
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్‌లో టన్నెల్ లోకి మంత్రి
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్‌లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రి.. దాదాపు ఐదు గంటల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయక చర్యల్లో పాలు పంచుకుని తిరిగి బయటికి వచ్చారు. ప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్‌లో మంత్రి జూపల్లి మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు.

ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీ. సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు.. ‘‘100 మిటర్లలోనే సమస్య ఉంది. నీరు, బురద ఎక్కువగా ఉంది. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో నేవీ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. రాత్రికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు నేవీ బృందం చేరుకోనున్నారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment