బొత్స, ఆస్తులు ధ్వంసం
Published Sun, Oct 6 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
విజయనగరం కంటోన్మెంట్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బొత్స, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల ధ్వంసమే ధ్యేయంగా సమైక్య ఉద్యమం శనివారం కొనసాగించారు. శుక్రవారం జరిగిన సంఘటనల నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న పోలీసు బలగాలతో పాటు, సీఆర్‌పీఎఫ్ బలగాలను ఎస్పీ కార్తికేయ జిల్లాకు రప్పించారు. జిల్లాలో 144 వసెక్షన్ విధించినప్పటికీ ఫలితం లేకపోయింది.
శుక్రవారం ఘటన మరువక ముందే....
శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఘటనలను మరువకముందే.. శనివారం తెల్లవారుజాము నుంచి ఉద్యమకారులు ఉద్యమించారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన ఉద్యమకారులపై ప్రైవేటు గూండాలతో దాడులు చేయించడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా పరిగణించారు. దీంతో మరింత రెచ్చిపోయారు. ప్రజాఉద్యమానికి తలొగ్గాల్సిందిపోయి.. ధనబలంతో ఉద్యమకారులను ఎంతవరకు నియంత్రిస్తారన్న పంతం లేచింది. ఈ నేపథ్యంలో ఖాకీలను సైతం లెక్కచేయకుండా తామేమైనా ఫర్వాలేదన్న తెగింపుతో ఉద్యమకారులు ముందుకు కదిలారు. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. బాష్పవాయువును ప్రయోగించారు.
అయినా ఉద్యమకారులు వెరవలేదు. పోలీసులు అస్త్రశస్త్రాలతో రంగంలో దిగినప్పటికీ మరో వైపు ఉద్యమకారులు తమ సంకల్పాన్నే ఆయుధంగా చేసుకుని కదనరంగంలో ముందుకు సాగారు. లాఠీల దెబ్బకు కొంతమంది గాయపడినా.. ఏ మాత్రమూ బెదరలేదు. ఒకే నినాదంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒకానొక దశలో పోలీసులను ఉద్యమకారులు తరిమికొట్టారు. దీనిని గమనించిన పోలీసులు బొత్స ఇంటికి చేరుకునే మూడు ప్రధాన మార్గాలను ప్రారంభంలోనే పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవేమీ ఉద్యమకారులను అడ్డుకోలేకపోయాయి. పోలీసుల వ్యూహాలను భగ్నం చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు.
గంటస్తంభం జంక్షన్‌లో సుమారు మూడు గంటల పాటు పోలీసులకు, నిరసకారులకు మధ్య భీకరపోరు జరిగింది. ఇక్కడ ఉద్యమకారులదే పైచేయి అయింది. ఈ ఘటనలో ఐదుగురు ఉద్యమకారులతోపాటు డీఎస్పీలు కృష్ణప్రసన్న, శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. అలాగే రెండో పట్టణ ఎస్సై కృష్ణకిషోర్‌తోపాటు ఏఆర్ ఏఎస్సై, మరో ఎనిమిది కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తీవ్రంగా స్పందించిన పోలీసులు.. ఒక్కసారిగా ఉద్యకారులపై దాడులకు దిగారు. దీంతో ఉద్యమకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి ఉద్యమకారులు మంత్రి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దకు దూసుకువచ్చారు. అసభ్యపదజాలంతో మంత్రి కుటుంబసభ్యులను దుర్భాషలాడారు. అడ్డంగా ఉన్న బారికేడ్లకు నిప్పంటించారు. ఇద్దరు మహిళలు మాత్రం తమ ఆవేదనను వెళ్లగక్కుతా మంత్రి ఇంటి వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని మహిళా పోలీసులు నిలువరించారు.
కోట జంక్షన్‌లో యుద్ధ వాతావరణం
మంత్రి ఇంటి వైపు వెళ్లే మరో ప్రధాన మార్గమైన కోట జంక్షన్‌లో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య భీకరపోరు జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇరు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఓ వైపు ఉద్యమకారులు బొత్స ఇంటిని ముట్టడించేందుకు తమకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు ప్రతిగా బాష్పవాయువు గోళాలను ఉద్యమకారులపైకి వదిలారు. దీంతో మరింత రెచ్చిపోయిన సమైక్యవాదులు పోలీసులే లక్ష్యంగా రాళ్లు రువ్వటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న డీఐజీ, ప్రత్యేకాధికారి విక్రమ్‌సింగ్‌మాన్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వజ్రా వాహనం ద్వారా ఉద్యమకారులపై బాష్పవాయువు గోళాలను ప్రయోగించేందుకు ఆదేశాలిచ్చారు. ఏకధాటిగా 12 రౌండ్ల వరకూ పోలీసులు గోళాలను ప్రయోగించారు.
రెచ్చిపోయిన పోలీసులు
ఉదయం నుంచి సాయంత్రం వరకు భీకరంగా జరిగిన పోరులో పోలీసు బలగాలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం వరకు కాసింత ఓపికపట్టినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి సహనం కోల్పోయిన పోలీసులు ఏక పక్షంగా లాఠీలకు పనిచెప్పారు. ఈ తరుణంలో ఉద్యమకారులతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులపై లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పలువురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సాయంత్రానికి ఆ ప్రాంతంలో ఉన్న దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. దీంతో ఉద్యమకారులు మరోసారి పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. దాసన్నపేట జంక్షన్ నుంచి రాళ్లు రువ్వారు.
విధ్వంస కాండ
సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా శనివారం జరిగిన ఉద్ధృతపోరులో ఉద్యమకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. సమైక్యద్రోహిగా భావిస్తున్న బొత్స ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసు అడ్డుకోవడంతో వారు దాడులకు తెగబడ్డారు. పూల్‌బాగ్‌లో ఉన్న బొత్స సోదరుడు డీఈ శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న మారుతీ వ్యాన్‌ను ధ్వంసం చేశారు. సత్తిబాబు ఇంటిపై వేలాదిగా ఉద్యమకారులు దాడులు చేస్తుండడంతో ఎమ్మెల్సీ వీరభద్రస్వామి దాదాపు మూడు వందల మంది కార్యకర్తలతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం వందలాది మంది సమైక్య వాదులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఉద్యమకారులు అటుగా వస్తున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సును దహనం చేశారు.
డీసీసీబీ కార్యాలయానికి నిప్పు
సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో వేలాదిగా ఉద్యమకారులు ఒక్కసారిగా విరుచుకుపడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు నిప్పు పెట్టారు. చీకటి పడేంత వరకూ ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన ఉద్యమకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి ఇంటికి వెళ్లేందుకు అడుగడుగునా పోలీసులు అడ్డుపడడంతో... కర్రలు, రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని డీసీసీబీ కార్యాలయ బయట గేట్లు పగలగొట్టారు. అనంతరం కార్యాలయ ప్రధాన తలుపులపై పెట్రోల్ చల్లి తగలబెట్టారు. ఏసీలను దహనం చేశారు. డీసీసీబీ ఆవరణలో ఉన్న ఏడు వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
కలెక్టరేట్ జంక్షన్‌లో...
శుక్రవారం రాత్రి బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటి వద్ద విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తిని అప్పగించాలని సమైక్యవాదులు వేలాది మంది సిక్కుకాలనీకి చేరుకుని పోలీసులను నిలదీశారు. విద్యార్థిపై దాడి చేశాడన్న అనుమానంతో రామ్‌సింగ్ అనేవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న వేలాది మంది సమైక్యవాదులు రామ్‌సింగ్‌ను తమకు అప్పగించాలని పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రామ్‌సింగ్‌ను పోలీసులు కలెక్టరేట్‌లో ఉంచారన్న అనుమానంతో ఉద్యమకారులు అక్కడకు చేరుకున్నారు. కలెక్టరేట్‌పై దాడులకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు.
పోలీసు వాహనం దహనం
భారీ ఎత్తున పహారా కాస్తున్న ఖాకీల సమక్షంలోనే ఉద్యమకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పెట్టారు. మంత్రి ఇంటికి అత్యంత సమీపంలో పైడితల్లమ్మ ఆలయం సాక్షిగా ఈ ఘటన జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే మున్సిపల్ కార్యాలయ జంక్షన్‌లో మరో పోలీసు వాహనంతోపాటు ఓ ప్రైవేటు వాహనాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.
Advertisement
Advertisement