20 ఏళ్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ | Curfew in Vizianagaram after 20year | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ

Published Sun, Oct 6 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Curfew in Vizianagaram after 20year

విజయనగరం కలెక్టరేట్/ కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 20 ఏళ్ల తరువాత మళ్లీ కర్ఫ్యూ అమలవుతోంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లిమర్ల జూట్‌మిల్లు వద్ద 1993లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీనిలో భాగంగా కాల్పులు జరగడంతో పోలీసు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత కాలంలో అటువంటి పరిస్థితులు జిల్లాలో తలెత్తలేదు. మళ్లీ 20 ఏళ్ల అనంతరం విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ ప్రకటించారు. బొత్స పుణ్యమా అంటూ జిల్లాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమ స్వార్థకోసం ప్రజలను సమిధలుగా చేసి... తన వాఖ్యలతో సమైక్య మంటలు రేపిన బొత్స పరోక్షంగా ప్రజావినాశనానికి తెరలేపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సమైక్య నినాదం వినిపిస్తున్నా.. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, అతని సతీమణి ఎంపీ ఝాన్సీలు సమైక్యవాదాన్ని వినిపించకపోగా అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. 
 
 దీనికి తోడు రెండు రోజులుగా బొత్స చేస్తున్న వ్యాఖ్యలతో పాటు అతని మేనల్లుడు చిన్నశ్రీను.. గుండాలతో సమైక్య ఉద్యమకారులపై దాడులు చేయించడంతో జిల్లాలో పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఉద్యమకారులు విధ్వంసాలు సృష్టిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం జరిగిన సమైక్య ఉద్యమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అర్ధరాత్రి వరకూ ఆందోళనలు చల్లారలేదు. పరిస్థితి పోలీసుల చేయిదాటిపోయింది. రాత్రి గడుస్తున్న కొద్దీ విధ్వంసాలు.. మరో వైపు పోలీసుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్న విషయాన్ని గమనించిన ఐజీ ద్వారకాతిరుమలరావు... కర్ఫ్యూను ప్రకటించారు. 
 
 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఉద్యమ వేడిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలెవ్వరూ రహదారులపై సంచరించవద్దంటూ సూచించారు. ఎవరైనా ఆందోళనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాలను  పోలీసులు ఆ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడతాయి. నిత్యావసర సరుకులు సైతం దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే రెండు రోజులుగా జిల్లా బంద్ నేపథ్యంలో ఇక్కట్లు పడుతున్న జిల్లా వాసులకు కర్ఫ్యూ ప్రకటన గోరు చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement