రాజాం సిటీ/రేగిడి: రాజాం వారపుసంతలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య దళారీ సొమ్ము విషయంలో చెలరేగిన గొడవను విడిపించేందుకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఈ ఘటనపై సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాజాంలో ప్రతి గురువారం జరిగే వారపు సంతకు పశువుల వ్యాపారం నిమిత్తం రేగిడి మండలంలోని అంబకండికి చెందిన మండల రామినాయుడు (రాము)(45), ఆయన బావ పప్పల శ్రీహరినాయుడు, సాకేటి లక్ష్మణ, మండల చక్రధరరావు ఎప్పటిలాగానే వచ్చారు. పదేళ్లుగా ఆవుల క్రయవిక్రయాలు చేస్తూ వచ్చే కొద్దిపాటి లాభంతో జీవనం సాగిస్తున్నారు.
సాకేటి లక్ష్మణకు చెందిన ఆవును మండల చక్రధరరావు రూ.50 వేలకు జామి మండలంలోని అలమండ సంత ప్రాంతానికి చెందిన శ్రీనురాజుకు విక్రయించాడు. శ్రీనురాజు వెంటనే అదే సంత ప్రాంతానికి చెందిన జన్నెల ఈశ్వరరావుకు రూ.53 వేలకు ఆవును విక్రయించాడు. అందులో రూ.50 వేలు చక్రధరరావుకు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో దళారీగా చక్రధరరావు రూ.1000 ఉంచుకుని, రూ.49 వేలను సాకేటి లక్ష్మణకు ఇచ్చాడు.
దీనికి అంగీకరించని లక్ష్మణరావు చక్రధరరావుతో గొడవపడ్డాడు. ఇంతలో అలమండ సంత ప్రాంతానికి చెందిన జన్నేల ఈశ్వరరావు కలుగజేసుకుని, ఎప్పుడూ దళారీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బంది పెడతావు ఎందుకని లక్ష్మణరావుతో గొడవపడ్డాడు. మండల రామినాయుడుతో పాటు కందుకూరి సత్యనారాయణ, గండ్రేటి చక్రధర్, కెంబూరు అప్పలనాయుడు గొడవను విడిపించే ప్రయత్నం చేశారు.
నన్నే తోస్తావా అంటూ రామినాయుడిపై ఈశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ఈశ్వరరావు కొడుకు కిశోర్ కూడా రామినాయుడు గుండెలపై పిడుగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని, భోరున విలపించారు. మృతుడి బావ పప్పల శ్రీహరినాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment