తణుకు ఏరియా ఆస్పత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాలు
తణుకు అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగులమా.. ప్రైవేటు ఉద్యోగులమా.. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగా తమని ఎందుకు ట్రెజరీ పరిధిలోకి తీసుకురాలేదు.. సీఎఫ్‌ఎంఎస్ కోడ్ ఎందుకు ఇవ్వలేదు.. తమపై ఎందుకీ వివక్ష.. ఇది సేవాతత్వంతో కూడిన వైద్యవృత్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగుల మనోవేదన. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రారంభించిన కాంప్రెహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్)లోకి తమను ఎందుకు తీసుకురాలేదనేది ఆ ఉద్యోగులకు ప్రశ్నార్ధకంగా మారింది. ట్రెజరీకి సంబంధం లేకపోవడంతో వారికి రాయితీలు అందడంలేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులతోపాటు వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగులను ట్రెజరీ విధానంలోకి తీసుకువెళ్లినా, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను తీసుకురాలేదు. ట్రెజరీ 101 పద్దు ద్వారా తమకు వేతనాలు ఇవ్వాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. ఈ విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల ఉద్యోగులు ఈనెల 28 నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఈవిధంగా నిరసన వ్యక్తం చేయనున్నారు.
జూలై నెల 2 నుంచి 5వ తేదీ వరకు ఆస్పత్రుల ఎదుట ధర్నాలు చేయనున్నారు. ఏపీవీవీపీ రాష్ట్ర అసోసియేట్ ఆదేశాల మేరకు వైద్యవర్గాలు ఆందోళన బాటపట్టాయి.సీఎఫ్‌ఎంఎస్ విధానంలేక ఇబ్బందులు
సీఎఫ్‌ఎంఎస్ విధానంలోకి వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో వేతనాల్లో జీపీఎఫ్, జీఐఎస్ రికవరీలు, ఏపీజీఎల్‌ఐ వంటి సదుపాయాలు మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ రాయితీలు వర్తించడంలేదు. హెల్త్ కార్డుల మంజూరులో జాప్యం, మూడు నెలలుగా వేతనాల్లోంచి నగదు కట్ అవుతున్న బీమా సంస్థలకు చేరడంలేదు. దీంతో బీమా సౌకర్యానికి ఆటంకం ఏర్పడుతోంది. డీఏ, సరెండర్ లీవులు, ఎరియర్స్ అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగికైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా వర్తించకపోవడంతో ఏ రకంగా వైద్యం చేయించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
విభజించి పాలిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను విభజించి పాలిస్తోంది. ట్రెజరీతో సంబంధంలేని వేతనాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ రాయితీల్లో ఎప్పుడూ జాప్యమే. హెల్త్ కార్డులు రాని పరిస్థితి ఉంది. సీఎఫ్‌ఎంఎస్ విధానంలోకి చేర్చాలి.– వైవీఎస్‌బీ రాయుడు, తణుకు శాఖ కార్యదర్శి,వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్
10 వేల మందికి ఇబ్బంది
ప్రభుత్వ చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విధానంతో మూడు నెలలుగా ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్స్‌లు నిలిచిపోయాయి. మా వేతనాల్లోంచి కట్ అవుతున్న సొమ్ము బీమా సంస్థలకు చేరడం లేదు. ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.– ఎన్‌ఎస్‌వీ రామకృష్ణ,జిల్లా కన్వీనర్, వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment