విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో చీకట్లు | Current employee strikes at night | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో చీకట్లు

Published Mon, Oct 7 2013 2:22 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

Current employee strikes at night

విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ప్రభావం తీవ్ర రూపం దాల్చబోతోంది. ఫలితంగా అటు పరిశ్రమకు, ఇటు గృహ, వాణిజ్యావసరాలకు కూడా  విద్యుత్ కష్టాలు మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసే పరిస్థితి లేదు. ఆరు నూరైనా సమ్మె విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఉద్యోగులు తేల్చి చెప్పడంతో అధికార యంత్రాంగం దేవుడి మీదే భారం వేసింది. ఉద్యమం వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో దూర ప్రయాణాల కోసం రైళ్లను నమ్ముకున్న జనానికి అవి ఎక్కడికక్కడ ఆగిపోవడం, అనేకం రద్దు కావడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్ అధికారులు తమ పరిధిలోని జిల్లాల్లో అనధికారిక విద్యుత్ కోతలకు తెర లేపారు. విశాఖ స్టీల్ ప్లాంటుకూ సమైక్య సెగ తగలనుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు.
 
 కరెంటు లోటు 
 ఈపీడీసీఎల్ పరిధిలో రోజుకు 1500 నుంచి 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పుడు రోజుకు 1215 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. బంద్ కారణంగా డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ ఆదివారం నుంచి  అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అనధికారిక కోతలకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో  3 నుంచి 4 గంటలు, పట్టణ ప్రాంతాల్లో సైతం గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె తీవ్ర రూపం దాల్చి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే ఈ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో  5వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో 7,500 మంది సమ్మెలోకి వెళ్లనుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
 
 ఉక్కుకు సమ్మె ముప్పు 
 విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నప్పటికి ట్రాన్స్‌కో నుంచి రోజుకు 50 నుంచి 60 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. దీనికి తోడు ఆదివారం ప్లాంట్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్లాంట్‌లో జీరో యూనిట్ సమస్య ఏర్పడి ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో రెండు రోజుల పాటు స్టీల్ ప్లాంటుకు రోజుకు 160 నుంచి 180 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో ఇంత మోతాదులో విద్యుత్ సరఫరా చేయలేమని ట్రాన్స్‌కో అధికారులు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. దీంతో స్టీల్ ప్లాంట్ అధికారులు ఉత్పత్తి సామర్థ్యం తగ్గించుకునే ఆలోచనలో పడ్డారు.
 
 నేటి నుంచి ఆర్‌ఈసీఎస్ సమ్మెబాట
 కశింకోట : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ట్రాన్స్‌కో సిబ్బంది చేపట్టిన సమ్మెకు మద్దతుగా సోమవారం నుంచి ఆర్‌ఈసీఎస్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఆర్‌ఈసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి దొడ్డి ఈశ్వరరావు ఈ విషయాన్ని తెలిపారు. సమ్మెవల్ల  విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సమ్మెకు సహకరించాలని కోరారు.
 
 సీలేరులో సమ్మె సైరన్
 సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం  ఉద యం 6 గంటల నుంచి ఇంజినీర్లు, నాన్‌ఇంజినీరింగ్ విభాగాల్లోని  250మంది ఉద్యోగులు విధులను బహిష్కరించనున్నారు. దీంతో సీలేరులో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోనుంది. పరవాడ ఎన్‌టీపీసీ పూర్తి సామర్థ్యం రెండు వేల మెగావాట్లు కాగా, బొగ్గు సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పుడు మొదటి యూనిట్‌లో 379, రెం డో యూనిట్‌లో 382, మూడో యూనిట్‌లో 374, నాలుగో యూ నిట్‌లో 378 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి 28వేల మెట్రిక్‌టన్నుల బొగ్గు సరఫరా కావా ల్సి ఉండగా 22 నుంచి 24వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తోం ది. సోమవారం ఇందులో కూడా కోతపడే ప్రమాదం కనిపిస్తుండడంతో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 1500 మెగావాట్లలో కూడా ఒక యూనిట్‌ను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement