APVVP
-
331 వైద్య పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వివరించారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుని దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు hmfw.ap.gov.in లో చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 06301138782 ఫోన్ నంబరులోగానీ,apvvpwalkinrecruitment@gmail.com లోగానీ సంప్రదించాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48 వేలకుపైగా పోస్టులను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. -
వేల కళ్లలో వెలుగులు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ♦ సీఎం జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్ తదితరులున్నారు. ♦ ఏపీ ఎన్జీవోలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ♦ కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్‌రెడ్డి, ఏపీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు. ♦ క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్విసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్ సెక్రటరీ ఆర్.గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్ పార్క్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు. 14 స్పెషాలిటీల్లో 319 పోస్టులను నోటిఫై చేయగా 316 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో 112 పోస్టులు శాశ్వత, 50 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. వీటిలో జనరల్ మెడిసిన్ 28, జనరల్ సర్జరీ 27, గైనకాలజీ 33, అనస్తీషియా 22, పాథాలజీ 12, పీడియాట్రిక్స్ 12, మిగిలిన స్పెషాలిటీల్లో ఇతర పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. -
వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు.. 143 మంది వైద్యుల హాజరు
సాక్షి, అమరావతి: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు 143 మంది వైద్యులు హాజరయ్యారు. శుక్రవారం రాత్రికి మెరిట్ జాబితాలను సిద్ధం చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన ఏడుగురు గైనిక్, నలుగురు ఈఎన్టీ, ఆరుగురు పెథాలజీ, 13మంది అనస్తీషియా స్పెషాలిటీ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ఈఎన్టీ, ఒక పెథాలజీ వైద్యులకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారం జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. -
వైద్య ఉద్యోగుల ఆందోళన బాట
తణుకు అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగులమా.. ప్రైవేటు ఉద్యోగులమా.. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగా తమని ఎందుకు ట్రెజరీ పరిధిలోకి తీసుకురాలేదు.. సీఎఫ్ఎంఎస్ కోడ్ ఎందుకు ఇవ్వలేదు.. తమపై ఎందుకీ వివక్ష.. ఇది సేవాతత్వంతో కూడిన వైద్యవృత్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగుల మనోవేదన. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రారంభించిన కాంప్రెహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్)లోకి తమను ఎందుకు తీసుకురాలేదనేది ఆ ఉద్యోగులకు ప్రశ్నార్ధకంగా మారింది. ట్రెజరీకి సంబంధం లేకపోవడంతో వారికి రాయితీలు అందడంలేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులతోపాటు వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగులను ట్రెజరీ విధానంలోకి తీసుకువెళ్లినా, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను తీసుకురాలేదు. ట్రెజరీ 101 పద్దు ద్వారా తమకు వేతనాలు ఇవ్వాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. ఈ విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల ఉద్యోగులు ఈనెల 28 నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఈవిధంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. జూలై నెల 2 నుంచి 5వ తేదీ వరకు ఆస్పత్రుల ఎదుట ధర్నాలు చేయనున్నారు. ఏపీవీవీపీ రాష్ట్ర అసోసియేట్ ఆదేశాల మేరకు వైద్యవర్గాలు ఆందోళన బాటపట్టాయి.సీఎఫ్ఎంఎస్ విధానంలేక ఇబ్బందులు సీఎఫ్ఎంఎస్ విధానంలోకి వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో వేతనాల్లో జీపీఎఫ్, జీఐఎస్ రికవరీలు, ఏపీజీఎల్ఐ వంటి సదుపాయాలు మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ రాయితీలు వర్తించడంలేదు. హెల్త్ కార్డుల మంజూరులో జాప్యం, మూడు నెలలుగా వేతనాల్లోంచి నగదు కట్ అవుతున్న బీమా సంస్థలకు చేరడంలేదు. దీంతో బీమా సౌకర్యానికి ఆటంకం ఏర్పడుతోంది. డీఏ, సరెండర్ లీవులు, ఎరియర్స్ అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగికైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా వర్తించకపోవడంతో ఏ రకంగా వైద్యం చేయించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. విభజించి పాలిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను విభజించి పాలిస్తోంది. ట్రెజరీతో సంబంధంలేని వేతనాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ రాయితీల్లో ఎప్పుడూ జాప్యమే. హెల్త్ కార్డులు రాని పరిస్థితి ఉంది. సీఎఫ్ఎంఎస్ విధానంలోకి చేర్చాలి.– వైవీఎస్‌బీ రాయుడు, తణుకు శాఖ కార్యదర్శి,వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10 వేల మందికి ఇబ్బంది ప్రభుత్వ చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విధానంతో మూడు నెలలుగా ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్స్‌లు నిలిచిపోయాయి. మా వేతనాల్లోంచి కట్ అవుతున్న సొమ్ము బీమా సంస్థలకు చేరడం లేదు. ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.– ఎన్ఎస్వీ రామకృష్ణ,జిల్లా కన్వీనర్, వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏలూరు -
జననీ శిశు ‘నిర్లక్ష్యం’
లక్ష్యం చేరని జేఎస్ఎస్కే నిధుల ఖర్చులో విఫలం కొరవడిన పర్యవేక్షణ ఇదీ ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో దుస్థితి తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జననీ శిశు సంరక్షణ కార్యక్రమం’ (జేఎస్ఎస్కే) అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న కనీస అవగాహన కల్పించలేని అధికారులు.. ఈ పథకం కింద విడుదలైన నిధులు ఖర్చు చేయడంలోనూ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అనంతపురం మెడికల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఆధ్వర్యంలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో జేఎస్ఎస్కే అమలు అధ్వానంగా మారింది. ఏపీవీవీపీ ఆధ్వర్యంలో హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, కదిరి, మడకశిర, పెనుకొండ ఏరియా ఆస్పత్రులతో పాటు చెన్నేకొత్తపల్లి, నల్లమాడ, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) పని చేస్తున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించి తల్లీబిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నది జేఎస్ఎస్కే లక్ష్యం. ఈ పథకం కింద ప్రతియేటా విడుదలయ్యే నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తారు. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్ర చికిత్సలు, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇస్తారు. బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలోనే విడుదల చేస్తోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.40,09,419 విడుదలయ్యాయి. అయితే.. రూ.15,31,453 మాత్రమే ఖర్చు చేశారు. ధర్మవరం, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులకు రూ.9 లక్షల చొప్పున మంజూరు కాగా.. రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలా లేదు. ఈ పథకంపై పేద గర్భిణులకు అవగాహన కల్పించకపోవడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెనుకొండ ఏరియా ఆస్పత్రికి రూ. 4 లక్షలు కేటాయించగా.. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయడం కొసమెరుపు. బాగా అమలవుతోంది.. ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో జేఎస్ఎస్కే పథకం బాగా అమలవుతోంది. ఉచితంగా మం దులు ఇస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డైట్ వరకు ఇస్తున్నాం. ట్రాన్స్పోర్ట్కు 108 వాడుతున్నాం. నిధులు ఖర్చు కూడా బాగుంది. - పి.సత్యనారాయణ, ఆస్పత్రుల సేవల విభాగం జిల్లా కోఆర్డినేటర్ (డీసీహెచ్ఎస్) -
ముగిసిన స్పెషాలిటీ వైద్యుల కౌన్సెలింగ్
గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి గుంటూరులో బుధవారం ప్రారంభమైన కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర కౌన్సెలింగ్‌లో తొలిరోజు 147 మంది, రెండోరోజు 130 మంది స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా నియామక పత్రాలు తీసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 327 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా 277 ఖాళీలు భర్తీ అయ్యాయి. మిగిలిన 50 పోస్టులను ఎలా, ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ జి.శాంతారావు తెలిపారు. మిగిలిన పోస్టుల్లో సర్వీస్ డాక్టర్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్నారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలో... ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)కమిషనర్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు గురువారం గుంటూరు వైద్య కళాశాలలో కౌన్సెలింగ్ జరిగింది. మొత్తం 40 పోస్టులకు 24 మంది వైద్యులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఏపీవీవీపీ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్, ఏవో వెంకటయ్య, ఏడీ రాజీవ్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెథాలజీ, గైనకాలజీ వైద్య విభాగాల్లో పోస్టులకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా పెథాలజీ పోస్టులు పెరిగిన నేపథ్యంలో గురువారం కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి కౌన్సెలింగ్ నిర్వహణ తేదీలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. -
పోలియో రహిత సమాజానికి కృషి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియోచుక్కలు వేయించి పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్(ఏపీవీవీపీ) జాయింట్ కమిషనర్ డాక్టర్ లోక్‌నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క చిన్నారినీ వదలిపెట్టకుండా అందిరికీ పోలియోచుక్కలు వేసేలా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ మాట్లాడుతూ తొలిరోజు పోలియో చుక్కల కేంద్రాల్లో నిర్దేశించిన పనివేళల్లో వైద్య సిబ్బంది అందరూ విధుల్లో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆదేశించారు. మూడు రోజులు ఇంటింటికి తిరిగి చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలన్నారు. ఎక్కడైనా రియాక్షన్ వస్తే తక్షణమే జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 4,26,419 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని నూరుశాతం సాధించేలా ప్రణాళికా బద్ధంగా వైద్యసిబ్బంది పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్ గుంటూరుసిటీ: జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.సురే శ్‌కుమార్ తెలిపారు. ఆదివార స్థానిక కృష్ణబాబు కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు ఆయన పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా నిలిపేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకోసం దాదాపు 2,500 కేంద్రాలు, పదివేల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు కె.ఎస్ లక్షణరావు, డీఎంహెచ్‌వో గోపీనాయక్, మెప్మా పీడీ కృష్ణకపర్థి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.. ఏటీఅగ్రహారం(గుంటూరు): పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు చిన్నారుల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఎస్పీలు జెట్టి గోపినాథ్, జె.సత్యనారాయణ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్లీనిక్‌లో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కిషన్‌కుమార్, అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జానకీ ధరావత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.