ఆహారధాన్యాల ఉత్పత్తికి భారీ గండి
- గత ఖరీఫ్‌లో 23 లక్షల టన్నులు తగ్గిన వైనం
- 2015-16 తాజా జాతీయ వార్షిక నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి భారీగా గండి పడింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులే కారణమని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. 2015-16 ఖరీఫ్‌లో ఏకంగా 23 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసిన ‘2015-16 వార్షిక నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. 2014-15 ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి 12.63 కోట్ల టన్నులు కాగా, 2015-16 ఖరీఫ్‌లో అది కాస్తా 12.40 కోట్లకు పడిపోయింది. బియ్యం అంతకుముందు ఖరీఫ్ కంటే కాస్తంత తగ్గినా గత ఏడాది ఖరీఫ్‌లో 9.06 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది.
నూనెగింజల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. 2014-15లో 1.83 కోట్ల నూనె గింజలు ఉత్పత్తి కాగా... 2015-16లో 1.98 కోట్ల టన్నులకు పెరిగింది. చెరకు ఉత్పత్తి మాత్రం 1.79 కోట్ల టన్నులు తగ్గింది. 2014-15లో 35.93 కోట్ల టన్నులు చెరకు ఉత్పత్తి కాగా, 2015-16లో 34.14 కోట్లు తగ్గింది. ఏకంగా 1.79 కోట్లు తగ్గడంతో చక్కెర, బెల్లం కొరత ఏర్పడే ప్రమాదముంది. 2014-15లో 3.54 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2015-16లో అది కాస్తా 3.35 కోట్ల బేళ్లకు పడిపోయింది.
కరువు పరిస్థితులే కారణం...
గతేడాది దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనడం వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయిందని జాతీయ వార్షిక నివేదిక విశ్లేషించింది. 2015 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశంలో వర్షపాతం సాధారణం కంటే 14 శాతం లోటు ఉంది. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీల్లో 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోయిందని కేంద్ర నివేదిక విశ్లేషించింది.
రూ. 2.19 లక్షల కోట్లు తగ్గిన వ్యవసాయ రుణాలు
2015-16లో దేశవ్యాప్తంగా రూ. 8.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ 2015 డిసెంబర్ నాటికి కేవలం రూ. 6.30 లక్షల కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకులు ఇచ్చాయి. ఏకంగా రూ. 2.19 లక్షల కోట్లు ఇవ్వకుండా రైతులకు వెన్నుచూపాయి. అయితే, 2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8 లక్షల కోట్లు కాగా, ఏకంగా రూ. 8.45 లక్షల కోట్లు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.45 వేల కోట్లు అధికంగా ఇచ్చిన బ్యాంకులు ఆ తర్వాత సంవత్సరంలో వ్యవసాయ రుణాలను తగ్గించడం గమనార్హం.