మార్చి నుంచి భూముల రీసర్వే | Re-survey of lands from March | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి భూముల రీసర్వే

Published Wed, Nov 25 2015 3:25 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మార్చి నుంచి భూముల రీసర్వే - Sakshi

మార్చి నుంచి భూముల రీసర్వే

♦ రాష్ట్రవ్యాప్తంగా మారనున్న సర్వే నంబర్లు
♦ రికార్డుల అప్‌డేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ శాఖ
♦ ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 275 కోట్లు
 
 సాక్షి, హైదరాబాద్: బూజు పట్టిన రికార్డులను దుమ్ముదులిపే ప్రక్రియకు రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ రికార్డులన్నింటినీ అప్‌డేషన్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం 1952 నాటి సర్వే నంబర్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, తాజాగా చేపట్టనున్న భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా కొత్త సర్వే నంబర్లు రానున్నాయని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు.

రెవెన్యూ రికార్డుల అప్‌డేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చేపట్టిన ఈ-పహాణీతో భూముల యజమానులు, సాగుచేస్తున్న రైతులు, పంటల వివరాల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచే రెవెన్యూ యం త్రాంగం ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చే స్తోంది. దీనిలో భాగంగానే భూమి ప్రస్తుత యజమానుల పేర్లను రికార్డుల్లో చేర్చే (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సులువు చేయాలని భూపరిపాలన విభాగం నిర్ణయించింది. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ను సీసీఎల్‌ఏ వెబ్‌సైట్(వెబ్‌ల్యాండ్)తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ ప్రక్రియతో ఎప్పటికప్పుడు (అప్‌డేట్‌గా) మ్యుటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

 ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ కింద రూ.275 కోట్లు
 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ భూమి రికార్డులను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ భూమి రికార్డు ఆధునీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) చేపట్టింది. దీని కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 275 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అందినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంతో పాటు భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్‌లోగా కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి ఆయా రాష్ట్రాల్లో భూముల రీసర్వే మోడల్స్‌ను అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.

 సర్వేయర్ పోస్టులకు త్వరలో...
 ఈ నేపథ్యంలో సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. గత ఎనిమిదేళ్లుగా సర్వేయర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగక పోవడంతో ఈ విభాగంలో ఖాళీగా ఉన్న సుమారు 400 సర్వేయర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది. సర్వేయర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను శుక్రవారం జరగనున్న రెవెన్యూ ఉన్నతాధికారుల సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్‌లో సర్వేయర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement