సమైక్య రాష్ట్రానికి కట్టుబడింది వైసీపీనే
Published Thu, Sep 19 2013 4:19 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
సమైక్య రాష్ట్రానికి కట్టుబడిందని రాష్ట్రంలో ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన సమైక్యాంధ్ర ఏజెన్సీ ప్రజాగర్జనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ స్వార్థపూరిత కుట్రను ముందే పసిగట్టిన తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు ముందుగానే రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ 50 రోజులుగా ప్రజాఉద్యమం జరుగుతుంటే యూపీఏ సర్కారు పాలకులు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
నాడు స్వతంత్య్ర పోరాటానికి సత్యాగ్రహ ఉద్యమం ఏవిధంగా సాగిందో నేడు సీమాంధ్రలో అదే విధమైన ఉద్యమం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన శాసన సభ్యులు వారి పదవులకు స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రకటన వచ్చేది కాదని బాలరాజు అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల నేడు అన్ని వర్గాల సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యోగులకు బోనస్‌తో పాటు జీతాలు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరేటి సత్యనారాయణ, కరాటం కృష్ణస్వరూప్, గద్దే వీరకృష్ణ, గద్దే బాబూ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ గగ్గులోతు మోహన్‌రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement