జమ్మలమడుగు/ఎర్రగుంట్ల : ప్రయాణికులను అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ఎర్రగుంట్ల-నంద్యాల రైలు అంత త్వరగా పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. నొస్సం వరకు అన్ని రకాల పనులు పూర్తి కావడమే గాక ఈ మార్గంలోని నూతన రైల్వే స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇక రైలు తిరగడమే తరువాయి అని అందరూ ఆశించారు. కానీ ఈ మార్గంలో సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాకే గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఈనెల 24న ఈ మార్గాన్ని పరిశీలించిన సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ అధికారి దినేష్‌కుమార్‌సింగ్ ప్రకటించడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఈ రైలు మార్గంలోని సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజే యడం, ఆ తర్వాత దీనిపై కేంద్రం పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించడం లాంటి తతంగం పూర్తి కావాల్సి ఉంది. ఇదంతా పూర్తికావడానికి ఎంతకాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే తమ పని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ మార్గంలో రైలు ఎప్పుడు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
రైల్వేస్టేషన్ సిబ్బందిని వెనక్కి పిలిపించిన అధికారులు
రైల్వే ట్రాక్, క్రాసింగ్ లెవల్, రైల్వే స్టేషన్ సిగ్నల్ సిస్టంను పరిశీలించడానికి కేంద్ర రైల్వే భద్రతాధికారి ఎస్సీ దినేష్‌కుమార్ సింగ్ వస్తుండటంతో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం రైల్వేస్టేషన్‌లలో తాత్కలికంగా అసిస్టెంట్ రైల్వేస్టేషన్ మాస్టర్‌లతో పాటు సిబ్బందిని నియమించారు. అధికారులు రైల్వేలైన్ సిగ్నల్, స్టేషన్‌లను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం సీఆర్‌ఎస్ అధికారులు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇది ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియకపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలిక సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రైలు తిరగడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాగా వచ్చే మార్చి నాటికి రైలు తిరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పుకొస్తున్నారు.
కోట్లాది రూపాయల వస్తువులకు భద్రత కరువు...
కొత్త రైల్వేస్టేషన్లలో నియమితులైన సిబ్బంది వెనక్కి వెళ్లిపోవడంతో రైల్వేస్టేషన్లు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన స్టేషన్లలోని విలువైన వస్తువుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఆర్‌ఎస్ పరిశీలన అనంతరం సిబ్బంది తిరిగి వారి పాత స్టేషన్‌లకు వెళ్లిపోవడంతో స్టేషన్లలోని సామగ్రి, పరికరాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రజాప్రతినిధులు.. రాజకీయ పార్టీలు స్పందించాలి
ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోందనే సమయంలో ఉన్నట్లుండి ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు ఇప్పట్లో కొనసాగే పరిస్థితి లేకపోవడంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు స్పందించి ఈ మార్గంలో సత్వరమే రైళ్లు తిరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే రైల్వే కార్యాలయాల వద్ద ఆ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని ప్రజాసోమ్ము దుర్వినియోగం కాకుండ చూడాలని ప్రజలు కోరుతున్నారు. సీఆర్‌ఎస్ నుంచి అనుమతులు లభిస్తే ప్రస్తుతం అరక్కోణం నుంచి కడప వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును నొస్సం వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అటు అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఆలస్యం
Published Thu, Aug 27 2015 3:41 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement