పోలియో రహిత సమాజానికి కృషి
Published Mon, Jan 20 2014 1:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియోచుక్కలు వేయించి పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్(ఏపీవీవీపీ) జాయింట్ కమిషనర్ డాక్టర్ లోక్‌నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క చిన్నారినీ వదలిపెట్టకుండా అందిరికీ పోలియోచుక్కలు వేసేలా చూడాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ మాట్లాడుతూ తొలిరోజు పోలియో చుక్కల కేంద్రాల్లో నిర్దేశించిన పనివేళల్లో వైద్య సిబ్బంది అందరూ విధుల్లో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆదేశించారు. మూడు రోజులు ఇంటింటికి తిరిగి చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలన్నారు. ఎక్కడైనా రియాక్షన్ వస్తే తక్షణమే జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 4,26,419 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని నూరుశాతం సాధించేలా ప్రణాళికా బద్ధంగా వైద్యసిబ్బంది పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్
గుంటూరుసిటీ: జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.సురే శ్‌కుమార్ తెలిపారు. ఆదివార స్థానిక కృష్ణబాబు కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు ఆయన పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా నిలిపేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకోసం దాదాపు 2,500 కేంద్రాలు, పదివేల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు కె.ఎస్ లక్షణరావు, డీఎంహెచ్వో గోపీనాయక్, మెప్మా పీడీ కృష్ణకపర్థి తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి..
ఏటీఅగ్రహారం(గుంటూరు): పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు చిన్నారుల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఎస్పీలు జెట్టి గోపినాథ్, జె.సత్యనారాయణ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్లీనిక్‌లో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కిషన్‌కుమార్, అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జానకీ ధరావత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement