం నుంచి ఆర్ఈసీఎస్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఆర్ఈసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి దొడ్డి ఈశ్వరరావు ఈ విషయాన్ని తెలిపారు. సమ్మెవల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సమ్మెకు సహకరించాలని కోరారు. సీలేరులో సమ్మె సైరన్ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం ఉద యం 6 గంటల నుంచి ఇంజినీర్లు, నాన్ఇంజినీరింగ్ విభాగాల్లోని 250మంది ఉద్యోగులు విధులను బహిష్కరించనున్నారు. దీంతో సీలేరులో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోనుంది. పరవాడ ఎన్టీపీసీ పూర్తి సామర్థ్యం రెండు వేల మెగావాట్లు కాగా, బొగ్గు సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పుడు మొదటి యూనిట్లో 379, రెం డో యూనిట్లో 382, మూడో యూనిట్లో 374, నాలుగో యూ నిట్‌లో 378 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి 28వేల మెట్రిక్‌టన్నుల బొగ్గు సరఫరా కావా ల్సి ఉండగా 22 నుంచి 24వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తోం ది. సోమవారం ఇందులో కూడా కోతపడే ప్రమాదం కనిపిస్తుండడంతో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 1500 మెగావాట్లలో కూడా ఒక యూనిట్‌ను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. -
20 ఏళ్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ
విజయనగరం కలెక్టరేట్/ కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 20 ఏళ్ల తరువాత మళ్లీ కర్ఫ్యూ అమలవుతోంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లిమర్ల జూట్‌మిల్లు వద్ద 1993లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీనిలో భాగంగా కాల్పులు జరగడంతో పోలీసు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత కాలంలో అటువంటి పరిస్థితులు జిల్లాలో తలెత్తలేదు. మళ్లీ 20 ఏళ్ల అనంతరం విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ ప్రకటించారు. బొత్స పుణ్యమా అంటూ జిల్లాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమ స్వార్థకోసం ప్రజలను సమిధలుగా చేసి... తన వాఖ్యలతో సమైక్య మంటలు రేపిన బొత్స పరోక్షంగా ప్రజావినాశనానికి తెరలేపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సమైక్య నినాదం వినిపిస్తున్నా.. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, అతని సతీమణి ఎంపీ ఝాన్సీలు సమైక్యవాదాన్ని వినిపించకపోగా అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీనికి తోడు రెండు రోజులుగా బొత్స చేస్తున్న వ్యాఖ్యలతో పాటు అతని మేనల్లుడు చిన్నశ్రీను.. గుండాలతో సమైక్య ఉద్యమకారులపై దాడులు చేయించడంతో జిల్లాలో పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఉద్యమకారులు విధ్వంసాలు సృష్టిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం జరిగిన సమైక్య ఉద్యమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అర్ధరాత్రి వరకూ ఆందోళనలు చల్లారలేదు. పరిస్థితి పోలీసుల చేయిదాటిపోయింది. రాత్రి గడుస్తున్న కొద్దీ విధ్వంసాలు.. మరో వైపు పోలీసుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్న విషయాన్ని గమనించిన ఐజీ ద్వారకాతిరుమలరావు... కర్ఫ్యూను ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఉద్యమ వేడిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలెవ్వరూ రహదారులపై సంచరించవద్దంటూ సూచించారు. ఎవరైనా ఆందోళనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాలను పోలీసులు ఆ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడతాయి. నిత్యావసర సరుకులు సైతం దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే రెండు రోజులుగా జిల్లా బంద్ నేపథ్యంలో ఇక్కట్లు పడుతున్న జిల్లా వాసులకు కర్ఫ్యూ ప్రకటన గోరు చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది. -
బొత్స, ఆస్తులు ధ్వంసం
విజయనగరం కంటోన్మెంట్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బొత్స, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల ధ్వంసమే ధ్యేయంగా సమైక్య ఉద్యమం శనివారం కొనసాగించారు. శుక్రవారం జరిగిన సంఘటనల నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న పోలీసు బలగాలతో పాటు, సీఆర్పీఎఫ్ బలగాలను ఎస్పీ కార్తికేయ జిల్లాకు రప్పించారు. జిల్లాలో 144 వసెక్షన్ విధించినప్పటికీ ఫలితం లేకపోయింది. శుక్రవారం ఘటన మరువక ముందే.... శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఘటనలను మరువకముందే.. శనివారం తెల్లవారుజాము నుంచి ఉద్యమకారులు ఉద్యమించారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన ఉద్యమకారులపై ప్రైవేటు గూండాలతో దాడులు చేయించడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా పరిగణించారు. దీంతో మరింత రెచ్చిపోయారు. ప్రజాఉద్యమానికి తలొగ్గాల్సిందిపోయి.. ధనబలంతో ఉద్యమకారులను ఎంతవరకు నియంత్రిస్తారన్న పంతం లేచింది. ఈ నేపథ్యంలో ఖాకీలను సైతం లెక్కచేయకుండా తామేమైనా ఫర్వాలేదన్న తెగింపుతో ఉద్యమకారులు ముందుకు కదిలారు. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. బాష్పవాయువును ప్రయోగించారు. అయినా ఉద్యమకారులు వెరవలేదు. పోలీసులు అస్త్రశస్త్రాలతో రంగంలో దిగినప్పటికీ మరో వైపు ఉద్యమకారులు తమ సంకల్పాన్నే ఆయుధంగా చేసుకుని కదనరంగంలో ముందుకు సాగారు. లాఠీల దెబ్బకు కొంతమంది గాయపడినా.. ఏ మాత్రమూ బెదరలేదు. ఒకే నినాదంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒకానొక దశలో పోలీసులను ఉద్యమకారులు తరిమికొట్టారు. దీనిని గమనించిన పోలీసులు బొత్స ఇంటికి చేరుకునే మూడు ప్రధాన మార్గాలను ప్రారంభంలోనే పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవేమీ ఉద్యమకారులను అడ్డుకోలేకపోయాయి. పోలీసుల వ్యూహాలను భగ్నం చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు. గంటస్తంభం జంక్షన్లో సుమారు మూడు గంటల పాటు పోలీసులకు, నిరసకారులకు మధ్య భీకరపోరు జరిగింది. ఇక్కడ ఉద్యమకారులదే పైచేయి అయింది. ఈ ఘటనలో ఐదుగురు ఉద్యమకారులతోపాటు డీఎస్పీలు కృష్ణప్రసన్న, శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. అలాగే రెండో పట్టణ ఎస్సై కృష్ణకిషోర్తోపాటు ఏఆర్ ఏఎస్సై, మరో ఎనిమిది కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తీవ్రంగా స్పందించిన పోలీసులు.. ఒక్కసారిగా ఉద్యకారులపై దాడులకు దిగారు. దీంతో ఉద్యమకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి ఉద్యమకారులు మంత్రి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దకు దూసుకువచ్చారు. అసభ్యపదజాలంతో మంత్రి కుటుంబసభ్యులను దుర్భాషలాడారు. అడ్డంగా ఉన్న బారికేడ్లకు నిప్పంటించారు. ఇద్దరు మహిళలు మాత్రం తమ ఆవేదనను వెళ్లగక్కుతా మంత్రి ఇంటి వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని మహిళా పోలీసులు నిలువరించారు. కోట జంక్షన్లో యుద్ధ వాతావరణం మంత్రి ఇంటి వైపు వెళ్లే మరో ప్రధాన మార్గమైన కోట జంక్షన్లో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య భీకరపోరు జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇరు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఓ వైపు ఉద్యమకారులు బొత్స ఇంటిని ముట్టడించేందుకు తమకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు ప్రతిగా బాష్పవాయువు గోళాలను ఉద్యమకారులపైకి వదిలారు. దీంతో మరింత రెచ్చిపోయిన సమైక్యవాదులు పోలీసులే లక్ష్యంగా రాళ్లు రువ్వటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న డీఐజీ, ప్రత్యేకాధికారి విక్రమ్‌సింగ్‌మాన్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వజ్రా వాహనం ద్వారా ఉద్యమకారులపై బాష్పవాయువు గోళాలను ప్రయోగించేందుకు ఆదేశాలిచ్చారు. ఏకధాటిగా 12 రౌండ్ల వరకూ పోలీసులు గోళాలను ప్రయోగించారు. రెచ్చిపోయిన పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు భీకరంగా జరిగిన పోరులో పోలీసు బలగాలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం వరకు కాసింత ఓపికపట్టినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి సహనం కోల్పోయిన పోలీసులు ఏక పక్షంగా లాఠీలకు పనిచెప్పారు. ఈ తరుణంలో ఉద్యమకారులతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులపై లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పలువురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సాయంత్రానికి ఆ ప్రాంతంలో ఉన్న దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. దీంతో ఉద్యమకారులు మరోసారి పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. దాసన్నపేట జంక్షన్ నుంచి రాళ్లు రువ్వారు. విధ్వంస కాండ సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా శనివారం జరిగిన ఉద్ధృతపోరులో ఉద్యమకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. సమైక్యద్రోహిగా భావిస్తున్న బొత్స ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసు అడ్డుకోవడంతో వారు దాడులకు తెగబడ్డారు. పూల్‌బాగ్‌లో ఉన్న బొత్స సోదరుడు డీఈ శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న మారుతీ వ్యాన్‌ను ధ్వంసం చేశారు. సత్తిబాబు ఇంటిపై వేలాదిగా ఉద్యమకారులు దాడులు చేస్తుండడంతో ఎమ్మెల్సీ వీరభద్రస్వామి దాదాపు మూడు వందల మంది కార్యకర్తలతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం వందలాది మంది సమైక్య వాదులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఉద్యమకారులు అటుగా వస్తున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సును దహనం చేశారు. డీసీసీబీ కార్యాలయానికి నిప్పు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో వేలాదిగా ఉద్యమకారులు ఒక్కసారిగా విరుచుకుపడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు నిప్పు పెట్టారు. చీకటి పడేంత వరకూ ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన ఉద్యమకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి ఇంటికి వెళ్లేందుకు అడుగడుగునా పోలీసులు అడ్డుపడడంతో... కర్రలు, రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని డీసీసీబీ కార్యాలయ బయట గేట్లు పగలగొట్టారు. అనంతరం కార్యాలయ ప్రధాన తలుపులపై పెట్రోల్ చల్లి తగలబెట్టారు. ఏసీలను దహనం చేశారు. డీసీసీబీ ఆవరణలో ఉన్న ఏడు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కలెక్టరేట్ జంక్షన్లో... శుక్రవారం రాత్రి బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటి వద్ద విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తిని అప్పగించాలని సమైక్యవాదులు వేలాది మంది సిక్కుకాలనీకి చేరుకుని పోలీసులను నిలదీశారు. విద్యార్థిపై దాడి చేశాడన్న అనుమానంతో రామ్‌సింగ్ అనేవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న వేలాది మంది సమైక్యవాదులు రామ్సింగ్ను తమకు అప్పగించాలని పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రామ్సింగ్ను పోలీసులు కలెక్టరేట్లో ఉంచారన్న అనుమానంతో ఉద్యమకారులు అక్కడకు చేరుకున్నారు. కలెక్టరేట్‌పై దాడులకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు. పోలీసు వాహనం దహనం భారీ ఎత్తున పహారా కాస్తున్న ఖాకీల సమక్షంలోనే ఉద్యమకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పెట్టారు. మంత్రి ఇంటికి అత్యంత సమీపంలో పైడితల్లమ్మ ఆలయం సాక్షిగా ఈ ఘటన జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే మున్సిపల్ కార్యాలయ జంక్షన్లో మరో పోలీసు వాహనంతోపాటు ఓ ప్రైవేటు వాహనాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. -
హర్షకుమార్ దిష్టిబొమ్మ దహనం
పాలకొండ, న్యూస్‌లైన్: రాజమండ్రిలో సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న ఎన్జీవోలపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఎదుట శనివారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు. హర్షకుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హర్షకుమార్ దిష్టిబొమ్మను దహ నం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు గున్ను రామ్మోహనరావు, జి.విజయభాస్కర్, ఎస్వీప్రసాదరావు, బలివాడ శ్రీనివాసరావు, బత్తిన మోహనరావు, ఎం.సంపత్‌కుమార్, సిరిపురపు శ్రీనివాసరావు, దన్నాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు భామిని: సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధులపై దాడి చే సిన అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కే సులు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి బత్తిలి ట్రెయినీ ఎస్ఐ నగిరెడ్డి లక్ష్మణరావుకు ఫిర్యాదు అందజేశారు. ఎస్ఐని కలిసిన వారిలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు గెల్లంకి రమేష్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు తోట సింహాచ లం, వడ్డి గోవింద తమ్మిరెడ్డి షన్ముఖరావు, ఉపసర్పంచ్ కొవ్వూరు శేఖర్, పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం.ప్రఫుల్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
‘అప్రకటిత’ యుద్ధం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి మిగులు స్థితిలో ఉన్నా.. తెలంగాణ కోసం ఇక్కడ అప్రకటి త కోతలు విధిస్తారా?.. అక్కడ 24 గంటల సరఫరా.. ఇక్కడేమో చీటికీమాటికీ కోతల వాత లా??.. అంటూ జేఏసీ నాయకులు, సమైక్యవాదులు శనివారం రాత్రి చిలకపాలెం సబ్స్టేషన్పైకి దండెత్తారు. శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు కోత విధిం చారు. శనివారం కూడా సాయంత్రం 6.30 నుంచి 9.30 వరకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో సరఫరా నిలిపివేశారు. ఉదయం కూడా మూడు గంటల కోత విధించారు. తెలంగాణ జిల్లాల కోసం అత్యంత కీలకమైన రాత్రిపూట కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ, అధికారులను నిల దీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ సభ్యులు, జిల్లా జేఏసీ నాయకులు, ఎచ్చెర్ల, చిలకపాలెం ప్రాంతాలకు చెందిన యువకులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని సుమారు గంటన్నర సేపు కదం తొక్కారు. మొదట వీరంతా ఎచ్చెర్లలో యూనివర్సిటీ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపి వేశారు. అక్కడి నుంచి చిలకపాలెంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లారు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న అధికారులు పోలీసు బలగాలను మోహరించారు. సబ్ స్టేషన్ లోపలికి జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. యువకులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారంతా జాతీయ రహదారిపై సబ్ స్టేషన్ హోర్డింగ్ పై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. లోపలికి దూసుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. టోల్ ప్లాజా హోర్డింగ్‌ను కర్రలతో కొట్టి, రాళ్లు రువ్వారు. అయినా సంయమనంతో వ్యవహరించిన పోలీసులు ఈపీడీసీఎల్ అధికారులతో జేఏసీ నాయకులు చర్చలు జరుపుతున్నారని కాస్త ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో వారు జాతీయ రహదారి పక్కన బైఠాయించారు. మరోవైపు లోపలికి వెళ్లిన జేఏసీ నాయకులకు సబ్ స్టేషన్ కార్యాలయంలో కీలక అధికారులెవరూ కనిపించలేదు. 9.30కు సరఫరా పునరుద్ధరించాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారని అక్కడి సిబ్బంది చెప్పారు. సరఫరా వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని మీ అధికారులకు చెప్పండి.. అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ గుంట తులసీరావు, జిల్లా జేఏసీ నాయకులు శిష్టు రమేష్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, దుప్పల వెంకటరావు, వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, పి.ప్రసాద్, భావన చక్రవర్తి తదితరులు సిబ్బందికి సూచించారు. ఆ మేరకు సిబ్బంది ఫోనులో ఉన్నతాధికారులతో మాట్లాడారు. అప్పటికే విద్యుత్ సరఫరాలో జాప్యం కావటంతో సమైక్యవాదులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకోగా వారితోనూ వాగ్వాదం జరిగింది. ఇవి జరుగుతుండగానే సరఫరా ఇచ్చేయాలని సబ్ స్టేషన్ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో రాత్రి 8.45 గంటల సమయంలో ప్రాంతాలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో శాంతించిన సమైక్యవాదులు మళ్లీ రాత్రి సమయంలో కోత విధిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి, అక్కడి నుంచి వెనుదిరిగారు. -
‘సెంట్రల్’ బంద్
సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో రోజురోజుకూ బలోపేతమవుతోంది. దీంతో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఊరూవాడా అంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డలో మహిళాలోకం గర్జించగా, పెడనలో రైతులు ఆందోళనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా వ్యాప్తంగా మూయించారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఆందోళనలు జిల్లాలో 59వ రోజు ఉధృతంగా సాగాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించారు. చాలా చోట్ల స్వచ్ఛందంగా మూసివేయగా, కొన్నిచోట్ల ఎన్జీవోలు మూయించివేశారు. బీఎస్ఎన్ఎల్, ఇన్‌కంట్యాక్స్ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడ్డాయి. దివిసీమలో మహిళాలోకం గర్జించింది. అవనిగడ్డలో మహిళా గర్జన జనంతో పోటెత్తింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిగా మహిళలు తరలివచ్చి సమైక్య నినాదాలతో మార్మోగించారు. రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్యవాది, దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన సభలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పాల్గొన్నారు. పెడనలో రైతు గర్జన ఉత్సాహంగా నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన జరిపారు. బంటుమిల్లి చౌరస్తా సెంటర్లో రైతులు కర్రలతో విన్యాసాలు, కనక డప్పులతో, నృత్యాలతో ఉత్సాహంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో రైతులు తమతో తీసుకుని వచ్చిన నారును 216 జాతీయ రహదారిపై నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. సోడాలు అందించి... గుడివాడలో బాటసారులకు సోడాలు అందిస్తూ రాష్ట్ర విభజన వల్ల తాగునీటికి కష్టాలు తప్పవని సింబాలిక్‌గా తెలుపుతూ ఇకపై ఈ సోడాల తయారీకి నీరందే పరిస్థితి ఉండదంటూ నిరసన తెలిపారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఎంఎన్కే రహదారిపై ఉపాధ్యాయులు, కుదరవల్లి మహిళలు ఆటలు ఆడి నిరసన తెలిపారు. గుడ్లవల్లేరులో ఏఎన్ఎంలు ఎంఎన్కే రహదారిపై వైద్యం చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయులు,మున్సిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి తమ నిరసన తెలిపారు. చల్లపల్లి మండల పరిధిలోని నిమ్మగడ్డ వాసులు పులిగడ్డ-విజయవాడ కరకట్టపై రాస్తారోకో నిర్వహించారు. చల్లపల్లిలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. రిలేదీక్షలకు భాను సంఘీభావం... జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సంఘీభావం తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆదర్శ రైతులు కూర్చుని దీక్ష చేశారు. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద వైద్యులు, సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యార్థులు స్థానిక చెరువులో జలదీక్ష చేశారు. వత్సవాయి మండల జేఏసీ ఆధ్వర్యంలో లింగాల మునేటిలో జై సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని జలదీక్ష చేపట్టారు. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ నాయకులు జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట చేతులపై జై సమైక్యాంధ్ర అని రాసుకుని జై తెలుగుతల్లి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముసునూరు వియ్యన్నకుంట క్రాస్‌రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్ చిత్రాన్ని రోడ్డుపై గీసి చీడపురుగుల్లాంటి వేర్పాటువాదుల్ని తరిమికొట్టాలని తెలుపుతూ పవర్స్ప్రేయర్తో పురుగుల నివారణ మందు పిచికారి చేస్తునట్లు ప్రదర్శన నిర్వహించారు. గండిగుంటలో రక్తదానం... ఉయ్యూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడ్చి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని గండిగుంట గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పెదపారుపూడిలో గుడివాడ-కంకిపాడు రోడ్డుపై మాక్ డ్రిల్ చేశారు. నూజివీడులో అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నందిగామలోని చందాపురం బైపాస్ వద్ద దర్గాలో ముస్లింలు సమైక్య ప్రార్థనలు చేశారు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు గాంధీసెంటర్‌లో మిషన్ కుట్టి నిరసన తెలిపారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. పామర్రు జాతీయరహదారిపై జమీగొల్వేపల్లి, పెదమద్దాలి, బల్లిపర్రు, కురుమద్దాలి, కనుమూరు గ్రామాలలోని రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డంగా ఉంచి ట్రాఫిక్ స్తంభింపజేశారు. జేఏసీ నాయకులు, ఆర్ట్సీ కార్మికులు, పంచాయతీరాజ్ సభ్యులు జాతీయ రహదారిపైనే గుంజీలు తీసి నిరసన తెలిపారు. విజయవాడలో వినూత్న నిరసనలు.. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీధి బడి నిర్వహించారు. విద్యార్థులు కోదండరామ్, కేసీఆర్ మాస్క్‌లతో రోడ్డుపై నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల విధుల బహిష్కరణలో భాగంగా రెండో రోజు కూడా నిరాహారదీక్షలు చేశారు. వైద్య ఉద్యోగులు ప్రభుత్వాస్పత్రి ఎదుట మోకాళ్లపై నిరసన తెలిపారు. -
రాష్ట్రాన్ని చీల్చడం అన్యాయం
భీమవరం, న్యూస్‌లైన్ : స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చీల్చడం అన్యాయమని వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళాపతి అన్నారు. సమైక్యాంధ్రే లక్ష్యంగా ఈనెల 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సీమాంధ్ర సద్భావన యాత్ర శనివారం భీమవరం చేరుకుంది. స్థానిక ప్రకాశం చౌక్‌లో సద్భావన యాత్రకు వైసీపీ శ్రేణులు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓబుళాపతి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సద్భావన యాత్రకు విశేష ఆదరణ లబిస్తోందన్నారు. అయిదున్నర దశాబ్ధాలుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని స్వార్థప్రయోజనాల కోసం విభజించడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అని అన్నారు. 1953లో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధానిగా ఉన్న మద్రాసు నగరాన్ని కోల్పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూడు ప్రాంతాల సమష్టి కృషితో రాజధాని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ద్వారా రాష్ట్రానికి సంవత్సరానికి 90 వేల కోట్లు ఆదాయం వస్తోందని తెలిపారు. అటువంటి హైదరాబాద్‌ను తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేస్తే సీమాంధ్ర ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మునిసిపల్ చైర్మన్ గ్రంధి వెంక టేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలన్నారు. వైసీపీ నాయకులు, చర్చి ఆఫ్ క్రైస్ట్ అధినేత మేడిది జాన్సన్ మాట్లాడుతూ 53 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టీవీ రమణారెడ్డి, ఎం.రియాజ్ హుస్సేన్, రఘునాధ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్ కోడె యుగంధర్, జిల్లా స్టీరింగ్ క మిటీ సభ్యులు వేగేశ్న రామకృష్ణంరాజు, రేవూరి గోగురాజు, బోడసింగ్ మల్లేశ్వరరావు, కొప్పర్తి వీరరాఘవులు పాల్గొన్నారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిరండి
ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో తలపెట్టిన ’సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దెత్తున తరలిరావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. సమైక్యవేదిక రాష్ట్ర చైర్మన్ పరుచూరి అశోక్‌బాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు సమైక్యవాదులంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సీమాంధ్ర ప్రజల సమైక్యవాదనను కేంద్రానికి బలంగా వినిపించాలని నాయకులు కోరారు -
సమైక్య రాష్ట్రానికి కట్టుబడింది వైసీపీనే
సమైక్య రాష్ట్రానికి కట్టుబడిందని రాష్ట్రంలో ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన సమైక్యాంధ్ర ఏజెన్సీ ప్రజాగర్జనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ స్వార్థపూరిత కుట్రను ముందే పసిగట్టిన తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు ముందుగానే రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ 50 రోజులుగా ప్రజాఉద్యమం జరుగుతుంటే యూపీఏ సర్కారు పాలకులు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. నాడు స్వతంత్య్ర పోరాటానికి సత్యాగ్రహ ఉద్యమం ఏవిధంగా సాగిందో నేడు సీమాంధ్రలో అదే విధమైన ఉద్యమం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన శాసన సభ్యులు వారి పదవులకు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రకటన వచ్చేది కాదని బాలరాజు అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల నేడు అన్ని వర్గాల సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యోగులకు బోనస్‌తో పాటు జీతాలు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరేటి సత్యనారాయణ, కరాటం కృష్ణస్వరూప్, గద్దే వీరకృష్ణ, గద్దే బాబూ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ గగ్గులోతు మోహన్‌రావు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర పరిరక్షణకు వినూత్న నిరసనలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మరింతగా బలపడుతూ తుఫాన్‌లా కొనసాగుతోంది. 44వ రోజైన గురువారం ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అన్నివర్గాల ప్రజలు పోరాటంలో మమేకమై వినూత్నంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ప్రజలు ఉద్యమ పిడికిళ్లు మరింత బిగిసేలా ఎన్జీవోలు రెండోరోజు కూడా పల్లెబాట పట్టారు. అన్ని వర్గాలను మరింత చైతన్యం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగాపదవికి రాజీనామా చేయాలంటూ ఎన్జీవో, జేఏసీ నాయకులు పాలకొల్లు ఎమ్మెల్యే బంగా రు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. తణుకు, అత్తిలిలో సమైక్యవాదులు గురువారం ఇచ్చిన బంద్ పిలుపులో రెండుచోట్లా బంద్ విజయవంతమైంది. పెనుగొండ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపులో భాగంగా మొదటిరోజైన గురువారం బంద్ సంపూర్ణంగా జరిగింది. భీమవరం జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన 72 గంటల బంద్ రెండో రోజూ విజయవంతమైంది. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో రిలే దీక్ష శిబిరం వద్ద న్యాయవాదులు, ఉద్యోగులు మ్యూజికల్ చైర్స్ ఆడారు. ఆకివీడులో ఉద్యోగ సంఘాల సభ్యులు, వ్యాపారులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఆకివీడులో 20 మంది యువకులు విజభనను నిరసిస్తూ రక్తదానం చేశారు. నరసాపురంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయినులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలి పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో రిలే దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. టి.నరసాపురం ప్రధాన కూడలిలో యువత కోలాటమాడి, రోప్ స్కిప్పింగ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో చేశారు. బోసుబొమ్మ సెంటర్లో మానవహారం ఏర్పాటుచేసి, గంగిరెద్దుతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఉంగుటూరులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. అనంతరం రోడ్డుపై కబడ్డీ ఆడారు. చేబ్రోలుకు చెందిన దళితులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో సెయింట్ ఆన్స్ విద్యార్థులు, పైబోయిన వెంకట్రామయ్య యూత్ సభ్యులు భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలతో పాటు, విభజన జరిగితే ఉపాధి అవకాశాలు ఎలా దెబ్బతింటాయనే విషయంపై విద్యార్థులు లఘునాటికల ద్వారా చూపిం చారు. రాష్ట్ర విభజన జరిగితే ఆకులు, అలములు తిని బతకాలని తెలియజేస్తూ ఉండిలో అడవి మనుషుల వేషధారణలో ఉపాధ్యాయులు వినూత్న ప్రదర్శన చేశారు. ఇరగవరం, దువ్వ, తూర్పువిప్పర్రులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆచంటలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్షలో పాల్గొన్నారు. మండలంలోని వల్లూరు, ఎ.వేమవరం పెనుమంట్ర మండలం మార్టేరు, పెనుమంట్రలో దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుగొండ దీక్షలో రజకు లు పాల్గొన్నారు. కొవ్వూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జూనియర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షా శిబిరాన్ని ప్రజా గాయకుడు పూడి లక్ష్మణ్ సందర్శించి సమైక్యాంధ్ర పాటల సీడీని అందజేశారు. చాగల్లు మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టారు. గౌరిపల్లి నుంచి ఎస్.ముప్పవరం వరకు యాత్ర నిర్వహించి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లపూడి మండలంలో మలకపల్లి నుంచి తాళ్లపూడి వరకు ఉపాధ్యాయులు, ఏపీఎన్జీవోలు, పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేశారు. డ్వాక్రా మహిళలు రిలే దీక్ష చేపట్టారు. -
విభజనేందిరో.. మీ స్వార్థమేందిరో
సాక్షి, కర్నూలు: ఉద్యమం ఉప్పెనవుతోంది. సమైక్యవాదులు కదనరంగంలో నిర్విరామ పోరాటం సాగిస్తున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు వారి స్థాయిలో తీవ్రత పెంచుతున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. రాష్ట్రం ముక్కలవుతున్నా నాయకులు రాజీనామాలు చేయకుండా ఎందుకు పదవులు పట్టుకుని వేళాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. జేసీబీ యజమానులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో 50 జేసీబీలతో ర్యాలీ చేపట్టారు. పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారపేటలోని పశు వైద్యశాల నుంచి రాజ్‌విహార్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు జై సమైక్యాంధ్ర బెలూన్లతో భారీ ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్లో అరగంట పాటు మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గ్రంథాలయ సంస్థ, కలెక్టరేట్లోని స్టేట్ ఆడిట్ అధికారులు, ఉద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మహా ర్యాలీ కొనసాగింది. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి షిండే, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఉరేగించారు. న్యాయవాదుల నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి కోట్ల, టీజీ, ఎమ్మెల్యే మురళి కనపడటం లేదంటూ పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సర్కిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మాస్ డ్రిల్ చేపట్టారు. అధ్యాపకులు కర్రసాము, నాన్చాక్ విద్యలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఆదోనిలో రెండో రోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో.. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా దూదేకొండ గ్రామస్తులు 20 మంది దీక్షలో కూర్చొన్నారు. దేవనకొండలో తాపీ వర్కర్లు వివిధ వేషధారణల్లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటంతో నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. -
సమైక్యహారం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు శనివారం కదం తొక్కారు. రోజురోజుకూ వారి ఉద్యమం తీవ్రమవుతోంది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం 32వ రోజు ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు ర్యాలీలు, నిరసన దీక్షలు కొనసాగించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడి ఇంటిని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖాధికారులు రిలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మంత్రి ఆనం నివాసం ముట్టడిలో ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేసినందుకు నిరసనగా నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టులో బంద్ పాటించారు. ఉద్యోగులు ధర్నా చేసి, వంటావార్పు నిర్వహించారు. పొదలకూరు మండలంలోని రేషన్‌షాపు డీలర్లు ప్రదర్శన జరిపారు. మనుబోలు ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో జరిపి, మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీపీగూడూరు మండలం నరుకూరు సెంటర్లో సమైక్యవాదులు రాస్తారోకో జరిపారు. గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఆదర్శరైతులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. పాస్టర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే ప్రార్థన జరిపారు. విద్యార్థులు రోడ్లపైనే చెస్, క్యారం ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 6వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగించారు. కోవూరు ఎన్జీఓ హోంలో మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం నుంచి పల్లిపాళెం వరకు జేఏసీ నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండు వద్ద అనంతసాగరం మండలానికి చెందిన గ్రామ సేవకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు నెల్లూరుపాళెం- ఆత్మకూరు రహదారిపై, ఆర్టీసీ డిపో ఎదుట పొట్టి శ్రీరాములు మాస్కులు ధరించి రాస్తారోకో నిర్వహించారు. చైతన్యపాఠశాల విద్యార్థులు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో తెలుగుతల్లి అవతారంలో వినూత్న నిరసన తెలిపారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని కళాశాల ప్రాంగణం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో,మెరిట్స్కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర, భరతమాత చిత్రాల వద్ద విద్యార్థులు, ఉద్యమకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వింజమూరులో 26వ రోజు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. కావలి ఆర్డీవో కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కాంగ్రెస్ నేత గ్రంధి యానాదిశెట్టి ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేతికి నల్లరిబ్బన్లతో సంకెళ్లులాగా వేసుకొని మోకాళ్లపై ట్రంకురోడ్డుపై నడిచి నిరసనను తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు, భీమసేనుడి వేషధారణలో ర్యాలీ కొనసాగించారు. జెడ్పీ బాలుర పాఠశాల తలుపులకు సమైక్యవాదులు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు లోపలికి వెళ్లలేకపోయారు. పోలీసులు కలుగజేసుకొని ఉపాధ్యాయులను పాఠశాలలోకి పంపారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 18 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. నాయుడుపేటలో ప్రయివేట్ స్కూల్ విద్యార్థులంతా భారీ ప్రదర్శన నిర్వహించి పాతబస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.