గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి గుంటూరులో బుధవారం ప్రారంభమైన కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర కౌన్సెలింగ్‌లో తొలిరోజు 147 మంది, రెండోరోజు 130 మంది స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా నియామక పత్రాలు తీసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 327 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా 277 ఖాళీలు భర్తీ అయ్యాయి. మిగిలిన 50 పోస్టులను ఎలా, ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ జి.శాంతారావు తెలిపారు. మిగిలిన పోస్టుల్లో సర్వీస్ డాక్టర్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్నారు.
వైద్యవిధాన పరిషత్ పరిధిలో... ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)కమిషనర్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు గురువారం గుంటూరు వైద్య కళాశాలలో కౌన్సెలింగ్ జరిగింది. మొత్తం 40 పోస్టులకు 24 మంది వైద్యులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఏపీవీవీపీ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్, ఏవో వెంకటయ్య, ఏడీ రాజీవ్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెథాలజీ, గైనకాలజీ వైద్య విభాగాల్లో పోస్టులకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా పెథాలజీ పోస్టులు పెరిగిన నేపథ్యంలో గురువారం కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి కౌన్సెలింగ్ నిర్వహణ తేదీలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
ముగిసిన స్పెషాలిటీ వైద్యుల కౌన్సెలింగ్
Published Thu, Jul 23 2015 9:05 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM
Advertisement
Advertisement