విజయనగరంలో ఏడవ రోజూ కొనసాగిన కర్ఫ్యూ | Curfew continued seventh day Vijayanagara, police over Action | Sakshi
Sakshi News home page

విజయనగరంలో ఏడవ రోజూ కొనసాగిన కర్ఫ్యూ

Published Sun, Oct 13 2013 1:46 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

Curfew continued  seventh day Vijayanagara, police over Action

విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్:  విజయనగరం పట్టణంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా  పట్టణంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం  కర్ఫ్యూను కొనసాగిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏడవ రోజు  శనివారం పట్టణంలో కర్ఫ్యూ అమలైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునివ్వగా అనంతరం  ఏ ఒక్కరిని రహదారులపైకి అనుమతించలేదు. తెలియక వచ్చిన వారిపై ఖాకీలు లాఠీలు ఝుళిపించారు.   రెండునెలల తరువాత తిరిగిన ఆర్టీసీ బస్సులను కర్ఫ్యూ సడలింపులో పట్టణంలోకి అనుమతిం చారు. సడలింపు సమయం ముగిసిన మరుక్షణం ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. అంతేకాకుండా  ఆదివారం నుంచి సడలింపు ముగిసే సమయానికి ముందుగానే తమ సర్వీసులను నిలిపివేసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులకు హుకుం జారీ చేశారు. 
 
 ప్రధానంగా విజయనగరం పట్టణం నడిబొడ్డు మీదుగా వెళ్లే సర్వీసులపై ఆంక్షలు విధించారు. దీంతో చీపురుపల్లి, పాలకొండ, రాజాం వైపు వెళ్లేవారితో పాటు పూసపాటిరేగ, భోగాపురం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అయితే విశాఖ నుంచి  సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వైపు వెళ్లే సర్వీసులను మాత్రం  పట్టణంలోకి  రానివ్వకుండా నేరుగా జాతీయ రహదారిపై వెళ్లిపోవాలంటూ సూచనలు జారీ చేశారు.  దీంతో వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి  వచ్చే వారితో పాటు ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా దసరా పండగకు సొంత ఊళ్లకు వచ్చి, వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారింది. 
 
 మంత్రి బొత్స ఇంటి వద్ద కొనసాగిన 
 మూడంచెల భద్రత  
 జిల్లా మంత్రి బొత్స నివాసం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన  మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. సుమారు వంద మంది పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లే  అన్ని సందుల్లో పహారా కాసి అష్టదిగ్బంధనం చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలను మినహా ఏ ఒక్కరినీ అనుమతించలేదు. 
 
 12 గంటల సడలింపులో పట్టణంలో హడావుడి 
 అధికారుల ముందస్తు ప్రకటన నేపథ్యంలో ఉదయం 6నుంచి సాయంత్రం 6 వరకు పోలీసులు కర్ఫ్యూను సడలించడంతో  పట్టణంలో హడావుడి వాతావరణం నెలకొంది.  దసరా పండగకు, ఆ తరువాత వారంలో జరగనున్న పైడితల్లమ్మ పండగకు ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం ప్రజలు కొనుగోలు బాట పట్టారు. దీనికి తోడు ఇన్నాళ్లూ బంద్ పాటించిన ఆర్టీసీ బస్సులు సైతం నడుస్తుండడంతో దాదాపు రెండు నెలల తరువాత పట్టణంలో సందడినెలకొంది. బ్యాంకులు, దుకాణాలు అన్నీ కిటకిటలాడాయి. నూతనవస్త్రాలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కొనుగోలు చేసే వారితో మార్కెట్‌లో సందడి నెలకొంది. అయితే కర్ఫ్యూ ముగిసిన మరుక్షణం పోలీసులు ఎవ్వరినీ రహదారులపై అనుమతించకపోవడంతో మళ్లీ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement