లక్ష్యం చేరని జేఎస్‌ఎస్‌కే
నిధుల ఖర్చులో విఫలం
కొరవడిన పర్యవేక్షణ
ఇదీ ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో దుస్థితి
తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జననీ శిశు సంరక్షణ కార్యక్రమం’ (జేఎస్‌ఎస్‌కే) అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న కనీస అవగాహన కల్పించలేని అధికారులు.. ఈ పథకం కింద విడుదలైన నిధులు ఖర్చు చేయడంలోనూ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
అనంతపురం మెడికల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఆధ్వర్యంలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో జేఎస్‌ఎస్‌కే అమలు అధ్వానంగా మారింది. ఏపీవీవీపీ ఆధ్వర్యంలో హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, కదిరి, మడకశిర, పెనుకొండ ఏరియా ఆస్పత్రులతో పాటు చెన్నేకొత్తపల్లి, నల్లమాడ, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) పని చేస్తున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించి తల్లీబిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నది జేఎస్‌ఎస్‌కే లక్ష్యం.
ఈ పథకం కింద ప్రతియేటా విడుదలయ్యే నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తారు. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్ర చికిత్సలు, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇస్తారు. బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలోనే విడుదల చేస్తోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.40,09,419 విడుదలయ్యాయి.
అయితే.. రూ.15,31,453 మాత్రమే ఖర్చు చేశారు. ధర్మవరం, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులకు రూ.9 లక్షల చొప్పున మంజూరు కాగా.. రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలా లేదు. ఈ పథకంపై పేద గర్భిణులకు అవగాహన కల్పించకపోవడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెనుకొండ ఏరియా ఆస్పత్రికి రూ. 4 లక్షలు కేటాయించగా.. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయడం కొసమెరుపు.
బాగా అమలవుతోంది..
ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో జేఎస్‌ఎస్‌కే పథకం బాగా అమలవుతోంది. ఉచితంగా మం దులు ఇస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డైట్ వరకు ఇస్తున్నాం. ట్రాన్స్‌పోర్ట్‌కు 108 వాడుతున్నాం. నిధులు ఖర్చు కూడా బాగుంది. - పి.సత్యనారాయణ, ఆస్పత్రుల సేవల విభాగం జిల్లా కోఆర్డినేటర్ (డీసీహెచ్‌ఎస్)
జననీ శిశు ‘నిర్లక్ష్యం’
Published Wed, Aug 5 2015 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement