సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో రోజురోజుకూ బలోపేతమవుతోంది. దీంతో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఊరూవాడా అంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డలో మహిళాలోకం గర్జించగా, పెడనలో రైతులు ఆందోళనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా వ్యాప్తంగా మూయించారు.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఆందోళనలు జిల్లాలో 59వ రోజు ఉధృతంగా సాగాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించారు. చాలా చోట్ల స్వచ్ఛందంగా మూసివేయగా, కొన్నిచోట్ల ఎన్జీవోలు మూయించివేశారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఇన్‌కంట్యాక్స్ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడ్డాయి. దివిసీమలో మహిళాలోకం గర్జించింది. అవనిగడ్డలో మహిళా గర్జన జనంతో పోటెత్తింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిగా మహిళలు తరలివచ్చి సమైక్య నినాదాలతో మార్మోగించారు. రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ చేపట్టారు.
సమైక్యవాది, దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన సభలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పాల్గొన్నారు. పెడనలో రైతు గర్జన ఉత్సాహంగా నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన జరిపారు. బంటుమిల్లి చౌరస్తా సెంటర్‌లో రైతులు కర్రలతో విన్యాసాలు, కనక డప్పులతో, నృత్యాలతో ఉత్సాహంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్‌లో రైతులు తమతో తీసుకుని వచ్చిన నారును 216 జాతీయ రహదారిపై నాట్లు వేస్తూ నిరసన తెలిపారు.
సోడాలు అందించి...
గుడివాడలో బాటసారులకు సోడాలు అందిస్తూ రాష్ట్ర విభజన వల్ల తాగునీటికి కష్టాలు తప్పవని సింబాలిక్‌గా తెలుపుతూ ఇకపై ఈ సోడాల తయారీకి నీరందే పరిస్థితి ఉండదంటూ నిరసన తెలిపారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఎంఎన్‌కే రహదారిపై ఉపాధ్యాయులు, కుదరవల్లి మహిళలు ఆటలు ఆడి నిరసన తెలిపారు. గుడ్లవల్లేరులో ఏఎన్‌ఎంలు ఎంఎన్‌కే రహదారిపై వైద్యం చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయులు,మున్సిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి తమ నిరసన తెలిపారు. చల్లపల్లి మండల పరిధిలోని నిమ్మగడ్డ వాసులు పులిగడ్డ-విజయవాడ కరకట్టపై రాస్తారోకో నిర్వహించారు. చల్లపల్లిలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు.
రిలేదీక్షలకు భాను సంఘీభావం...
జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సంఘీభావం తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆదర్శ రైతులు కూర్చుని దీక్ష చేశారు. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లు నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద వైద్యులు, సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముదినేపల్లిలో ఉపాధ్యాయులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యార్థులు స్థానిక చెరువులో జలదీక్ష చేశారు. వత్సవాయి మండల జేఏసీ ఆధ్వర్యంలో లింగాల మునేటిలో జై సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని జలదీక్ష చేపట్టారు. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ నాయకులు జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట చేతులపై జై సమైక్యాంధ్ర అని రాసుకుని జై తెలుగుతల్లి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముసునూరు వియ్యన్నకుంట క్రాస్‌రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్ చిత్రాన్ని రోడ్డుపై గీసి చీడపురుగుల్లాంటి వేర్పాటువాదుల్ని తరిమికొట్టాలని తెలుపుతూ పవర్‌స్ప్రేయర్‌తో పురుగుల నివారణ మందు పిచికారి చేస్తునట్లు ప్రదర్శన నిర్వహించారు.
గండిగుంటలో రక్తదానం...
ఉయ్యూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడ్చి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని గండిగుంట గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పెదపారుపూడిలో గుడివాడ-కంకిపాడు రోడ్డుపై మాక్ డ్రిల్ చేశారు. నూజివీడులో అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నందిగామలోని చందాపురం బైపాస్ వద్ద దర్గాలో ముస్లింలు సమైక్య ప్రార్థనలు చేశారు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు గాంధీసెంటర్‌లో మిషన్ కుట్టి నిరసన తెలిపారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. పామర్రు జాతీయరహదారిపై జమీగొల్వేపల్లి, పెదమద్దాలి, బల్లిపర్రు, కురుమద్దాలి, కనుమూరు గ్రామాలలోని రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డంగా ఉంచి ట్రాఫిక్ స్తంభింపజేశారు. జేఏసీ నాయకులు, ఆర్ట్‌సీ కార్మికులు, పంచాయతీరాజ్ సభ్యులు జాతీయ రహదారిపైనే గుంజీలు తీసి నిరసన తెలిపారు.
విజయవాడలో వినూత్న నిరసనలు..
విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీధి బడి నిర్వహించారు. విద్యార్థులు కోదండరామ్, కేసీఆర్ మాస్క్‌లతో రోడ్డుపై నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల విధుల బహిష్కరణలో భాగంగా రెండో రోజు కూడా నిరాహారదీక్షలు చేశారు. వైద్య ఉద్యోగులు ప్రభుత్వాస్పత్రి ఎదుట మోకాళ్లపై నిరసన తెలిపారు.
‘సెంట్రల్’ బంద్
Published Sat, Sep 28 2013 1:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement