సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యాపారుల సముచిత పాత్రకు వీలు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పట్ల రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ వ్యాపారుల లాభాపేక్షకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ఇస్తోన్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)’ కనుమరగవుతుందన్నదే వారి ఆందోళనకు అసలు కారణం. కనీస మద్దతు ధరపై కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామంటూ మోదీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. అయినప్పటికీ దేశంలోని రైతులు మోదీ ప్రభుత్వాన్ని నమ్మక పోగా, ఎందుకు వ్యవసాయ బిల్లులను శంకిస్తున్నారు ? పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు?
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు నిర్వహించే మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైన బయటి ప్రైవేటు మార్కెట్లలో లేదా మండీల్లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ది పార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ బిల్లు వీలు కల్పిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ హయాంలోని మార్కెట్ కమిటీలు కనీస మద్దతు ధరకు గోధమలు, బియ్యం సేకరించడం తగ్గిపోతుందని, ఆమేరకు తాము నష్టపోతామన్నది రైతుల ఆందోళనని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సీరజ్ హుస్సేన్ తెలిపారు. కాలక్రమంలో ప్రభుత్వ వ్యయసాయ మార్కెట్ కమిటీలు కూడా రద్దు కావచ్చని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
(చదవండి: రబీ పంటల ‘మద్దతు’ పెంపు)
ప్రైవేటు మార్కెట్ శక్తుల వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందన్నది రైతుల భయం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే ఎక్కువ ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ఆ రెండు రాష్ట్రాల నుంచే 80–90 శాతం వరకు కనీస మద్దత ధరపై ప్రభుత్వం వరి, గోధుమలను కొనుగోలు చేస్తుండడం. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన గోధమలు, వరిలో 52 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం 1960లో కేంద్రం ‘హరిత విప్లవం’ ఈ రెండు రాష్ట్రాల నుంచే ప్రారంభించడం. హరిత విప్లవం కారణంగా ఈ రెండు రాష్ట్రాలో అధిక దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఫలితంగా గోధుమలు, వరి రేట్లు పడిపోవడంతో కేంద్రం ‘కనీస మద్దతు ధర’ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతుల డిమాండ్‌పై ఈ విధానాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కనీస మద్దతు ధర వల్ల ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాలే లాభ పడుతున్నాయా?
కనీస మద్దతు ధర ఎత్తివేయాలా?
ఈ విధానాన్ని ఎత్తివేయాలా ? వద్దా ? అన్న అంశంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 5.8 శాతం మంది రైతులే ఎంఎస్‌పీ కింద తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ఈ విషయంలో పంజాబ్, హర్యానా రైతుల తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులే ఎంఎస్‌పీ కింద లబ్ధి పొందుతున్నారని 2015లో శాంత కుమార్ కమిటీ ఓ నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కువగా పెద్ద రైతుల నుంచే కొనుగోళ్లు ఎక్కువ చేస్తున్నాయి. కేంద్రం 23 రకాల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించగా, వాటిలో వరి, గోధుమలనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంఎస్‌పీ కింద పప్పు దినుసల కొనుగోళ్లు పెరిగాయి.
ఒకప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు ఆ అవసరం లేదని, ఎంఎస్‌పీ కన్నా మార్కెట్ ధరలు తక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎంఎస్‌పీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంత కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఎంఎస్‌పీ స్కీమ్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్పూ కేంద్రం 1997లో చట్టంలో సవరణ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంఎస్‌పీ అమలు చేయడం వల్ల ప్రభుత్వాలపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చోప చర్చలు జరగుతున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులో ఎంఎస్‌పీ విధానానికి తగిన రక్షణలు కల్పించక పోవడంతో ఎప్పుడైనా ఆ విధానానికి కేంద్రం చెల్లు చీటి చెప్పవచ్చన్నది రైతులకు వీడని శంక.
(చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే)
Comments
Please login to add a commentAdd a comment