బ్యాంకింగ్‌కు సమ్మె సెగ
♦ చెక్కుల క్లియరెన్స్‌పై ప్రభావం
♦ సమ్మెకు దూరంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు
♦ పేమెంట్ బ్యాంకులపై యూనియన్ల వ్యతిరేకత
ముంబై : సమ్మె సెగ బ్యాంకింగ్ సేవలను తాకింది. సమ్మె ప్రభావం బ్యాంకుల చెక్కుల క్లియరింగ్ కార్యకలాపాలపై పడింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, 14 బ్యాంకు యూనియన్లు బుధవారం సమ్మె నిర్వహించాయి. 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 9 విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 కో-ఆపరేటివ్ బ్యాంకులలతో పాటు నాబార్డు, సిడ్బి ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు ఎస్‌బీఐతోపాటు పలు ఇతర బ్యాంకుల సిబ్బంది దూరంగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగానే బ్యాకింగ్ రంగం సమ్మెలో పాల్గొనిందని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం చెప్పారు. బ్యాంకింగ్ రంగంలోని 10 లక్షల మంది సిబ్బందిలో సగ భాగానికి పైగా సమ్మెకు మద్దతునిచ్చారని తెలియజేశారు. సమ్మె ప్రభావం బ్యాంకు వ్యాపార కార్యకలాపాలపై కనిపిం చిందన్నారు. బ్యాంకులన్నీ ఏటీఎం యంత్రాల్లో డబ్బుల్ని ఫుల్‌గా లోడ్ చేసి పెట్టాయని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్‌బీఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌తో సహా ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, యస్ బ్యాంకులు సమ్మెలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడ రల్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు, రత్నాకర్ బ్యాంకు, క్యాథలిక్ సిరియన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొన్నాయి.
సమ్మె విజయవంతం: బ్యాంకు యూనియన్లు
సమ్మె విజయవంతమైనట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. సమ్మె వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడిందని, ప్రధాన లావాదేవీలన్ని నిలిచిపోయాయని యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. కాగా, ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ సమ్మెకు దూరంగా ఉంది. తమ సిబ్బంది సమ్మెలో పాల్గొన లేదని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, సీడీఓ అశ్విని మెహ్రా పేర్కొన్నారు.