‘అప్రకటిత’ యుద్ధం
Published Sun, Oct 6 2013 2:15 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి మిగులు స్థితిలో ఉన్నా.. తెలంగాణ కోసం ఇక్కడ అప్రకటి త కోతలు విధిస్తారా?.. అక్కడ 24 గంటల సరఫరా.. ఇక్కడేమో చీటికీమాటికీ కోతల వాత లా??.. అంటూ జేఏసీ నాయకులు, సమైక్యవాదులు శనివారం రాత్రి చిలకపాలెం సబ్‌స్టేషన్‌పైకి దండెత్తారు. శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు కోత విధిం చారు. శనివారం కూడా సాయంత్రం 6.30 నుంచి 9.30 వరకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో సరఫరా నిలిపివేశారు. ఉదయం కూడా మూడు గంటల కోత విధించారు. తెలంగాణ జిల్లాల కోసం అత్యంత కీలకమైన రాత్రిపూట కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ, అధికారులను నిల దీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ సభ్యులు, జిల్లా జేఏసీ నాయకులు, ఎచ్చెర్ల, చిలకపాలెం ప్రాంతాలకు చెందిన యువకులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని సుమారు గంటన్నర సేపు కదం తొక్కారు. మొదట వీరంతా ఎచ్చెర్లలో యూనివర్సిటీ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపి వేశారు.
అక్కడి నుంచి చిలకపాలెంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లారు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న అధికారులు పోలీసు బలగాలను మోహరించారు. సబ్ స్టేషన్ లోపలికి జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. యువకులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారంతా జాతీయ రహదారిపై సబ్ స్టేషన్ హోర్డింగ్ పై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. లోపలికి దూసుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. టోల్ ప్లాజా హోర్డింగ్‌ను కర్రలతో కొట్టి, రాళ్లు రువ్వారు. అయినా సంయమనంతో వ్యవహరించిన పోలీసులు ఈపీడీసీఎల్ అధికారులతో జేఏసీ నాయకులు చర్చలు జరుపుతున్నారని కాస్త ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో వారు జాతీయ రహదారి పక్కన బైఠాయించారు.
మరోవైపు లోపలికి వెళ్లిన జేఏసీ నాయకులకు సబ్ స్టేషన్ కార్యాలయంలో కీలక అధికారులెవరూ కనిపించలేదు. 9.30కు సరఫరా పునరుద్ధరించాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారని అక్కడి సిబ్బంది చెప్పారు. సరఫరా వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని మీ అధికారులకు చెప్పండి.. అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ గుంట తులసీరావు, జిల్లా జేఏసీ నాయకులు శిష్టు రమేష్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, దుప్పల వెంకటరావు, వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, పి.ప్రసాద్, భావన చక్రవర్తి తదితరులు సిబ్బందికి సూచించారు. ఆ మేరకు సిబ్బంది ఫోనులో ఉన్నతాధికారులతో మాట్లాడారు. అప్పటికే విద్యుత్ సరఫరాలో జాప్యం కావటంతో సమైక్యవాదులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకోగా వారితోనూ వాగ్వాదం జరిగింది. ఇవి జరుగుతుండగానే సరఫరా ఇచ్చేయాలని సబ్ స్టేషన్ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో రాత్రి 8.45 గంటల సమయంలో ప్రాంతాలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో శాంతించిన సమైక్యవాదులు మళ్లీ రాత్రి సమయంలో కోత విధిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి, అక్కడి నుంచి వెనుదిరిగారు.
Advertisement
Advertisement