144వ సెక్షన్ ఎత్తివేత | curfew stopped in vizianagaram | Sakshi
Sakshi News home page

144వ సెక్షన్ ఎత్తివేత

Published Thu, Oct 31 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

curfew stopped in vizianagaram

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  పట్టణంలో 144వ సెక్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే బుధవారం ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో విజయనగరంలో ఈ నెల 4వ తేదీ నుంచి 144వ సెక్షన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సమైక్య ద్రోహిగా పేర్కొంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలతో పట్టణంలో వారం రోజుల పాటు కర్ఫ్యూ అమలు చేశారు. అనంతరం కర్ఫ్యూను ఎత్తివేసినప్పటికీ 144వ సెక్షన్‌ను అమలు చేశారు. జిల్లా కేంద్రంలో గుంపులుగా తిరగకూడదని, ఎటువంటి నిరసనలు తెలపకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఇదే తరుణంలో పోలీసులు అరెస్ట్‌ల పర్వం మొదలు పెట్టారు. స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యంతోనే పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారని సామాన్య ప్రజానీకంతో పాటూ అఖిలపక్షం, ఉద్యోగ సంఘాల నాయకుల పలుమార్లు కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రాలు అందజేశారు.
 ఇదే విషయమై బుధవారం కూడా దళిత సంఘాల నాయకులు, న్యాయవాదులు డీఆర్వో బి.హేమసుందర వెంకటరావుకు వినతిపత్రాలు అందించారు. 144వ సెక్షన్ విధించటం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స కూడా కర్ఫ్యూ, 144వ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడే తన పర్యటనలు పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవాల నుంచి జిల్లా కేంద్రంలోనే గడిపిన బొత్స పలువురు మంత్రులను సైతం జిల్లాకు రప్పించి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. దాదాపు పర్యటనలు పూర్తి కావటం, మరోవైపు నిరసనలు వెల్లువెత్తటంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు బుధవారం సాయంత్రం నుంచి నుంచి 144వ సెక్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.
 ఉద్యమానికి సన్నద్ధం..
 ఎట్టకేలకు పట్టణంలో 144వ సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటన రావడంతో సమైక్య రాష్ట్రం కోసం  గురువారం నుంచి ఉద్యమం చేసేందుకు ఉద్యోగ, న్యాయవాద సంఘాలతో పాటు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినప్పటికీ 144వ సెక్షన్ అమల్లో ఉండటంతో కనీసం శాంతియుత నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేకుండాపోయిందని సమైక్యవాదులు చెబుతున్నారు. అరెస్ట్‌ల పర్వానికి కూడా తెరదించి జిల్లాలో శాంతిపూర్వక వాతావరణం నెలకొల్పాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement