విభజనేందిరో.. మీ స్వార్థమేందిరో | United Andhra Movement in Seemandhra without selfish | Sakshi
Sakshi News home page

విభజనేందిరో.. మీ స్వార్థమేందిరో

Published Fri, Sep 6 2013 3:50 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

United Andhra Movement in Seemandhra without selfish

 సాక్షి, కర్నూలు: ఉద్యమం ఉప్పెనవుతోంది. సమైక్యవాదులు కదనరంగంలో నిర్విరామ పోరాటం సాగిస్తున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు వారి స్థాయిలో తీవ్రత పెంచుతున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. రాష్ట్రం ముక్కలవుతున్నా నాయకులు రాజీనామాలు చేయకుండా ఎందుకు పదవులు పట్టుకుని వేళాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. జేసీబీ యజమానులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో 50 జేసీబీలతో ర్యాలీ చేపట్టారు. పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారపేటలోని పశు వైద్యశాల నుంచి రాజ్‌విహార్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు జై సమైక్యాంధ్ర బెలూన్లతో భారీ ర్యాలీ చేశారు.
 
  ఎన్టీఆర్ సర్కిల్‌లో అరగంట పాటు మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గ్రంథాలయ సంస్థ, కలెక్టరేట్‌లోని స్టేట్ ఆడిట్ అధికారులు, ఉద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మహా ర్యాలీ కొనసాగింది. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి షిండే, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఉరేగించారు. న్యాయవాదుల నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి కోట్ల, టీజీ, ఎమ్మెల్యే మురళి కనపడటం లేదంటూ పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సర్కిల్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు మాస్ డ్రిల్ చేపట్టారు. అధ్యాపకులు కర్రసాము, నాన్‌చాక్ విద్యలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఆదోనిలో రెండో రోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో.. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా దూదేకొండ గ్రామస్తులు 20 మంది దీక్షలో కూర్చొన్నారు. దేవనకొండలో తాపీ వర్కర్లు వివిధ వేషధారణల్లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటంతో నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement