కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు.
ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్‌ఎస్ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్‌ఎస్‌కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు.
ముషీరాబాద్ బాధ్యత నాదే
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్‌ఎస్ పార్టీ చేసింది ఏమీలేదన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజవర్గ కన్వి నర్ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment